Jagan is trying to reunite the family: వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్లీ తన కుటుంబాన్ని ఏకం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారని ఈ క్రిస్మస్ సందర్భంగా పులివెందులలో చోటు చేసుకున్న పరిణామాలు నిరూపిస్తున్నాయని రాజకీయ వర్గాలంటున్నాయి.గత ఎన్నికల్లో జగన్ ఘోర ఓటమికి  కుటుంబం చీలిపోవడం కూడా ఓ కారణం. వివేకా హత్య కేసుతో పాటు సోదరి షర్మిలతో వచ్చిన ఆస్తుల తగాదాలతో కుటుంబం రెండుగా చీలిపోయింది. విజయమ్మ, షర్మిలపై ఎన్సీఎల్టీలో జగన్ కేసు వేయడం ఇటీవలి కాలంలో బాగా వ్యతిరేక ప్రచారానికి కారణం అయింది. ఆ తర్వాత ఆస్తుల గొడవలో లేఖలు, ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పుడు వాటన్నింటినీ సార్ట్ అవుట్ చేసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. 


పులివెందులలో గతంలో లేని విధంగా కుటుంబసభ్యులతో కలిసిపోయిన జగన్ 


క్రిస్మస్ సందర్భంగా జగన్ ఫ్యామిలీతో గ్రూప్ ఫోటో దిగారు. షర్మిల ఈ సారి క్రిస్మస్ కోసం పులివెందుల వెళ్లలేదు. ఆమె అమెరికాలో ఉన్నారని చెబుతున్నారు. షర్మిల కుమారుడు , కోడలు మాత్రం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. జగన్ తో కలిసి గ్రూపు ఫోటో కూడా దిగారు. ఇక తల్లి విజయలక్ష్మి తమపై జగన్ ఎన్సీఎస్టీలో కేసు వేశాడన్న విషాయన్ని పట్టించుకోలేదు. ఎప్పట్లాగే ఆప్యాయంగా పలకరించి నుదుటపై ముద్దుపెట్టారు. జగన్ కూడా క్రిస్మస్ కేక్‌ను తల్లితో కట్ చేయించారు. ఆస్తుల వివాదాలు ఎలా ఉన్నా.. తల్లితో గ్యాప్ రాదని.. జగన్ నిరూపించారని వైసీపీ కార్యకర్తలు ఈ పరిణామాలతో రిలాక్స్ ఫీలయ్యారు. 


సమస్యలను పరిష్కరించుకునేందుకు జగన్ ప్రయత్నాలు 


అన్ని సమస్యలు సర్దుబాటు చేసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. షర్మిలతోనూ వివాదలాను పరిష్కరించుకోవాలని అనుకుంటున్నారు. ఆస్తుల విషయంలో మధ్యవర్తులతో చర్చలు ప్రారంభించేలా చూస్తున్నారని అంటున్నారు. షర్మిల రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నారు. ఆస్తులు పంచి ఇచ్చినా సరే రాజకీయాల్ని వదిలి పెట్టబోనని అంటున్నారు. అయితే షర్మిలకు ఆస్తులు పంచి ఇస్తే.. తర్వాత షర్మిల మెల్లగా మనసు మార్చుకుంటారని అన్న కోసం రాజకీయం చేస్తారని అంటున్నారు. అందుకే ముందుగా ఒప్పందం ప్రకారం అయినా షర్మిలకు ఆస్తులు ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. 


పరిస్థితులు ఇలాగే ఉంటే తీవ్ర నష్టం జరుగుతుందన్న ఆందోళన 


కుటంబ గొడవల్నిపూర్తిగా సద్దుమణిగేలా చేసుకోకపోతే మొదటికే మోసం వస్తుందని జగన్ అనుకుంటున్నారు. సొంత జిల్లా కడపలోనూ గత ఎన్నికల్లో మూడు అంటే మూడు అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇది ఊహించని పరిణామం. కుటుంబం ఐక్యంగా లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందని ఆయనకు క్లారిటీ వచ్చింది. షర్మిల విస్తృతంగా ప్రచారం చేయకపోతే ఆరేడు సీట్లు వచ్చేవని వైసీపీ వర్గాలకు తెలుసు. షర్మిల ఇలా రాజకీయంగా యాక్టివ్ గా తిరిగితే వైసీపీ ఓటు బ్యాంక్ ను ఆమె ఎంతో కొంత ప్రభావితం చేస్తారని దాని వల్ల వచ్చే ఎన్నికల్లోనూ ఘోర మైన నష్టం జరుగుతుందన్న అంచనాలో ఉన్నారు. అందుకే ముందు కుటుంబాన్ని ఏకం చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.