Kavitha forming a party under the name TRS: తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుదుపునకు రంగం సిద్ధమవుతోంది.  కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు ముహుర్తం ఖరారు చేసుకున్న కవిత.. తన పార్టీకి టీఆర్ఎస్ (TRS) అనే ఎమోషనల్ సెంటిమెంట్‌ కలిసిన పేరును పార్టీకి ఖరారు చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి పెను సమస్య కావొచ్చు.   

Continues below advertisement

పేరు మార్పు - చారిత్రక తప్పిదం 

తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)ని భారత రాష్ట్ర సమితి (BRS)గా మార్చడం అనేది కేసీఆర్ చేసిన అతిపెద్ద రాజకీయ తప్పిదమని ఇప్పుడు సొంత పార్టీ నేతలే బహిరంగంగా అంగీకరిస్తున్నారు. జాతీయ రాజకీయాల మోజులో  తెలంగాణ అనే అస్తిత్వాన్ని వదులుకోవడం వల్ల ప్రజలతో ఉన్న పేగుబంధం తెగిపోయిందని క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్ చెబుతోంది. ఎన్నికల ఓటమి తర్వాత మళ్లీ పాత పేరుకు మారదామని కేటీఆర్ సహా ఇతర నేతలు భావించినా, సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యం కాదని కేసీఆర్ తేల్చేశారు. సరిగ్గా ఈ ఖాళీనే కవిత తన రాజకీయ ఎదుగుదలకు అనువుగా మలచుకుంటున్నారు.

Continues below advertisement

 వ్యూహాత్మక అడుగు - ఎమోషనల్ డ్యామేజ్ 

ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ వద్ద  టీఆర్ఎస్ పేరు ఫ్రీగా ఉందని, దానిని ఎవరైనా వాడుకోవచ్చని కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నాయకత్వానికి పెద్ద షాక్. ఒకవేళ కవిత నిజంగానే తన కొత్త పార్టీకి  టీఆర్ఎస్  అని పేరు పెడితే, అది బీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎమోషనల్ డ్యామేజ్ కలిగిస్తుంది. రెండు దశాబ్దాల పాటు తెలంగాణ వాదం వినిపించిన ఆ పేరు పట్ల క్యాడర్‌లో ఇప్పటికీ విపరీతమైన ఆదరణ ఉంది. ఇప్పుడు అదే పేరుతో కవిత ముందుకు వస్తే, బీఆర్ఎస్ వైపు ఉన్న అసంతృప్త నేతలు, పాత ఉద్యమకారులు ఆమె వైపు మొగ్గు చూపే అవకాశం పుష్కలంగా ఉంది.

 సిద్ధాంతాల పోరు - తెలంగాణ వర్సెస్ బిహార్ 

కవిత తన చిట్ చాట్‌లో మరో కీలక విమర్శ చేశారు. తమ పార్టీలో  బిహార్ సిద్ధాంతకర్తలు  ఉండరని, కేవలం ఆచార్య జయశంకర్ గారి తెలంగాణ సిద్ధాంతాలే ఉంటాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన పొలిటికల్ స్ట్రాటజిస్టుల పెత్తనాన్ని ఎండగడుతూ, తాను మళ్లీ స్వచ్ఛమైన తెలంగాణ ఉద్యమ కాలపు పార్టీని తీసుకొస్తానని ఆమె సంకేతాలిచ్చారు. ఇది నేరుగా కేటీఆర్ అనుసరిస్తున్న కార్పొరేట్ తరహా రాజకీయాలపై ఆమె చేసిన దాడిగా విశ్లేషకులు భావిస్తున్నారు.  బీఆర్ఎస్ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని, తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే శక్తి లేదని కవిత విమర్శిస్తున్నారు. ఒకవేళ ఏప్రిల్ 25న ఆమె ప్రకటించబోయే కొత్త పార్టీ పేరులో తెలంగాణ  సెంటిమెంట్ బలంగా ఉంటే, క్షేత్రస్థాయిలో ఉన్న గులాబీ శ్రేణులు అయోమయంలో పడటం ఖాయం. బీఆర్ఎస్ కంటే టీఆర్ఎస్ అనే పేరుకే తెలంగాణ సమాజంలో గుర్తింపు ఎక్కువ. ఆ పేరును కవిత గనుక సొంతం చేసుకుంటే, కేసీఆర్ స్థాపించిన సుదీర్ఘ రాజకీయ వారసత్వాన్ని ఆమె తన వైపు తిప్పుకున్నట్లవుతుంది.

పాత పేరు - కొత్త ఎజెండా తెలంగాణ అస్తిత్వమే పునాదిగా ఎదిగిన కేసీఆర్ కుటుంబంలోనే ఇప్పుడు పేరు  కోసం పోరు మొదలైంది. తండ్రి వదులుకున్న అస్త్రమే ఇప్పుడు తనయకు ఆయుధంగా మారింది. ఈ  పాత పేరు - కొత్త ఎజెండా  వ్యూహం తెలంగాణ రాజకీయ చిత్రపటాన్ని ఎలా మారుస్తుందో చూడాలి. ఒకవేళ కవిత  టీఆర్ఎస్ ను మళ్లీ బతికిస్తే, అది బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందా లేదా అన్నది కవిత పనితీరుపైనే ఆధారపడి ఉంటుందని అనుకోవచ్చు.