Nitish PM Plan :  బీహార్ సీఎం నితీష్ కుమార్ ఒక్క సారిగా ఎందుకు బీజేపీని డంప్ చేశారు ? తక్కువ ఎమ్మెల్యే సీట్లు ఉన్నా ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఎందుకు ఆర్జేడీతో జట్టు కట్టారు ? . కూటమిలో చిన్న చిన్న విభేదాలు ఉండటం సహజమే. అంత మాత్రం దానికే కూటమికి గుడ్  బై చెబుతారా ?.  చెప్పుకుంటున్నట్లుగా  కూటమిలో విభేదాలు నితీష్ గుడ్ బై చెప్పడానికి కారణం కాదని తెలుస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోదీకి ధీటుగా ప్రధాని అభ్యర్థిగా విపక్షాల తరపున నిలబడాలన్నదే ఆయన లక్ష్యమని చెబుతున్నారు. 


బీజేపీతో అనేక విషయాల్లో విభేదిస్తున్న నితీష్ కుమార్ !


దేశాన్ని పాలిస్తున్న ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న జేడీ(యూ)కు కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీతో అనేక అంశాల్లో అభిప్రాయభేదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో అవి మరింత పెరిగాయి. ముఖ్యంగా కుల ప్రాతిపదికన జనాభా గణన చేపట్టాలని ఎప్పటినుంచో నితీష్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. గతంలోనే కేంద్రం ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. అయినా పట్టువదలని నితీష్.. బిహార్‌లో తన ప్రత్యర్థులైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహా 10 మంది ప్రతిపక్ష సభ్యుల బృందంతో ప్రధానిని కలిసి కుల గణనపై చర్చలు జరిపారు. మరోవైపు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై విచారణ జరపాలని జేడీ (యూ) డిమాండ్ చేసింది.  కేంద్ర కేబినెట్లో తమ పార్టీకి తగినంత ప్రాతినిధ్యం కల్పించకపోవడం కూడా నితీష్ కుమార్, ఆయన పార్టీని అసంతృప్తికి గురిచేసింది. అందుకే జేడీయూ కేంద్ర కేబినెట్‌లో చేరలేదు. కానీ అనుమతి లేకుండా ఒకరిని కేంద్రమంత్రిని చేశారు. ఇటీవల ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగిసిపోవడంతో రాజీనామా చేశారు . 


ప్రధాని పదవిపై నితీష్ ఆశలు!


జేడీ(యూ) జాతీయ సమావేశంలో  నితీష్ ప్రధాని పదవికి అర్హుడని కొన్నాళ్ల క్రితం  ప్రత్యేకంగా తీర్మానం చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు మోదీ నాయకత్వాన్ని ఆమోదించారని.. 2024 ఎన్నికల్లో ఆమోదిస్తారో లేదోనని జేడీయూ చెబుతూ వస్తోంది. నితీష్ కు కూడా ప్రధానమంత్రి అయ్యేందుకు అవసరమైన అర్హతలు ఉన్నాయని, సమర్ధుడైన జాతీయ నాయకుడని చెప్పడం తమ పార్టీ తీర్మానం ఉద్దేశమని జేడీయూ నేతలు ప్రకటించారు.  జేడీ(యూ) పార్లమెంటరీ పార్టీ నేత  ఉపేంద్ర కుష్వాహ కూడా నితీష్ ను ప్రధాని అభ్యర్థిగా అభివర్ణించారు. ఈ వాదన అంతకంతకూ పెంచుకుంటూ పోయారు. 


2014లో మోదీతో పోటీ.. చివరికి కూటమి నుంచి బయటకు వచ్చిన నితీష్ !


2014 ఎన్నికలకు ముందు కుడా ఇటువంటి వివాదం తలెత్తింది. అప్పట్లో అధికారంలో ఉన్న యూపీఏ కూటమిని ఢీ కొట్టగలిగే బలమైన ప్రధాని అభ్యర్థి కోసం ఎన్డీయే కూటమి అన్వేషిస్తున్నప్పుడు బీజేపీ నుంచి గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్రమోదీ పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు జేడీ(యూ) నేత నితీష్ కుమార్ ప్రధాని అభ్యర్థి కావాలని ఆయన, ఆయన పార్టీ భావించాయి.  నితీష్ కుమార్ అప్పట్లో మోడీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ఎన్డీయే నుంచి తమ పార్టీ వైదొలగుతుందని ఒక దశలో హెచ్చరించారు. దీనిపై బీజేపీ, జేడీ (యూ) మధ్య పలుమార్లు చర్చలు జరిపిన అనంతరం మోదీ అభ్యర్థిత్వాన్ని  ఆమోదించారు. అప్పట్లో ఎన్‌డీఏకి నితీష్ గుడ్ బై చెప్పారు.  తర్వాత పరిణామాల్లో మళ్లీ ఎన్‌డీఏతో చేరారు. అయితే ప్రధాని అయిన తర్వాత మోదీ నితీష్‌కు అందనంత దూరం వెళ్లిపోయారు. 


ఇప్పుడు మరోసారి నితీష్ ప్రయత్నాలు !


మోదీ రెండోసారి ప్రధాని అయిన తర్వాత  వ్యతిరేకతపెరిగిందని నితీష్ భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వాన్ని అడ్డుకుంటామన్న సంకేతాలు పంపేందుకు నితీష్ ఆ ఎన్టీఏతో కటీఫ్ చెప్పారని అంటున్నారు. విపక్షాల తరపున మోదీని ఢీకొట్టేందుకు ఇప్పటికీ  సరైన అభ్యర్థి లేరు. ఆ లోటును తీర్చగనని నితీష్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.