Why Jagan Aviod People : బారికేడ్లు, పరదాలు కట్టడం ... దుకాణాలు మూసివేయించడం ఈ రెండూ సీఎం జగన్ ఏ ఊరి పర్యటనకు వెళ్లినా కామన్. దీనిపై చాలా రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు లాంటి వీఐపీలు వస్తే ఇండియాలో పేదరికం కనిపించకుండా ఇలా రోడ్ల పక్కన పరదాలు కట్టేవాళ్లు. కానీ ఇండియాలో పాలకులు తాము పాలిస్తున్న ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఇలా పరదాలు కట్టుకోవడం ఎప్పుడూ జరగలేదు. కానీ ఏపీ సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లలో మాత్రం పరదాలు కామన్ అయిపోయాయి. ప్రజల్ని ఆయన కలవాలనుకోవడం లేదని అందుకే ఇలా చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అదే సమయంలో జగన్ ప్రజల్ని ప్రత్యక్షంగా కలిసే సందర్భమే ఉండటం లేదు. దీంతో పదేళ్ల పాటు జనంలోనే ఉండి అధికారం సాధించుకున్న జగన్ ఇప్పుడెందుకు ప్రజలకు దూర దూరంగా ఉంటున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి ప్రజల్ని నేరుగా కలవని సీఎం జగన్ !
వైఎస్ఆర్ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయినప్పటి నుంచి జగన్ జనంలోనే ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ కోసం చనిపోయారని .. వారని ఓదారుస్తానని ఓదార్పు యాత్రలు చేశారు. 2014లో ఓడిపోయాక పాదయాత్రలు చేశారు. జనంలో ఉన్నారు . కానీ పదవి చేపట్టిన తర్వాత మాత్రం ఆయన మారిపోయారు. ఎవర్నీ కలవడం లేదు. జనానికి దగ్గరగా ఉంటానని నమ్మకం కలిగించి అధికారంలోకి వచ్చిన జగన్ పాదయాత్ర ద్వారా అధికారంలోకి వచ్చిన జగన్.. ప్రజలను కలిసేందుకు ఎందుకు ఆసక్తి చూపించడం లేదని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. సీఎంగా పదవి చేపట్టి మూడున్నరేళ్లు దాటిపోయింది. ఆయన ఏ దశలోనూ ప్రజలతో ఇంట‌్రాక్ట్ కాకపోవడం ఎందుకో వైఎస్ఆర్‌సీపీ నేతలకూ అంతు చిక్కడం లేదు.
మొదట్లోనే ప్రజాదర్భార్‌కు ప్రణాళిక.. ఇప్పటి వరకూ అమల్లోకి రాలేదు !
ప్రజల్ని కలిసేందుకు ప్రతీ ముఖ్యమంత్రి ప్రతీ రోజూ ఎంతో కొంత సమయం కేటాయిస్తారు. అది సంప్రదాయం. అధికారం చేపట్టిన మొదట్లో ఆయన ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇందు కోసం క్యాంపాఫీస్‌లోనే ప్రత్యేకంగా వేదిక కూడా కట్టారు. తేదీ కూడా ఇచ్చారు. ఆ రోజున వెల్లువలాజనం వచ్చారు. కానీ క్యాన్సిల్ అని ఒక మాట చెప్పి అందర్నీ పంపేసారు. అది మొదలు.. ఇదిగో దర్బార్.. అదిగో దర్బార్ అని ప్రకటనలు చేస్తున్నారు కానీ.. ప్రజల్ని కలిసిందే లేదు. ఇటీవల కూడా.. అలాంటి ప్రకటన చేశారు. రోజూ గంట సేపు జనాల్ని కలుస్తానని చెప్పారు. చివరికి అలాంటిదేమీ లేదని చెబుతున్నారు. ప్రజల్ని నేరుగా జగన్ కలిసే ప్రణాళికేమీలేదని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు ఓ నిర్ణయానికి వచ్చేశాయి.
జిల్లాల పర్యటనల్లోనూ వచ్చామా.. బటన్ నొక్కామా... వెళ్లామా అన్నట్లుగా షెడ్యూల్ !
ఇటీవల జగన్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తన దారిలో పరదాలు కట్టేస్తున్నారు. బారీ కేడ్లు పెట్టేస్తున్నారు. వందల మంది పోలీసుల్ని మోహరింప చేస్తున్నారు. దీంతో సామాన్యులెవరూ జగన్‌ను దగ్గర నుంచి చూడటానికి కూడా అవకాశం ఉండదు. రావడం.. నేరుగా స్టేజి మీదకు వెళ్లి బటన్ నొక్కి.. ప్రసంగించి వెళ్లిపోవడం చేస్తున్నారు. ఈ తీరు చూసి చాలా మంది జనం.. పాదయాత్ర చేసిన జగనేనా అని చర్చించుకోవడం కామన్‌గా మారింది. పాదయాత్రలు చేసి.. మంచి చేస్తానని నమ్మించి.. అందుబాటులో ఉంటానని నమ్మకం కలిగించడం వల్ల ప్రజలు ఓట్లేశారని.. ఇలా చేయడం ఏమిటని విపక్ష నేతలు సహజంగానే ప్రశ్నిస్తున్నారు.
జగనన్నతో చెప్పుకుందాం.. ఈ సమస్యను పరిష్కరిస్తుందా?
ప్రజలతో ఏ మాత్రం కలవలేకపోతున్న తీరు వల్ల జనంలో అసంతృప్తి పెరుగుతోందని వైఎస్ఆర్‌సీపీ పెద్దలు కూడా గుర్తించారు. అందుకే.. నేరుగా కలవాలనుకునేవారిని.. ఫోన్ ద్వారా భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం జగనన్నతో చెప్పుకుందా అనే కార్యక్రమానికి రూపకల్పన చేశారు. సమస్యను చెప్పుకుంటే వెంటనే పరిష్కారం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రయత్నం వల్ల ప్రజలు సంతృప్తి చెందితే.. జగన్ నేరుగా ప్రజల్ని కలవకపోయినా.. ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఈ ప్రయత్నమూ ఫెయిలతే.. జగన్ జనానికి దూరమైనట్లే అనుకోవచ్చు.