Telangana Model :   నరేంద్రమోదీకి దేశవ్యాప్తంగా క్రెజ్ తెచ్చిపెట్టి ప్రధాని అభ్యర్థిగా నిలబడినప్పుడు బాహుబలి రేంజ్ రావడానికి కారణం అయింది గుజరాత్ మోడల్ అభివృద్ధి. దేశాన్ని ఆలా చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ గుజరాత్‌లో పారిశ్రామికాభివృద్ధి తప్ప ఇతర అభివృద్ధి లేదని విపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. అందుకే మోదీని ఢీ కొట్టాలనుకుంటున్న కేసీఆర్ గుజరాత్ మోడల్‌కు తెలంగాణ మోడల్‌తో చెక్ పెట్టానుకుంటున్నారు. దానికి సంబంధించిన కార్యచరణ ఖరారు చేసుకున్నారు. ఇక ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఆలస్యం. 


గుజరాత్‌లో అభివృద్ధి ఏమీ లేదంటున్న టీఆర్ఎస్ !


అభివృద్ధి పథంలో ఒక్కొక్క మెట్టు ఎక్కు తూ అనేక రంగాల్లో తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికే స్ఫూర్తినిచ్చేలా తీర్చిదిద్దారని కానీ గుజరాత్‌లో సంక్షేమం, అభివృద్ధి గురించి దేశ ప్రజలు చర్చించుకునే విధంగా ఏ ఒక్క కార్యక్రమానికీ బీజేపీ రూపకల్పన చేయలేకపోయిందని టీఆర్ఎస్ చెబుతోంది.  తెలంగాణలో ప్రారంభించిన సంక్షేమ పథకాలు ముఖ్యంగా రైతుబంధు, రైతుబీమా అన్నదాతకు ఆలంబనగా నిలిచాయని...కానీ గుజరాత్‌లో అలాంటి పరిస్థితి లేదంటున్నారు. గుజరాత్ మోడల్ పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజల బతుకుల్ని భారం చేశాని టీఆర్ఎస్ చెబుతోంది. అభివృద్ధి విషయంలో సరైన కార్యాచరణ లేని బీజేపీ సర్కార్‌ పాలనలో రూపాయి పతనం దేశ ఆర్థిక తిరోగమనానికి సంకేతమంటోంది.   2014లో డాలర్‌తో రూపా యి మారక విలువ రూ.62గా ఉన్నప్పుడు మొసలి కన్నీరు కార్చిన మోదీ.. బీజేపీ పాలనలో రూ.82కు చేరిన తరుణంలో దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ....ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని అంటోంది. 


పన్నుల భారాన్ని హైలెట్ చేయనున్న కేసీఆర్


అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతున్నా.. దేశంలో మాత్రం పెట్రో ల్‌, డీజిల్‌ ధరలు తగ్గడం లేదు. వంట గ్యాస్‌ ధరల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అం త మంచిదని టీఆర్ఎస్ గుర్తు చేస్తోంది.  దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయి. మోదీ సర్కార్‌ దేశానికి చేసింది మాత్రం శూన్యమని.. దేశప్రజలను మోసం చేసి రూ.వేల కోట్లు ఎగ్గొటిన ఆర్థిక నేరస్థులను దేశానికి రప్పించడంలో విఫలమయ్యారని టీఆర్ఎస్ చెబుతోంది.  నల్లధనం వెనక్కి రావడం మాట అటుంచితే రూ.లక్షల కోట్ల ను కార్పొరేట్లకు మాఫీ చేసిన మోదీ.. సంక్షేమ పథకాలను ఉచితాలు అంటూ విమర్శలు గుప్పించడం దారుణమని ఇదే విషయాన్ని ప్రజలకు చెబుతామంటున్నారు. 


తెలంగాణ మోడల్ అంటే చెప్పడానికి ఎన్నో అంశాలు!
 
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్‌ ఏం చేశారో చెప్పడానికి కొన్ని వందల కార్యక్రమా లు ఉన్నాయి. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, ఆసరా, కల్యాణలక్ష్మి, రైతుబంధు, చేనేతకు చేయూత, సంక్షే మ హాస్టళ్లు ఇలా అనేక కార్యక్రమాలతో తెలంగాణను ప్రగతిశీల రాష్ట్రంగా తీర్చిదిద్దారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ ఏలుబడిలో ఉన్న దేశం వెనుకబడుతున్నది. అభివృద్ధి, సంక్షేమంలో సంక్షోభం నెలకొన్నది. ఉపాధి కల్పన అడుగంటుతున్నది. మోదీ నాయకత్వంలో సకల రంగాల్లో స్తబ్ధత ఏర్పడింది. ఈ క్రమంలో యావత్‌ దేశం తెలంగాణ వైపు చూస్తున్నది. సవాళ్లు ఎన్నున్నా.. రాష్ట్రం ప్రగతి సాధిస్తుండడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతున్నది. ఈ తరుణంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనాదక్షతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాలని, దేశానికి నాయకత్వం వహించాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయని టీఆర్ఎస్ చెబుతోంది. 


 భారీ ప్రచార కార్యక్రమాలకు రూపకల్పన !


కేసీఆర్ ఒక్క సారి జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత జాతీయ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం వచ్చేలా ప్రకటనలు ఇవ్వనున్నారు. ఇక సోషల్ మీడియా సంగతి చెప్పాల్సిన పని లేదు. టీఆర్ఎస్‌కు ఆర్థికంగా బలమైన వనరులు ఉన్నాయి. వందల కోట్లు ఖర్చు పెట్టి అయినా సరే... తెలంగాణ మోడల్ వర్సెస్ గుజరాత్ మోడల్ అన్నట్లుగా చర్చ జరిగేలా చూడాలని భావిస్తున్నారు. అప్పుడే మోదీ పాలన వైఫల్యాలు బయట పడతాయని.. తెలంగాణ అభివృద్ధిపై చర్చ జరుగుతుందని .. అలా జరిగినప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర బలంగా వేస్తారని నమ్ముతున్నారు.