తెలంగాణలో ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయే లేదో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయం యాక్టివేట్ అయింది. ఇప్పటికే అధికార వైసీపీ సామాజిక యాత్ర పేరుతో ప్రజల్లో ఉంటోంది. పాదయాత్ర ద్వార లోకేష్‌ జనంలో ఉంటున్నారు. ఇప్పుడు జనసేన కూడా అదే మార్గంలోకి  వస్తోంది. దీని కోసం సన్నాహక సమావేశం కానుంది. 
 
డిసెంబర్ 1న జనసేన విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3గంటలకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం ప్రారంభమవుతుంది. ఈ భేటీలో రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుతోపాటు పార్టీ పిఏసీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా, నగర అధ్యక్షులు, నియోజకవర్గాల బాధ్యులు, అనుబంధ విభాగాల ఛైర్మన్లు, వీర మహిళా విభాగం ప్రాంతీయ సమన్వయకర్తలు, అధికార ప్రతినిధులు పాల్గొంటారు. 


ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశంపై అధ్యక్షుడు దిశానిర్దేశం చేయనున్నారు. జనసేన – టీడీపీ క్షేత్ర స్థాయిలో సమన్వయంతో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఓటర్ల జాబితాలు పరిశీలన తదితర విషయాలపై కూడా చర్చిస్తారు 


టీడీపీ జనసేన పొత్తు విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు. ఇరు పార్టీల మధ్య సమన్వయం కోసం కార్యక్రమాలు కూడా చేపట్టారు. నియోజకవర్గ స్థాయిలో కూడా మీటింగ్స్ పెట్టారు. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఇతర అంశాలపై కూడా చర్చిస్తారు.