మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తన తండ్రి చేసిన వ్యాఖ్యలపై భిన్నంగా స్పందించారు. తన తండ్రి నోరు ప్రమాదకరమని ఆయన అన్నారు. అంతే కాదు వాగే నోరు, తిరిగే కాలు ఆగదన్నట్లుగా తన తండ్రిని ఆపలేమన్నారు. తాను ఎప్పుడూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉంటానని స్పష్టం చేశారు.
కలకం రేపిన మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలు...
కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఇటీవల జరిగిన వనసమారాదన కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్దాయిలో దుమారాన్ని రేపాయి. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు కావటంతో.. తండ్రి వ్యాఖ్యలకు కుమారుడికి ఆపాదిస్తూ స్టేట్ మెంట్స్ వైరల్ గా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అంతేకాదు తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లుగా మరుసటి రోజు కూడా ఆయన స్పష్టం చేశారు. ఏపీలో ప్రధానంగా కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదని, మంత్రి పదవి ఒక్కటి కూడా ఇవ్వలేదని నాగేశ్వరరావు అభ్యంతరం తెలిపారు. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కమ్మవారికి తగిన ప్రాధాన్యత ఇచ్చారని, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని నియోజకవర్గాల్లో మెజార్టీ ఉన్న కమ్మ వర్గం ఎందుకు నిమ్మకుంటుందని నిలదీశారు. నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు వైరల్ కావటం, అది అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే తండ్రి ఇలాంటి మాటలతో జగన్ పై అటాక్ చేయటం పై రాజకీయంగా చర్చకు దారితీసింది.
రంగంలోకి దిగిన వసంత కృష్ణ ప్రసాద్...
తండ్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయ వర్గాలతో పాటుగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది. ఈ వ్యవహరంపై వైసీపీ నేతలు సీరియస్ గా స్పందించారు. వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఇంటలిజెన్స్ రిపోర్ట్ ను తెప్పించారు. దీంతో ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ జోక్యం చేసుకున్నారు. మైలవరం వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. తన తండ్రి చేసిన కామెంట్లపై వివరణ ఇచ్చారు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న సంఘటనలు, మా నాన్న వ్యాఖ్యల కారణంగా ఏర్పడిన పరిస్థితులపై తాను మాట్లాడక తప్పటం లేదన్నారు. తండ్రి వ్యాఖ్యల తో తాను ఏకీభవించడంలేదని, ఆ విషయాలను ఖండిస్తున్నానని చెప్పారు. జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎంతమంది పొగిడారు, యూనివర్సిటీ పేరు మారిస్తే విమర్శించే హక్కు ఎవరిచ్చారు అని కృష్ణ ప్రసాద్ ప్రశ్నించారు.
తన వ్యక్తిగత అభిప్రాయం ఏదైనా రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయమే శిరోధార్యంగా వెల్లడించారు. ఎప్పుడు ఎక్కడ ఏ సామాజిక వర్గానికి ప్రాధాత కల్పించాలనేది ముఖ్యమంత్రి నిర్ణయమని చెప్పారు. మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ప్రవర్తించాలని, పాత కాలంలో అంబాసిడర్ బావుందని, ఇప్పుడు కూడా అదే బావుంటుందని అనలేమని తన తండ్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వాగే నోరు, తిరిగే కాలు ఆగదన్నట్లుగా తన తండ్రిని ఆపలేమని తెలిపారు. చిన్నతనంలో తన తండ్రి మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు చెడ్డ పేరు తేకూడదనే విధంగా ప్రవర్తించేవాళ్ళమని గుర్తు చేశారు. ఆయన నోరు చాలా ప్రమాదకరమని తెలిపారు. ఎప్పుడూ ఎవరో ఒకరిని ఇరకాటంలో పెట్టడం ఆయన నైజమని, ఈ విషయాన్ని ఏ ఒక్క వైఎస్సార్ అభిమాని పట్టించుకోవద్దని సూచించారు.
175 మంది సభ్యులతో పాటు అసెంబ్లీలో కూర్చునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్ తోనే తాను నడుస్తానని తెలిపారు. పార్టీలో ఏమ్మా అంటే నీ అమ్మ అనే విధంగా వక్రీకరిస్తున్నారని, కొందరు కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా పార్టీలో గందరగోళ వాతావరణాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుని ఓడించాలన్నదే తన ఆకాంక్ష అని, అది జగన్మోహన్ రెడ్డి వలనే నెరవేరిందన్నారు. 2024 ఎన్నికల్లో సీఎం జగన్ పోటీ చేయమంటే చేస్తా, లేకుంటే పార్టీ కోసం పనిచేస్తాని వెల్లడించారు.
రాజకీయాల్లో అత్యాశ ఎక్కువైంది..
రాజకీయాల్లో అత్యాశ, దురాశ ఎక్కువైపోయింది, నా చేతులతో టిక్కెట్లు ఇప్పించి, అవకాశం ఇప్పించిన వారు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. తనకు అవకాశమిచ్చి గెలిపించిన జగన్ ని కానీ, నియోజకవర్గ ప్రజలను కానీ తాను విమర్శించని, మైలవరం నియోజకవర్గంలో గందరగోళానికి కొన్ని అదృశ్య శక్తులు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. వారు ఎవరు, ఏంటని అధిష్టానం దృష్టిలో రాబోయే రెండు మూడు రోజుల్లోనే ఉంచుతానన్నారు. తన మాటల్ని వక్రీకరించి సొంత పార్టీ వారే దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. మంత్రి జోగి రమేష్ తో విభేదాల విషయంలో అధిష్టానంతో చర్చించిన తర్వాతే మీడియాతో మాట్లాడుతానని చెప్పారు.