Regional Parties Vs Central Agencies CBI ED:  జాతీయ రాజకీయాల్లో కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రత్యామ్నాయ శక్తులను ఒకే తాటిపైకి తెచ్చేందుకు భారత రాష్ట్ర సమితి అధినేత కే.చంద్రశేఖర్ రావు మళ్లీ వేగంగా పావులు కదుపుతున్నారని కేటీఆర్ సంకేతాలు ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి నియంత్రణను, దర్యాప్తు సంస్థల  దూకుడును ఎదుర్కొనేందుకు ఒక పటిష్టమైన ఫెడరల్ ఫ్రంట్  లేదా రీజినల్ అలయన్స్ అవసరమనే చర్చను బీఆర్ఎస్ తిరిగి తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా ఏపీలో అధికారం కోల్పోయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  , ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్   లాంటి బలమైన ప్రాంతీయ దిగ్గజాలతో మళ్లీ టచ్‌లోకి వెళ్లేందుకు గులాబీ దళపతి గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిళ్లలో చర్చ సాగుతోంది.

Continues below advertisement

ఇబ్బందుల్లో ప్రాంతీయ పార్టీలు

ఈ  ప్రాంతీయ కూటమి  ప్రయత్నంలో కేసీఆర్‌తో కలసి రావడానికి ఏ పార్టీకి ఎంతవరకు సానుకూలత ఉందనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, కేసీఆర్‌కు మధ్య మొదటి నుంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ అధికారం కోల్పోయాక, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్, బీజేపీల ఉమ్మడి రాజకీయ ఒత్తిడి పెరిగిన తరుణంలో జగన్-కేసీఆర్‌లు ఒకరికొకరు మద్దతుగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి ఎదురవుతున్న  ఒత్తిళ్లను తట్టుకోవడానికి, పార్లమెంట్ పరిధిలోనూ ప్రాంతీయ బలాన్ని ప్రదర్శించడానికి ఈ ఇద్దరు నేతలు ఒకే వేదికపైకి రావడం ఇరు పార్టీలకు రాజకీయంగా ఊరటనిచ్చే అంశం.  పశ్చిమ బెంగాల్‌లో   మమతా బెనర్జీ, ఈ  థర్డ్ ఫ్రంట్  మోడల్‌కు ప్రధాన భాగస్వామిగా మారే అవకాశాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో కలస్తున్నా.. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ నేతలు మమతా బెనర్జీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా లేరు.  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తన పెద్దన్న  పాత్రను రుద్దడాన్ని దీదీ మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. ప్రాంతీయ పార్టీల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, అలాగే బెంగాల్ వేదికగా కేంద్ర ప్రభుత్వంతో సాగిస్తున్న పోరాటంలో ప్రాంతీయ మిత్రుల మద్దతు పొందేందుకు మమత-కేసీఆర్‌ల వ్యూహాలు సులువుగా సరిపోతాయి. గతంలో కూడా కేసీఆర్ కలకత్తా వెళ్లి మమతా బెనర్జీతో జరిపిన భేటీలు, ఆ తర్వాత రూపొందించిన ఫెడరల్ ఫ్రంట్ కార్యాచరణ ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

Continues below advertisement

యూపీ ఎన్నికల ఫలితాలను బట్టి అఖిలేష్ నిర్ణయం

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్   కూడా కాంగ్రెస్‌పై పూర్తిగా ఆధారపడటానికి సిద్ధంగా లేరు. ఎస్పీకి ఉన్న యాదవ-ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే, జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టేందుకు బలమైన ప్రాంతీయ నాయకత్వాన్ని ఆయన కోరుకుంటున్నారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌తో జరిగిన పలు సమావేశాల్లో అఖిలేష్ పాల్గొనడం, రైతు సమస్యలు, ఫెడరలిజంపై ఒకే విధమైన విధానాలను పంచుకోవడం వల్ల కేసీఆర్ పిలుపునిస్తే కలసి నడిచే ప్రధాన నాయకులలో అఖిలేష్ యాదవ్ ముందువరుసలో ఉంటారని భావించవచ్చు.   ఒడిశాలో సుదీర్ఘకాలం పాలించి ఇటీవల ప్రతిపక్షంలోకి వచ్చిన బిజూ జనతాదళ్  అధినేత నవీన్ పట్నాయక్ వైఖరి ఇక్కడ చాలా కీలకమైనది. గతంలో  సమాన దూరం పాటించిన బీజేడీ, ఇటీవల ఒడిశాలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎన్డీయేతో సంబంధాలను పూర్తిగా తెంచుకుంది. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాంతీయ నిధుల సాధన కోసం కఠిన వైఖరి అవసరమని భావిస్తున్న నవీన్ పట్నాయక్, కేంద్రానికి కౌంటర్ ఇచ్చేందుకు ఈ ప్రాంతీయ వేదికకు మద్దతిచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని అంటున్నారు.         

ధర్డ్ ఫ్రంట్ అంత ఈజీ కాదు!

ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవడం వెనుక ఉన్న ముఖ్య ప్రణాళిక  రాజకీయ రక్షణ . నిధుల పంపిణీలో కేంద్ర ప్రభుత్వ వివక్షను ప్రశ్నించడం, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల వాడకంపై ఉమ్మడిగా పార్లమెంట్ లోపల, బయటా నిరసనలు తెలపడం ద్వారా కేంద్రంపై తీవ్ర రాజకీయ ఒత్తిడి తెవచ్చని వీరు లెక్కలు వేస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ అనుకున్నట్లుగా ఈ ప్రాంతీయ దిగ్గజాలందరినీ ఒకే వేదికపైకి తీసుకురాగలిగితే, జాతీయ స్థాయిలో మూడో కూటమి మళ్లీ కీలకమైన శక్తిగా అవతరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.