KCR Medchal :  మతం పేరిట దేసాన్ని విభజించే కుట్ర జరుగుతోందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లాలో కలెక్టరేట్ భవనాలను ప్రారంభించిన తర్వాత  ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించారు.  తెలంగాణ ధనిక రాష్ట్రమని ఉద్యమ టైంలో చెప్పాను. వనరుల దోపిడీ ఆగిపోతుందని కాబట్టి ధనిక రాష్ట్రమని చెప్పాను. తెలంగాణ ఏర్పడ్డ టైంలో తలసరి ఆదాయం లక్ష రూపాయుల ఉంటే.. ఇప్పుడు ఇండియాలోనే నెంబర్‌ వన్‌గా రెండు లక్షల 78వేల 500 రూపాయలుగా ఉందన్నారు. మనకంటే ముందే ఏర్పడ్డ రాష్ట్రాలను దాటిపోయామన్నారు. చాలా క్రమశిక్షణతో అవినీతి ఆస్కారం లేకుండా... పని చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. తెలంగాణలోని కొత్త జిల్లాల్లో  ఉన్న కలెక్టరేట్‌లాంటి సచివాలయాలు కూడా కొన్ని రాష్ట్రాల్లో లేవన్నారు. దేశంలోనే ఎక్కువ గురుకుల పాఠశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ  అని కేసీఆర్ స్పష్టం చేశారు. 


త్వరలో అప్లయ్ చేసుకున్న వారందరికీ కొత్త రేషన్ కార్డులు 


తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్ల పాలన ప్రజలు ఎంత దగ్గరగా వస్తే అంత మంచి జరుగుతుందన్నారు.  సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కార్యాలయాలు చుట్టూ తిరిగే అవసరం లేకుండా బ్యాంకు ద్వారా అందుతున్నాయి. రాష్ట్రంలో 36 లక్షలు ఉన్నాయి. మరో 10 లక్షలు పంపిణీ జరుగుతుంది. కరోనా కారణంగా ఇది ఆలస్యమైంది. ఇది మొత్తం 46 లక్షల మంది పింఛన్లు అందుకుంటున్నారని కేసీఆర్ చెప్పారు.  అందరికీ కొత్తకార్డులు పంపిణీ చేస్తారు. ఇందులో ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొంటారని కేసీఆర్ తెలిపారు. 


తెలంగాణలో ఇన్వర్టర్లు, జనరేటర్లు, మోటార్ వైండింగ్ సంస్థలు దివాలా ! 


తెలంగాణలో 24 గంటలు కరెంటు ఇస్తున్నామని .. దేశంలో 75 ఏళ్ల పాలనలో చేతగాని తనం వల్ల బ్యాడ్  పాలసీల వల్ల దేశం మొత్తం విద్యుత్ కొరత ఉందన్నారు. హైదాబాద్‌లో కరెంటు పోదు... దిల్లీలో కరెంటు రాదని సెటైర్ వేశారు.  ఆదిలాబాద్ జిల్లాలోని లంబాడీ తండా నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్‌ వరకు కరెంటు పోదు. కేసీఆర్‌ కంటే ఒడ్డూపొడుగూ ఉన్న వాళ్లు చాలా మంది సీఎంలు అయ్యారు. వాళ్లెవరూ ఎందుకు కరెంటు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు.   ఎన్ని ట్రాన్స్‌ఫార్మర్లు పేలినాయో తెలియదు. కరెంటు కోసం ధర్నాలు చేసిన సంగతి చూశాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణలో ఇన్వర్టర్లు, జనరేటర్లు, మోటార్‌ వైడింగ్‌ సంస్థలు దివాళా తీశాయని సెటైర్ వేశారు. 


ఎమ్మెల్యేలకు అభివృద్ధి పనులకు రూ. 15 కోట్లు !


తెలంగాణలో ఎమ్మెల్యేలకు అభివృద్ధి పనుల కోసం 15 కోట్లు కేటాయిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ఐదు కోట్లు ఇచ్చామన్నారు. త్వరలో మరో పది కోట్లు మంజూరు చేస్తామన్నారు.   కరోనా రాకుంటే గురుకుల పాఠశాలలు ఇంకా పెంచేవాళ్లం. తెలంగాణలో ఉన్న కూలీలు సరిపోవడం లేదని... 12 రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి ఇక్కడ బతుకుతున్నారని కేసీఆర్ తెలిపారు.   ఏ సమాజమైతే.. ఏ ప్రజలైతే ఆలోచన లేకుండా ఉంటారో... నిర్లక్ష్యంగా ఉంటారో వాళ్లు దెబ్బతింటారు. అరవైళ్ల క్రితం తెలంగాణ ప్రజానీకం నిద్రాణమై ఉండేది. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. ఇన్నేళ్లు పోరాటం చేస్తే... ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. ఇప్పుడే కానీ.. ఏపీలో కలిసి ఉంటే ఇన్ని పనులు జరిగేవా... అందుకే దేశంలో జరిగే పరిణామాలపై ప్రజలు చర్చించాలన్నారు. చైతన్యవంతమైన సమాజం ఉంటే రాష్ట్రం పురోగమిస్తుంది. ఒక బంగ్లా కట్టాలంటే చాలా కష్టమైతది... కట్టాలంటే మాత్రం చాలా ఏళ్లు పడుతుందన్నారు. 


భారత్‌ను కులం, మతం పేరిట విభజించే ప్రయత్నం ! 


భారత్‌ దేశాన్ని కులం పేరిట మతం పేరిటే విడదీసే ప్రయత్నం జరుగుతోంది. ఇది మంచి పద్దతి కాదు. ఎంతో మంది స్వాతంత్య్ర యోధులు త్యాగాలు చేసి స్వేచ్ఛను ప్రసాదించారు. దీన్ని మనం అనుభవించాలంటే... భారతీయత అనే నినాదంతో నడవాలన్నారు.  కులమతాలతో విడిపోతే నష్టపోతామని కేసీఆర్ హెచ్చరించారు.  దేశంలో అపారమైన సంపద ఉంది. కానీ అది దేశానికి చెందడం లేదు. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలి.  ఇప్పుడు తెలంగాణను నాశనం చేయడానికి కొందరు సిద్ధమవుతున్నారు. ఇలాంటివి మీ మీ ప్రాంతాల్లో చర్చ జరగాలి. మోసపోతే చాలా గోస పడే ప్రమాదం ఉంటుంంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలివిగా ఉండాలి. మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీరంతా ఐకమత్యంగా ఉండి... రాష్ట్ర ప్రగతి దోహదపడుతూ.. దేశ అభివృద్ధికి పాటుపడదామని ప్రజలుక కేసీఆర్ పిలుపునిచ్చారు.