BJP Bhansal  :  తెలంగాణలో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకు్న్న భారతీయ జనతా పార్టీ కొత్త ఇంచార్జ్‌ను నియమించింది. మునుగోడు ఉపఎన్నిక ముంచుకొస్తున్నందున  ఓ కీల‌క నియామ‌కాన్ని ప్ర‌క‌టించింది. బీజేపీ తెలంగాణ ఇంచార్జీగా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సునీల్ బ‌న్స‌ల్‌ను నియ‌మించింది. ఈ మేర‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా బుధ‌వారం సాయంత్రం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌స్తుతం బీజేపీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ శాఖ ప్ర‌ధాన కార్య‌దర్శిగా కొన‌సాగుతున్న బ‌న్స‌ల్‌కు తాజాగా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌దోన్న‌తి క‌ల్పించారు.  


యూపీలో బీజేపీ గెలుపు వెనుక కీలక వ్యూహాలు సునీల్‌వే


తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జ్ గా సునీల్ బన్సల్ ను ఆ పార్టీ నియమించింది. తెలంగాణ సహా బెంగాల్, ఒడిశాకు బన్సల్ ఇన్ ఛార్జ్ గా కొనసాగనున్నారు. బన్సల్ ఉత్తర ప్రదేశ్ బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్ కో ఇంఛార్జ్ గా పని చేశారు బన్సాల్. అలాగే ఉత్తరప్రదేశ్ బీజేపీ సంఘటన మంత్రిగా ఉన్నారు. యూపీ ఎన్నికల్లో 2017లో, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రధాన ప్రణాళికా కర్తగా వ్యవహరించారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ అన్నింటా బన్సల్ ఫోకస్ పెట్టనున్నారు. యూపీలో అభ్యర్థుల ఎంపిక వెనుక బన్సల్ కీలక పాత్ర పోషించారు. 



బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో కీలకం


రాజకీయంగా పెద్దగా పరపతి లేకపోయినా వ్యూహాలు రచించడం, అమలు చేయటంలో బన్సల్‌ దిట్ట.కులాలకు ప్రాధాన్యమిచ్చే యూపీలో సీట్ల పంపిణీ అంటే మాటలు కాదు. అలాంటిది అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా కమలం పార్టీకి కనీవినీ ఎరుగని ఆధిక్యాన్ని సాధించిపెట్టారు.తెరవెనుక ఉంటూనే వ్యూహ రచనలు చేస్తూ పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించిన అపర చాణక్యుడిగా వ్యూహాలను అమలుపర్చాడు. కింది స్థాయి నుంచి పార్టీ పటిష్టతకు కృషి చేసి, ఓటర్ల నాడిని పట్టి, బీజేపీకి ఓట్లు కురిపించేలా చేశారు సునీల్ బన్సల్. అంతేగాక, ఆయనతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఆయనకు సహాయకంగా గెలుపులో కీలక పాత్ర పోషించారు.  


యూపీ స్టైల్లో తెలంగాణలో అధికారం చేజిక్కించుకునే వ్యూహం
 
వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలని ఇప్పటి నుండే బీజేపీ జాతీయ నాయకత్వం నియామకాలు చేపట్టినట్లుగా కనిపిస్తోంది.  ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీల విషయంలో ఇటీవల మార్పులు చేస్తోంది. మొన్నటివరకు తెలంగాణలో ఈ పదవిలో మంత్రి శ్రీనివాసులు ఉన్నారు. ఆయన్ను పంజాబ్‌ లో పార్టీ బలోపేతం కోసం అక్కడకు పంపించింది. 2024 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పంజాబ్ సంఘటన మంత్రిగా శ్రీనివాసులును పంపి.. తెలంగాణకు సునీల్ బన్సాల్ ను నియమించారు. తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన అధిష్టానం.. అమిత్ షాకు దగ్గరి మనిషిని రంగంలోకి దింపడంతో  యూపీ ఫార్ములానే తెలంగాణలో పాటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.