Kailash Gahlot Joins BJP: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ఆద్మీ పార్టీ (AAP)కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక నేత, రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన కైలాశ్ గహ్లోత్ (Kailash Gahlot) సోమవారం బీజేపీలో చేరారు. ఆదివారం తన పదవికి, ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు (Kejriwal) పంపారు. ఇందులో పలు కారణాలను వివరించారు. 'పార్టీ స్థాపించినప్పటి విలువలకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు చాలా వ్యత్యాసం ఉంది. అందర్నీ ఏకం చేసిన విలువ నుంచి పార్టీ దూరమై పలు సవాళ్లు ఎదుర్కొంటోంది. ప్రజల పట్ల పార్టీ నిబద్ధతను రాజకీయ ఆశయాలు అధిగమించాయి. ఫలితంగా చాలా వాగ్దానాలు నెరవేరకుండా మిగిలిపోయాయి. కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణలో అవకతవకలు, యమునా నదిలో కాలుష్యం సమస్య, అంతర్గత విభేదాలు ఇవన్నీ పార్టీని వీడడానికి కారణం.' అని లేఖలో పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలో వచ్చే ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో రాజకీయ మార్పులు ప్రారంభమయ్యాయి. మొన్నీ మధ్య జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ తను రాజీనామా చేసి తన పార్టీ నేత అతిషీని ఢిల్లీ సీఎంగా కూర్చోబెట్టారు.
అటు, గహ్లోత్ రాజీనామాపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ స్పందించారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలతో కుట్రలను విజయవంతంగా అమలు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ ఒత్తిడి వల్లే ఈ రాజీనామా జరిగిందని.. గహ్లోత్‌ను సీబీఐ, ఈడీ వంటి ఏజెన్సీలు టార్గెట్ చేశాయని ఆరోపించారు. బీజేపీ ఇచ్చిన స్క్రిప్టు ప్రకారమే గహ్లోత్ ఆరోపణలు చేస్తున్నారని.. ఐదేళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్న గహ్లోత్ ఎలాంటి ఆరోపణలు చేయలేదని అన్నారు.
గహ్లోత్ కౌంటర్
అయితే, ఆప్ ఎంపీ వ్యాఖ్యలపై గహ్లోత్ కౌంటర్ ఇచ్చారు. ఇది తనకు సులభమైన నిర్ణయం కాదని.. అన్నా హజారే సమయం నుంచి తాను ఆప్‌లో ఉన్నానని అన్నారు. 'ఎమ్మెల్యే, మంత్రిగా ఢిల్లీకి నా వంతు సేవలు అందించాను. ఇది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయమని కొందరు భావిస్తున్నారు. ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని అంటున్నారు. ఒత్తిడి వల్ల నేను ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారికి స్పష్టం చేస్తున్నాను.' అని పేర్కొన్నారు. కాగా, సీఎం పదవికి ఇటీవల కేజ్రీవాల్ రాజీనామా చేసిన క్రమంలో.. ఆ సీటు కోసం ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్, రాఘవ్ ఛడ్డా, కైలాశ్ గహ్లోత్ పేర్లు వినిపించాయి. అయితే, సీఎంగా ఆతిశీకి కేజ్రీవాల్ అవకాశం ఇచ్చారు. ఇది కూడా ఆయన అసంతృప్తికి కారణం కావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు, ఎమ్మెల్యే రఘువిందర్ షొకీన్ రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఆప్ తెలిపింది.