TRS Candidate : మునుగోడులో నిర్వహించిన ప్రజాదీవెన సభలో అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని కేసీఆర్ ప్రకటిస్తారని అనుకున్నారు. టీఆర్ఎస్ వర్గాలు కూడా ఈ విషయాన్ని గట్టిగా చెప్పాయి. కూసుకంట్లకు నియోజకవర్గంలో పని చేసుకోమని చెప్పారు. ఆయన గ్రామాల్లో తిరుగుతున్నారు. ఇతర పార్టీల నేతల్ని ఆకర్షించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అనూహ్యంగా కేసీఆర్ మునుగోడు ప్రజాదీవెన సభలో అసలు అభ్యర్థి గురించి ప్రశ్నించలేదు. పైగా వ్యక్తుల మధ్య కాదు ఎన్నికలు జరుగుతోందని కేసీఆర్ పదే పదే చెప్పారు. తనను అభ్యర్థిగా ప్రకటిస్తారని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనుకున్నారు. ఆయన సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. చివరికి అభ్యర్థిగా ప్రకటించకపోవడంతో ఆయన నిరాశకు గురయ్యారు. 


అభ్యర్థిగా కూసుకుంట్లను ప్రకటిస్తారని ప్రచారం


అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. ఆయనకు వ్యతిరేకంగా అన్ని మండలాల నేతలు సమావేశం పెట్టారు. వారిలో చౌటుప్పల్ ఎంపీపీ బీజేపీలో చేరిపోయారు. మిగిలిన అసంతృప్తి నేతలకు సర్దిచెప్పేందుకు మంత్రి జగదీష్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కానీ వారు ఎక్కువగా సంతృప్తి పడటం లేదు.  అసంతృప్తుల్లో ముఖ్యమైన నేతలను కూడా కేసీఆర్ పిలిపించుకుని మాట్లాడారు. అభ్యర్థి ఎవరైనా సరే గెలుపు కోసం పని చేయాలని సూచించి పంపించారు. ఆ తర్వాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు ఫైనల్ చేశారని ప్రజాదీవెన సభలో ప్రకటిస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. 


అభ్యర్థి ప్రకటన వల్ల సమస్యలు వస్తాయని భావించారా ?


అయితే సీఎం కేసీఆర్ మాత్రం ఇప్పుడే అభ్యర్థి ప్రకటన వల్ల అనేక సమస్యలు వస్తాయని భావించినట్లుగా తెలుస్తోంది. గతంలో హుజురాబాద్ ఉపఎన్నికల సమయంలో షెడ్యూల్ రాక ముందు ఆశావహులందర్నీ బుజ్జగించి అభ్యర్థిని ప్రకటించారు. ఈ కారణంగా అందరూ టీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం ప్రయత్నించారు. కానీ ఫలితం రాలేదు అది వేరే విషయం. ఈ సారి కూడా అలాగే చేస్తారనుకున్నారు. కానీ గతంలోలా పరిస్థితులు లేవని.. అసంతృప్తులు ఊరుకోరని..వారికి  బీజేపీ గాలం వేస్తుందని కేసీఆర్ అనుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే అభ్యర్థి అంశాన్ని పెండింగ్‌లో పెట్టారు. 


బీసీ అభ్యర్థికి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారా ?


అదే సమయంలో టీఆర్ఎస్‌లో అభ్యర్థిత్వం బీసీకి ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ .. ఇదే డిమాండ్‌ను వినిపించారు. టిక్కెట్‌ను బీసీకే ప్రకటించాలన్నారు. మరో నేత కర్నె ప్రభాకర్ కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆయన కూడా బీసీ వర్గానికి చెందిన వారు. కొంత మంది సీనియర్ బీసీ నేతలు ఇలా మాట్లాడటంతో.. అభ్యర్థి విషయంలో మరోసారి పరిశీలన చేయాలని కేసీఆర్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అభ్యర్థిని ప్రకటించలేదు కాబట్టి..   ఇక ముందు ప్రకటించరని.. షెడ్యూల్ వచ్చినప్పుడు మాత్రమే క్లారిటీ ఇస్తారని అంటున్నారు. అప్పటి వరకూ నియోజకవర్గంలో మండలాల వారీగా ప్రకటించిన ఇంచార్జులు ప్రచారాన్ని నిర్వహించనున్నారు.  ఈ విషయంలో  కూసుకంట్లకు టీఆర్ఎస్ నేతలు భరోసా ఇస్తున్నట్లుగా చెబుతున్నారు.