Kavitha new Party Mistakes: రాజకీయాల్లో ఒక కొత్త పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే స్పష్టమైన అజెండా, అంతకంటే స్పష్టమైన పేరు ఉండాలి. కానీ, కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ విషయంలో మొదటి అడుగులోనే అయోమయం నెలకొంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆవిష్కరణ కార్యక్రమాలు, సోషల్ మీడియా హంగామా చేసిన కవిత టీమ్, ఇప్పుడు అధికారికంగా తెలంగాణ రక్షణ సేన పేరును తెరపైకి తెచ్చింది. అసలు రాష్ట్ర సేన పేరు కోసం ఆమె దరఖాస్తు కూడా చేయలేదని వెల్లడికావడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
పేరు కోసం అడ్డదారి.. చివరకు తప్పని తిప్పలు
పాత టీఆర్ఎస్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే TRS అనే సంక్షిప్త నామం వచ్చేలా రాష్ట్ర సేన పేరును కవిత ఎంచుకున్నారు. అయితే, బీఆర్ఎస్ నుండి వచ్చే తీవ్రమైన అభ్యంతరాలు, సాంకేతిక ఇబ్బందుల వల్ల ఆ పేరు దక్కదని ముందే గ్రహించి, సేఫ్ సైడ్‌గా రక్షణ సేన ను ప్రతిపాదించినట్లు కనిపిస్తోంది. కానీ, ప్రచారానికి ఒక పేరు, దరఖాస్తుకు మరో పేరు వాడటం ఆమె పార్టీ విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉంది.
సోషల్ మీడియా హంగామా.. క్షేత్రస్థాయిలో కన్‌ఫ్యూజన్
పార్టీకి సంబంధించిన అన్ని సోషల్ మీడియా ఖాతాలను రాష్ట్ర సేన పేరుతోనే ప్రారంభించి, లోగోలు, జెండాలు కూడా అదే పేరుతో ఆవిష్కరించారు. ఇప్పుడు తీరా ఈసీ నుండి రక్షణ సేన పేరుతో పబ్లిక్ నోటీసు వచ్చేసరికి, కనీసం వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా కవిత టీమ్ చేయలేదు. ఈ స్థాయిలో తడబాటు ఉంటే ప్రజలు పార్టీని ఎంతవరకు సీరియస్‌గా తీసుకుంటారనే చర్చ మొదలైంది. రాజకీయం అంటే కేవలం ఈవెంట్ మేనేజ్‌మెంట్ కాదని, ప్రతి అడుగులోనూ పారదర్శకత ఉండాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈసీ గుర్తింపు రాలేదు.. అప్పుడే సంబరాలా?
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కవిత పార్టీకి ఎన్నికల కమిషన్ ఇంకా అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. కేవలం పేరు నమోదు కోసం అప్లికేషన్ పెట్టుకుంటే, అభ్యంతరాల స్వీకరణ కోసం ఈసీ నోటీసు ఇచ్చింది. ఇది ఒక ప్రాథమిక దశ మాత్రమే. కానీ, కవిత టీమ్ మాత్రం అప్పుడే ఈసీ ఆమోదం తెలిపేసిందని, తమదే అసలైన టీఆర్ఎస్ అని ప్రచారం చేసుకోవడం వారి అత్యుత్సాహానికి నిదర్శనం. అభ్యంతరాల స్వీకరణ తర్వాతే ఫైనల్ రిజిస్ట్రేషన్ జరుగుతుందనే కనీస అవగాహన లేకుండా ప్రకటనలు చేయడం ఆమెను రాజకీయంగా డిఫెన్స్‌లో పడేసింది.
కవిత ఎందుకింత కంగారు పడుతున్నారు?
పార్టీ పేరు విషయంలో ఇంత భారీ వ్యత్యాసం ఉన్నప్పుడు, కనీసం తన అనుచరులకు లేదా ప్రజలకు క్లారిటీ ఇవ్వకుండా కవిత ఎందుకు దాగుడుమూతలు ఆడుతున్నారనేది మిస్టరీగా మారింది. అబద్ధపు ప్రచారంతో సెంటిమెంట్‌ను రగిల్చవచ్చని భావిస్తే అది వికటించే అవకాశం ఉంది. రాష్ట్ర సేన కాకపోయినా రక్షణ సేన అయినా టీఆర్ఎస్ వస్తుంది కదా అనే భావనలో ఉన్నారు. ఏదైనా కొత్త వ్యవస్థను ప్రారంభించేటప్పుడు పునాదులు బలంగా ఉండాలి. కానీ, కవిత పార్టీ ప్రారంభం నుండే అస్థిరమైన ప్రకటనలు, పేరు మార్పులు, సాంకేతిక లోపాలతో సాగుతోంది. ఈ గందరగోళం ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో ప్రజల నుండి ఆశించిన మద్దతు లభించడం కష్టమే. రాజకీయాల్లో బిగినర్స్ మిస్టేక్స్ సహజమే అయినా, పార్టీ పేరు వంటి అత్యంత ప్రాథమిక విషయంలోనే ఇన్ని తడబాట్లు రావడం కవిత రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది.
