తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకాల్సి ఉన్న సీఎం కేసీఆర్ ఆ బాధ్యతలను మంత్రి తలసానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  ఈ మేరకు తెలంగాణ చీఫ్ మినిస్టర్ కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రధాని మోడీకి స్వాగతం, వీడ్కోలు కూడా ముఖ్యమంత్రి తరపున తలసాని శ్రీనివాస్ యాదవే చెబుతారు. ప్రధాని పర్యటనకు ఒక్క రోజు ముందుగా సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయవర్గాలను ఆశ్చర్య పరిచింది. 




కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు పెద్దగా కేటాయింపులు చేయలేదని.. అలాగే అసలు బడ్జెట్ దేశానికి ఉపయోగపడదని విమర్శిస్తూ కేసీఆర్ ఫిబ్రవరి ఒకటో తేదీన రెండున్నర గంటల పాటు ప్రెస్‌మీట్ పెట్టారు. ప్రధానమంత్రి మోడీని, బీజేపీని తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపైనా మండిపడ్డారు. ఇంత తీవ్రంగా విమర్శించిన తరవాత మరి తెలంగాణకు వస్తున్న మోడీ పర్యటనలో పాల్గొంటారా అన్నదానిపైనా చర్చలు జరిగాయి.కేసీఆర్ కూడాప్రెస్‌మీట్‌లో  ప్రధాని పర్యటనలో పాల్గొంటానని.. నేరుగా ఆయనకే అన్నీ చెబుతానని స్పష్టం చేశారు.  ప్రోటో కాల్ ప్రకారం ప్రధానికి స్వాగతం చెబుతారని .. కార్యక్రమాల్లో పాల్గొంటారని.. అధికారిక కార్యక్రమాలకు రాజకీయానికి సంబంధం లేదని టీఆర్ఎస్ వర్గాలు కూడా నిన్చెనటి వరకూ బుతూ వచ్చాయి . దీంతో ప్రధాని పర్యటనలో పాల్గొంటారని అందరూ అనుకున్నారు. 


శుక్రవారం ఉదయం వరకూ కేసీఆర్ ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతారని .. ఇక్రిశాట్‌లోనూ.. అలాగే ముచ్చింతల్‌లో జరిగే రామానుజుల సహస్రాబ్ది కార్యక్రమాల్లోనూ కలిసే పాల్గొంటారని భావిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఇన్ని తీవ్రమైన విమర్శలు చేసిన తర్వాత మళ్లీ ప్రధాని మోడీకి స్వాగతం చెప్పి ఆయనతో సాధారణంగా వ్యవహరిస్తే కేసీఆర్ పోరాటం అంతా బూటకమేనని విపక్షాలు ప్రచారం చేస్తాయి. ప్రజల్లో అలాంటి అభిప్రాయమే ఏర్పడే అవకాశం ఉంది. అదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ అన్ని పార్టీలను ఏకం చేయాలనుకుంటున్నారు. వారిలోనూ ఎలాంటి సందేహాలు రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ వ్యూహకర్తలు ప్రధాని మోడీకి కేసీఆర్ స్వాగతం చెప్పేందుకు వెళ్లకపోవడమే మంచిదని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. 


అయితే ప్రధానికి స్వాగతం చెప్పే కార్యక్రమాల బాధ్యతను మంత్రి తలసానికి అప్పగించారు కానీ.. మోడీ పాల్గొనే కార్యక్రమాల్లోనూ పాల్గొనకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా ఎక్కడా సమాచారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో ప్రధానితో పాటు కేసీఆర్ పాల్గొంటారని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ పాల్గొంటారని ప్రధానికి నిరసన కూడా తెలియచేస్తారని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.