BRS Politics After Christmas :  భారత రాష్ట్ర సమితికి సంబందించిన కిసాన్ సెల్ కార్యకలాపాలను ముందుగా ఆరు రాష్ట్రాల్లో ప్రారంభించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.   ‘ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ’ అనే నినాదంతో ముందుకు పోవాలని పార్టీ అధికారిక ఆవిర్భావం నాడు హైద్రాబాద్లో  ప్రకటించిన అధినేత కేసీఆర్ అందుకు అనుగుణంగా ముందస్తుగా 6  రాష్ట్రాల్లో బిఆర్ ఎస్ కిసాన్ సెల్ లను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు కసరత్తులు పూర్తి చేసుకుని క్రిస్మస్ పండగ అనంతరం ఆయా రాష్ట్రాల్లో కార్యకలాపాలను వేగవంతం చేయాలని నిర్ణయించారు. 


కిసాన్ సెల్ బాధ్యతలు చేపట్టేందుకు ఆరు రాష్ట్రాల నుంచి రైతు నాయకుల అంగీకారం !


 ఉత్తర భారతం, ఇటు తూర్పు, మధ్య భారతాలకు చెందిన  పలు రాష్ట్రాలనుంచి అనేకమంది మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ రాజకీయ నాయకులు, తమ టీం లతో, అనుచరులతో వచ్చి స్వయంగా అధినేత కేసీఆర్ తో సంప్రదింపులు జరిపుతున్నారని టీఆర్ెస్ వర్గాలు చెబుతున్నాయి.    ఆయా రాష్ట్రాల్లోని భౌగోళిక సామాజిక సాంస్కృతిక   పరిస్థితులను అనుసరించి అక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు ఎటువంటి విధానాలను అవలంభించాలో వారికి కేసీఆర్ వివరిస్తున్నారు.  ఈ నెలాఖరుకల్లా పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిస్సా, సహా ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బిఆర్ఎస్ కిసాన్ సెల్ లను ప్రారంభించనున్నారు.


ఏపీ నుంచి కూడా పలువురు ఆసక్తి !
 
భారత రాష్ట్ర సమితి కిసాన్ సెల్ బాధ్యతలు చేపట్టేందుకు ఏపీ నుంచి కూడా పలువురు ఆసక్తి చూపిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  సిఎం కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీలో పనిచేయడానికి తమకు అవకాశం కల్పించాలని ఇప్పటికే ఢిల్లీలో ఇటు హైద్రాబాద్ లో అధినేత కేసీఆర్ తో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు చర్చలు సంప్రదింపులు జరుపుతున్నారన బీఆర్ఎస్ వర్గాలు  చెబుతున్నాయి.  ఆంధ్రాలోని పలు జిల్లాల్లో బిఆర్ ఎస్ కిసాన్ సెల్ ను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు.  అధినేత ప్రకటన అనంతరం ఆంధ్రాలో ‘ బిఆర్ కె ఎస్ (బిఆర్ఎస్ కిసాన్ సెల్) ’ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.  


బిఆర్ ఎస్ భావజాల వ్యాప్తి  కోసం అన్ని భాషల్లో పుస్తకాలు


కన్నడ, ఒరియా, మరాఠా,వంటి పలు భారతీయ భాషలకు చెందిన రచయితలు, సాహితీవేత్తలు, పాటల రచయితలతో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు.  బిఆర్ఎస్ పార్టీ చేపట్టబోయే కార్యాచరణ గురించి భావజాల వ్యాప్తి కోసం సన్నాహాలు చేస్తున్నారు.   రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో అందుకోవాల్సిన గుణాత్మక మార్పులు ఏమిటి.? ఈ దేశ సకల జనులకు సబ్బండ వర్గాల ఆకాంక్షలకు చిరునామాగా బిఆర్ఎస్ ఎట్లా నిలవబోతున్నది ? వంటి అంశాలను భాషా సాహిత్యాలు రచనలు పాటల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించారు.  
 
నెలాఖరులో కేసీఆర్ ప్రెస్ మీట్  


బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడలేదు. డిసెంబర్ నెలాఖరున.ఢిల్లీ వేదికగా జాతీయ మీడియాతో కెసిఆర్ భేటీ కానున్నారు.  ఈ సందర్భంగా పలు జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలు, వార్తా సంస్థల జర్నలిస్టులతో బిఆర్ఎస్ అధినేత సమావేశం కానున్నారు. డిసెంబర్ నెలాఖరు లో ఢిల్లీ లో నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసి బిఆర్ఎస్ పార్టీ సిద్దాంతాలు భవిష్యత్తు కార్యాచరణ సహా  విధి విధానాలను ప్రకటించనున్నారు.