VijaysaiReddy :  వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి.  పార్టీలో ఒకప్పుడు నెంబర్ టు ఆయన. కానీ ఇప్పుడు ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. గతంలో తన ట్విట్టర్ అకౌంట్‌ను అగ్రెసివ్ గా ఉంచేవారు. తీవ్ర విమర్శలు చేసేవారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన వ్యవహారశైలి పూర్తిగా మారిపోయింది. ట్విట్టర్‌లో అసలు ప్రతిపక్షంపై విమర్శలు చేయడం మానేశారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలతో కనిపిస్తున్నారు. తారకరత్న  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు.. చనిపోయిన తర్వాత ఆయన వ్యవహారశైలి చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. విజయసాయిరెడ్డిలో ఊహించని మార్పు కనిపిస్తోందని అంటున్నారు. దీనికి కారణం ఏమిటన్నదానిపై విస్తృత చర్చ జరుగుతోంది. 


చంద్రబాబుతో విజయసాయిరెడ్డి గుసగుసలతో కలకలం !                                     


తారకరత్న అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ రెండు రోజుల పాటు విజయసాయిరెడ్డి భౌతిక కాయం వద్దనే ఉన్నారు. ఎవరు వచ్చినా మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చినా మాట్లాడారు. ఆయనతో మాట్లాడేందుకు ప్రత్యేకంగా వెళ్లడం.. కారు వద్దకు వెళ్లి సాగనంపడం..  పక్కన కూర్చుని చాలా సేపు ముచ్చటించడం సంచలనంగా మారింది. నిజానికి అలాంటి సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడుకునే అవకాశం లేదు. తారకరత్న కుటుంబానికి ఎలా అండగా ఉండాలన్న అంశంపై మాట్లాడి ఉంటారు. కానీ విజయసాయిరెడ్డి అలా ప్రత్యేక ఆసక్తితో చంద్రబాబుతో ముచ్చటించడానికి ప్రయత్నించడం వైఎస్ఆర్‌సీపీలోనూ చర్చనీయాంశం అవుతోంది. 


తారకరత్న మరణంపై వైఎస్ఆర్‌సీపీ స్ట్రాటజీని ఫాలో కాని విజయసాయిరెడ్డి !                       


తారకరత్న మరణంపై వైఎస్ఆర్‌సీపీ ఓ ప్రత్యేకమైన స్ట్రాటజీని పెట్టుకుంది. అందులో భాగంగా లక్ష్మి పార్వతి తీవ్ర విమర్శలు చేశారు. ఆ విమర్శలను వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది. కానీ విజయసాయిరెడ్డి మాత్రం ఆ స్ట్రాటజీని ఫాలో కాలేదు. ఆయన మామూలుగానే స్పందించారు. దీంతో లక్ష్మిపార్వతితో పాటు ఇతర నేతలు చేసిన విమర్శలకు టీడీపీ నేతలు... విజయసాయిరెడ్డి మాటలను కౌంటర్ గా ఇచ్చారు. ఇది వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందికరంగా మారింది. అయితే విజయసాయిరెడ్డి మాత్రం తారకరత్న తన చెల్లెలి అల్లుడు కాబట్టి కుటుంబసభ్యునిగా దగ్గరుండి అన్ని చూసుకున్నారు కానీ.. రాజకీయంగా పట్టించుకోలేదని ఆయన వర్గీయులు అంటున్నారు. అయితే గతంలో విజయసాయిరెడ్డి రాజకీయం చూస్తే.. ఇలాంటి సెంటిమెంట్లు ఆయన పట్టించుకోలేదన్న సంగతిని ఇతరులు గుర్తు చేస్తున్నరు. 


వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్‌తో దూరం పెరిగిందా ?                                       


ఒకప్పుడు వైసీపీలో నెంబర్ టు స్థానంలో ఉన్నారు విజయసాయిరెడ్డి. కానీ తర్వాత ఆ స్థానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి పొందారు. క్రమంగా విజయసాయిరెడ్డి దూరం అయ్యారు. ఆయనకు ఇప్పుడు పార్టీలో కీలకమైన పదవి కూడా ఏదీ లేదు. చాలా ఏళ్ల పాటు సోషల్ మీడియాను చూసుకున్నా.. అది కూడా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడి చేతికి వెళ్లింది. ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో కనపించడం కూడా తగ్గిపోయింది. సీఎం జగన్ ఇటీవలి ఢిల్లీ పర్యటనలో ఆయన ఉన్నారు కానీ..సీఎం జగన్ పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించలేదు. దీంతో విజయసాయిరెడ్డి .. వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్‌కు దూరం అవుతున్నారా అన్న అనుమానం ఆ పార్టీలో ప్రారంభమయింది.