Congress Internal Feud Karnataka Politics :  కర్ణాటక రాజకీయాల్లో ప్రస్తుతం  స్టింగ్ ఆపరేషన్‌ల  రగడ తుఫాను రేపుతోంది. ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్ నాయకులను లక్ష్యంగా చేసుకుని రహస్య వీడియోలు తీయడం, వాటి ఆధారంగా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడటం వంటి పరిణామాలు బెంగళూరు పవర్ సర్కిల్స్‌ను కంపింపజేస్తున్నాయి. ముఖ్యంగా, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అగ్రనేత సిద్ధరామయ్య స్వయంగా తన ప్రతిష్టను దిగజార్చేందుకు ఒక  ఫేక్ స్టింగ్ ఆపరేషన్ వీడియోను సృష్టించి తనను బ్లాక్‌మెయిల్ చేసేందుకు యత్నించారని బహిరంగంగా ఆరోపించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది.

Continues below advertisement

మహిళా నేత, టీవీ చానల్ అధినేతపై ఆరోపణలు  

ఈ సంచలన విచారణలో సిద్ధరామయ్య స్వయంగా తన సొంత కాంగ్రెస్ పార్టీకి చెందిన దక్షిణ కన్నడ మహిళా నేత కృపా అల్వాతో పాటు పవర్ టీవీ ఛానెల్ అధినేత రాకేష్ శెట్టి పేర్లను ప్రస్తావించడం వివాదాన్ని మరింత రాజేసింది. అసెంబ్లీ టికెట్ ఆశించి లబ్ధి పొందడం కోసం లేదా తన రాజకీయ ఇమేజ్‌ను దెబ్బతీయడం కోసమే ఈ కుట్ర పన్నినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది తనిఖీల్లో తేలాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఆయన సివిల్ కోర్టును ఆశ్రయించి సదరు వీడియో ప్రసారాలపై ఇంజంక్షన్ ఆర్డర్  కూడా పొందారు.ట

Continues below advertisement

మెటా గ్లాసెస్‌తో స్టింగ్ చేశారన్న  సీఎం శివకుమార్ 

ఈ స్టింగ్ ఆపరేషన్ల పర్వం కేవలం సిద్ధరామయ్యతోనే ఆగలేదు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా తనను, ఇతర మంత్రులను టార్గెట్ చేస్తూ స్టింగ్ ఆపరేషన్లు చేయడానికి ప్రయత్నాలు జరిగాయని బాంబు పేల్చారు. ఒక వ్యాపారవేత్త తన వద్దకు  మెటా స్మార్ట్ గ్లాసెస్  పెట్టుకుని వచ్చి రహస్యంగా సంభాషణలను రికార్డ్ చేసేందుకు యత్నించారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.   కేబినెట్ మంత్రులందరూ తమ పీఏలు, మూడో వ్యక్తి ఫోన్ కాల్స్, అనుమానాస్పద భేటీల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేబినెట్ సమావేశంలోనే హెచ్చరికలు జారీ చేశారు. 

బీజేపీ  ప్రైవేటు ఏజెన్సీని మాట్లాడుకుందని కాంగ్రెస్ ఆరోపణలు

మరోవైపు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గణిగ సైతం ఆరోపణలు చేస్తూ.. కేంద్ర మంత్రి, ప్రతిపక్ష బీజేపీ నేతలు కలిసి సుమారు 10 మంది మంత్రులతో పాటు సీఎంఓ  ని లక్ష్యంగా చేసుకుని స్టింగ్ ఆపరేషన్లు చేయడానికి ప్రైవేట్ ఏజెన్సీలకు భారీగా నిధులు సమకూర్చారని ఒక పెన్ డ్రైవ్‌ను ప్రదర్శించడం రాజకీయ రణరంగాన్ని తీవ్రతరం చేసింది. ప్రతిపక్ష నేత హెచ్‌డీ కుమారస్వామి వంటి వారు మాత్రం ఇది కాంగ్రెస్ అంతర్గత ముఠా తగవుల ఫలితమేనని, సిద్ధరామయ్యను దించేసేందుకు సొంత పార్టీ నేతలే ఈ రహస్య ఆపరేషన్లు నడిపిస్తున్నారని ఎదురుదాడి చేస్తున్నారు.

కాంగ్రెస్ అంతర్గత పోరే కారణమా? 

 కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నడుస్తున్న అంతర్గత అధికార పోరు, ముఠా తగవులు మరియు ప్రతిపక్షాల వ్యూహాత్మక మైండ్ గేమ్‌ల కలబోతే ఈ  స్టింగ్ సంస్కృతి కి కారణమని స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి పదవి మార్పిడి లేదా పార్టీలో ఆధిపత్యం కోసం సాగుతున్న పోరులో ఒకరినొకరు రాజకీయంగా దెబ్బతీసుకునేందుకు ఇలాంటి బ్లాక్‌మెయిలింగ్ అస్త్రాలను ఉపయోగిస్తున్నారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. సొంత పార్టీ నేతలే విచారణ పరిధిలోకి రావడంతో కేపీసీసీ కూడా సదరు మహిళా నేతకు నోటీసులు జారీ చేసింది. కర్ణాటకలో చోటుచేసుకుంటున్న ఈ స్టింగ్ ఆపరేషన్ల రగడ కేవలం సిద్ధరామయ్య లేదా డీకే శివకుమార్‌ల వ్యక్తిగత ప్రతిష్టలకే కాకుండా, అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వ ప్రతిష్టకు తీవ్రమైన డ్యామేజ్ కలిగిస్తోంది. పోలీసు విచారణ ద్వారా ఈ కుట్రల వెనుక ఉన్న అసలు బడా నాయకులు ఎవరు, పార్టీలోని  బ్లాక్‌మెయిలర్లు ఎవరు అనేది బయటకు వస్తేనే ఈ రాజకీయ డ్రామాకు తెరపడే అవకాశం ఉంది.