Janasena News: తెలుగుదేశం(TDP), బీజేపీ(BJP)తో పొత్తు కుదరడంతో జనసేన(Janasena)లో నూతనోత్సాహం తొణికిసలాడుతోంది. గతంలో ఎప్పుడూలేని విధంగా  దేశ, విదేశాల్లోనూ  ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధికారంలోకి రాబోతున్నామన్న సంకేతాలు జనసేనలో జోష్‌ తీసుకొచ్చింది. 


డల్లాస్‌లో వేడుకలు
అమెరికాలోని డల్లాస్‌(Dallas)లో జనసేన(Janasena) ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుదేశం(TDP), బీజేపీ(BJP) శ్రేణులు సైతం పెద్దఎత్తున హాజరయ్యాయి. టీడీపీ-జనసేన- బీజేపీ పొత్తు ఖరారవ్వడంతో..మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్దఎత్తున జనసేన ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.


వైకాపా పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఏపీని అభివృద్ధిపథంలో నడిపేందుకే మూడు పార్టీలు ఏకమయ్యాయని... కూటమిగా ఏర్పడి రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయని ఎన్నారై(NRI) కార్యకర్తలు తెలిపారు. తెలుగు నేల అభివృద్ధిలో ఎన్నారైలు సైతం పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీలో ఐదేళ్లుగా  రైతులు, భవన నిర్మాణ కార్మికులు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.


వైసీపీ(YCP) పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి పోయిందని...తిరిగి కోలుకోవాలంటే అనుభవం నేత మళ్లీ పీఠం ఎక్కాల్సి ఉందని ఎన్నారై నేతలు అన్నారు. యువతరానికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్నా...టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. జగన్ సర్కార్‌ కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు.


ఈ కార్యక్రమంలో జనసేన నేతలు బొలిశెట్టి శ్రీనివాస్, పంతం నానాజీతోపాటు టీడీపీ నేతలు ఆరిమిల్లి రాధాకృష్ణ, జ్యోతుల నెహ్రూ జూమ్ కాల్‌ ద్వారా కనెక్ట్ అయ్యారు. కూటమి నేతలు విజయంలో  ఎన్నైరైలు పాల్గొనాలని కోరారు. తమ బంధువులు, శ్రేయోభిలాషులను  కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపడంతోపాటు ఓట్లు వేయించేలా నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉండాలని సూచించారు. 


ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకోడూదన్న ఏకైక లక్ష్యంతోనే పవన్‌కల్యాణ్(Pavan Kalyan) కొంచెం తగ్గి మరీ కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారని జనసేన నేతలు కొనియాడారు. ఇది కేవలం ఎన్నికల పొత్తు కాదని..దీర్ఘకాలం ఈ మైత్రీ కొనసాగుతుందన్నారు. జగన్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. దోచుకున్న డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసేందుకు వైసీపీ(YCP) నేతలు కుట్రలు పన్నుతున్నారని...వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు.


గత ఎన్నికల్లో కేంద్రం మద్దతు, తెలంగాణ అప్పటి సీఎం కేసీఆర్ (KCR)మద్దతుతో జగన్(Jagan) విర్రవీగారని...ఇప్పుడు అలాంటి ఛాన్స్ లేదని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. ఇసుక, మట్టి, మద్యంలో దోచుకున్న డబ్బు వెదచల్లేందుకు వైసీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారని....కానీ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి  నిర్ణయం తీసుకోకుంటే...ఏపీని ఎవరూ కాపడలేరన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు.


గతంలో మూడు పార్టీల మధ్య  ఎలాంటి విభేదాలు ఉన్నా...ఇప్పుడు కీలక సమయంలో ఒకరికొకరు మద్దతుగా నిలవాలని...కూటమి పార్టీలకు వందశాతం ఓటు బదిలీ జరగాలని నేతలు పిలుపునిచ్చారు. అభ్యర్థులకు అవసరమైన నైతిక, ఆర్థిక మద్దతు ఇస్తామని ఎన్నారైలు హామీ ఇచ్చారు. కుల,మతాలకు అతీతంగా  అందరం ఏపీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామన్నారు. దర్శి టిక్కెట్ ఆశిస్తున్న ఎన్నారై వెంకట్‌ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.