Jeevan Reddy: తెలంగాణ రాజకీయాల్లో జీవన్ రెడ్డిది ఓ ప్రత్యేక శైలి. 1983లో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచినా ఇంకా సొంత నియోజకవర్గానికి మాత్రమే అంటిపెట్టుకుని ఉన్న అరుదైన నేత. అంతే కాదు ఏ కేసీఆర్‌పై రెండు సార్లు పోటీ చేసారో ఇప్పడు అదే కేసీఆర్ పార్టీలోకి వెళుతుండటం ఆసక్తికర పరిణామం. ఒకప్పుడు ఎవరినైతే ఓడించడానికి తన సర్వశక్తులూ ఒడ్డారో, నేడు అదే నాయకుడి వెనుక నడవడానికి సిద్ధపడ్డారు. జగిత్యాల ప్రజల తలలో నాలుకగా మెదిలి, కాంగ్రెస్ కోటను కాపాడిన తాటిపర్తి జీవన్ రెడ్డి, నేడు గులాబీ కండువా కప్పుకోవడం వెనుక రాజకీయ అవసరాలకు మించిన ఆత్మగౌరవం, అసంతృప్తి దాగి ఉన్నాయి.
రెండు సార్లు కేసీఆర్ పై పోటీ.. నేడు కేసీఆర్ వెంట!
తెలుగు రాష్ట్రాల రాజకీయాలు తెలిసిన ఎవరికైనా జీవన్ రెడ్డి పేరు సుపరిచితం. నేటి ధిగ్గజనేతలు కేసీఆర్, చంద్రబాబు సమకాలికుడే కాదు, 1983లోనే ఎమ్మెల్యే.. యువ మంత్రి, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పలు పర్యాయాలు ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ గడ్డుకాలంలో చాలా సందర్భాల్లో జీవన్ రెడ్డి గెలిచి తన ప్రత్యేకత చాటుకున్నారు. అంతే కాదు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న వేళ కేసీఆర్ సెంటిమెంటును కొనసాగించేందుకు రాజీనామాలు, ఉపఎన్నికల ఎత్తుగడలు వేసేవారు అలా 2006, 2008 కరీంనగర్ లోక్‌సభ ఉపఎన్నికల్లో కేసీఆర్ పై కాంగ్రెస్ తరఫున పోటీకి నిలిచారు. మొదటిసారి రెండు లక్షల ఓట్లతో కేసీఆర్ గెలిచినా.. 2008లో మాత్రం వైఎస్ సహకారంతో జీవన్ రెడ్డి కేసీఆర్ కు ముచ్చెమటలు పట్టించారు. కరీంనగర్ లో తనకు ఎదురు లేదనుకున్న గులాబీ నేతను దాదాపు ఓటమి అంచులదాకా నెట్టి కేవలం 15వేల మెజారిటీ మాత్రమే ఇచ్చారు. కానీ, కాలక్రమేణా పరిస్థితులు మారాయి. నేడు అదే కేసీఆర్ నాయకత్వాన్ని కీర్తిస్తూ, "ప్రజలు కోరిన దానికంటే ఎక్కువే చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్" అని జీవన్ రెడ్డి కీర్తించే దాకా పరిణామాలు మారాయి. శత్రువు నుంచి మిత్రుడిగా మారిన ఈ ప్రస్థానం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్: అదే ఇల్లు, ఆదే పాత డెస్కు
జీవన్ రెడ్డి అంటే సంప్రదాయ రాజకీయ నాయకత్వానికి ఉదాహరణ. ఆయన ఇల్లు, ఆఫీసు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఆధునిక కార్పొరేట్ రాజకీయాల హంగులు ఆయన దరిచేరలేదు. ఆయన ఆఫీసు డెస్కు దశాబ్దాల నాటి పాత శైలిలో ఉంటుంది. అత్యంత సాధారణంగా ఉండే ఆ గదిలోనే వేల మందిని ప్రతిరోజూ కలుస్తుంటారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసినా ఆయన జీవనశైలి మారలేదు. కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ‘ఓపెన్ డోర్’ పాలసీ ఆయనది. గల్ఫ్ బాధితులైనా, స్థానిక పేదలైనా ఆయన వద్దకు వెళ్లి కష్టాలు తీర్చమని అడుగుతారు. ఇంటికి వచ్చిన వారికి పప్పు, పచ్చిపులుసు, మామిడికాయ తొక్కుతో ‘సింపుల్ లంగర్’ దశాబ్దాలుగా వడ్డిస్తున్నారు. వైఎస్ హయాంలో అత్యధిక సీఎం రిలీఫ్ ఫండ్ సాధించుకున్న నేత కూడా జీవన్ రెడ్డి గారే.
ఢిల్లీ క్యూలైన్లకు దూరం
కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీ పర్యటనలు, 10 జనపథ్ అపాయింట్‌మెంట్ కోసం పడిగాపులు సర్వసాధారణం. కానీ, జీవన్ రెడ్డి శైలి వేరు. ఆయన ఎన్నడూ పదవుల కోసం ఢిల్లీ వీధుల్లో లాబీయింగ్ చేయలేదు. తనకు పదవి రావాలన్నా, పోవాలన్నా అది తన పనితీరు మీద ఆధారపడాలే తప్ప హైకమాండ్ ప్రదక్షిణల వల్ల కాదన్నది ఆయన నమ్మకం. తన నియోజకవర్గమే ఢిల్లీ, ప్రజలే హైకమాండ్ అన్నట్లుగా సాగుతారు. ఇప్పుడు రేవంత్ తో వైరం కూడా ఆ ఆత్మగౌరవ ప్రతిష్టతోనే వచ్చిందని చెబుతారు.
రేవంత్ శైలిపై తీవ్ర అసంతృప్తి
42 ఏళ్ల పాటు పార్టీతో నడిచి నేడు వీడటానికి జీవన్ రెడ్డి చెప్పిన కారణాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. "తెలంగాణ ప్రజలు మార్పు కోసం ఆశపడి ఓటేశారు, కానీ నేడు నిరాశకు గురవుతున్నారు" అని ఆయన చేసిన విమర్శలు చాలా ఘాటైనవి. ఫిరాయింపుల రాజకీయాలను ప్రోత్సహించడం, సీనియర్లకు గౌరవం ఇవ్వకపోవడం వంటి అంశాలు ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు 2014లో ఒంటరి పోరాటం చేసి గెలిచిన తనకు, నేడు సొంత పార్టీలోనే గుర్తింపు కరువైందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్కువేం చేసామంటున్న కాంగ్రెస్.
జీవన్ రెడ్డిని కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవించింది. 2018లో ఓడిపోతే ఎమ్మెల్సీని చేసింది. అంతకు ముందు కాంగ్రెస్ హయాంలో మంత్రిని చేసింది. మొత్తం 14 సార్లు జీవన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. బుజ్జగించేందుకు జాతీయ నేతలు, పీసీసీ అధ్యక్షులతో సహ అందరూ ఆయన ఇంటికి వెళ్లి కాంగ్రెస్ లో కొనసాగాలని కోరారు. కేవలం ఒకరితో ఆభిజాత్యానికి పోయి తల్లిలాంటి పార్టీని వీడటం సరికాదని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ లాంటి కుటుంబ పార్టీలోకి వెళ్తే కేసీఆర్ ప్రేమలు ఎప్పటికీ ఉండవని హెచ్చరిస్తున్నారు.
జగిత్యాల గడ్డపై తనకంటూ ఒక ముద్ర వేసుకున్న జీవన్ రెడ్డి, ఇప్పుడు కేసీఆర్ గూటికి చేరబోతున్న నేపథ్యంలో.. ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు మారతాయా. రాజకీయం అంటే కేవలం అధికారమే కాదు, ఆత్మగౌరవంతో కూడిన ప్రయాణం అని జీవన్ రెడ్డి చెప్పకనే చెబుతున్నారు. బిఆర్ఎస్‌లో ఆయన ప్రస్థానం ఎలా సాగుతుందో.. తన కోడలికి రాజకీయ వారసత్వం అప్పగించి వానప్రస్తంలోకి జారుకుంటారో చూడాలి!
