IS Jagan implementing Chandrababu plan :  2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన నాలుగైదు నెలల తరవాత చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లారు.ఆయన అలా వెళ్లడం ఆలస్యం ఇటు.. ఒక్క కనకమేడల రవీంద్ర తప్ప మిగతా రాజ్యసభ సభ్యులంతా బీజేపీలో విలీనమయ్యారు. వారు ఆషామాషీ వ్యక్తులు కాదు. చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తులు అయిన సుజనా చౌదరి,సీఎం రమేష్, టీజీ వెంకటేష్ లాంటి వాళ్లు. వారిని చంద్రబాబే బీజేపీలోకి పంపించారని వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. జగన్ కూడా పలుమార్లు అదే చెప్పారు. ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి వైసీపీలో కనిపిస్తోంది. 


జగన్ లండన్ కు వెళ్లినప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా 


వైఎస్ జగన్ కుమార్తె గ్రాడ్యూయేషన్ కోసం లండన్ వెళ్లారు. విజయసాయిరెడ్డి హఠాత్తుగా రాజీనామా ప్రకటించారు. జగన్ తో మాట్లాడకుండా విజయసాయిరెడ్డి రాజీనామాలు చేసే అవకాశాలు లేవు.  రాజ్యసభ సభ్యత్వంతో పాటు వైసీపీకి కూడా రాజీనామా చేశారు. అయితే తాను ఏ పార్టీలోనూ చేరనని వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్‌కు కృతజ్ఞతలు చెప్పారు అలాగే చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీ, అమిత్ షాల పేర్లను కూడా  ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది.     విజయసాయిరెడ్డితో వైఎస్ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాలు ఆగే సూచనలు కనిపించడం లేదు. వైసీపీ తెర వెనుక రాజకీయాల్లో కీలకంగా మరికొందరు ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తారని అంటున్నారు. మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా పదవికి రాజీనామా చేస్తారని అంటున్నారు. కానీ ఆయన తాను దావోస్‌లో ఉన్నానని వచ్చిన తర్వాత మాట్లాడతానని చెబుతున్నారు.  రాంకీ గ్రూపునకు యజమాని అయిన అయోధ్య రామిరెడ్డి  జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన కొన్ని కీలక జిల్లాల వైసీపీ బాధ్యతలు చూసుకుంటూ ఉంటారు. 


జగన్ ప్రణాళిక ప్రకారమే రాజీనామాలు చేస్తున్నారా ? 


వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకోవడం వ్యూహాత్మకమేనని భావిస్తున్నారు.  పదవి కాలం ఇంకా మూడేళ్ల వరకూ ఉన్నా  హఠాత్తుగా ఎందుకు పదవులు వదులుకుంటున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు చేసే రాజీనామాల వల్ల ఆ పదవులన్నీ కూటమికే దక్కుతాయి కానీ వైసీపీ ఖాతాలో పడే అవకాశం లేదు. ఇప్పటికే వైసీపీ నుంచి ముగ్గురు రాజీనామా చేశారు. ఆ ముగ్గురిలో ఇద్దరు బీజేపీలో చేరి మళ్లీ ఎంపీలయ్యారు. మరొకరు టీడీపీలో చేరినా రాజ్యసభ సీటు వద్దనుకున్నారు. దాంతో ఆ సీటును సానా సతీష్ కు ఇచ్చారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి, రాజీనామా చేస్తే ఆ సీటు ఖచ్చితంగా కూటమి  ఖాతాలోకి పోతుంది. అయినా ఆయన రాజీనామా చేస్తున్నారంటే.. అంతర్గతం తీసుకున్న నిర్ణయం మేరకు తీసుకున్నారని అనుకోవచ్చు. అదే నిజమైతే.. ఒకరిద్దరు తప్ప వైసీపీకి ్ందరు ఎంపీలు రాజీనామాలు చేసే అవకాశాలు ఉన్నాయి. 


విజయసాయిరెడ్డి రిటైర్మెంట్ - ఇతర ఎంపీలు బీజేపీలోకి ? 
 
విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరమని చెబుతున్నారు. వైఎస్ కుటుంబంతో, జగన్ తో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయన వేరే  పార్టీలో చేరకపోవచ్చు . అయితే ఆయన చేరినా బీజేపీ  చేర్చుకునే అవకాశాలు ఉండవు. ఎదుకంటే జగన్ అక్రమాస్తుల కేసులలో ఆయన సహ నిందితుడు. ఏ 2గా ఉన్నారు. ఇంకెవరైనా రాజీనామాలు చేసినా వారు బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.    విజయసాయిరెడ్డి రాజీనామా ఖచ్చితంగా జగన్ కు తెలిసే జరిగి ఉంటుందని అంటున్నారు. లేకపోతే ఆయనకు చెప్పుకండా రాజీనామా చేసేంత పెద్ద కారణం ఉండబోదని అనుకుంటున్నారు. 


చంద్రబాబు అమలు  చేశారని అనుకున్న  ప్లానే అమలు చేస్తారా?


బీజేపీకి రాజ్యసభ సభ్యుల అవసరం ఉంది. వైసీపీకి బీజేపీ గుడ్ లుక్స్ లో ఉండటం చాలా అవసరం. లేకపోతే పార్టీని కాపాడుకోవడం కష్టమవుతుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. చంద్రబాబు పార్టీని కాపాడుకున్నట్లే తన పార్టీని కాపాడుకోవాలని అనుకుంటున్నారని భావిస్తున్నారు. ఏది నిజమన్నది భవిష్యత్ పరిణామాలు చెబుతాయి.