టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా గన్నవరం వెళ్లేందుకు పార్టీ జెండాలతో సిద్ధమైన బుద్దా వెంకన్నను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేతలు వెనక్కి తగ్గకుండా ముందుకు సాగడంతో పోలీసులకు, పార్టీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం జరిగి తోపులాటకు దారితీసింది.  టీడీపీ నేత పట్టాభి మాట్లాడింది తప్పు అయితే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని, కానీ పార్టీ ఆఫీసుపై, నేతలపై, వారి ఇళ్లపై దాడులు చేయడం ఇదేం పద్ధతి అంటూ బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. వైసీపీలో వంశీకి ఇంకా టికెట్ కన్ఫామ్ కాలేదని, పార్టీలోనే వ్యతిరేకత ఉందన్నారు.


ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు


తెలుగుదేశం సీనియర్​నేత బుద్దా వెంకన్న నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. గన్నవరంలో పార్టీ ఆఫీసుపై దాడిని తీవ్రంగా ఖండించిన టీడీపీ నేతలు వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. "ఖబడ్దార్ వంశీ" అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. డౌన్ డౌన్ సీఎం జగన్ అంటూ నినాదాలు చేశారు. గూండాగిరిని పెంచి పోషిస్తున్న నేత సీఎం జగన్ అంటూ ఆరోపించారు. ఈ క్రమంలో టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా గన్నవరం వెళ్లేందుకు పార్టీ జెండాలతో సిద్ధమైన బుద్దాను పోలీసులు అడ్డుకున్నారు. బుద్దాను బయటికి రాకుండా గేటు మూసివేశారు. ఆయనతో పాటు కార్యకర్తలందరినీ గృహ నిర్బంధం చేశారు. అయితే టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న నాయకత్వంలో అలాగే ముందుకు సాగిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేయడంతో పార్టీ శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. అది తోపులాటకు దారితీసింది. సైకో సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ముందుకు సాగుతున్న టీడీపీ శ్రేణులను ఎట్టకేలకు పోలీసులు అదుపు చేశారు.


తనను హౌస్ అరెస్ట్ చేయడంపై బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వంశీ ఎలా కావాలంటే అలా మాట్లాడగలరని, ఇంటెలిజెన్స్ డీజీ గురించి గతంలో ఏం మాట్లాడారో అందరికీ తెలుసన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ కేసును ఎందుకు బయటకు తీయడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం సీఎం జగన్ కోసం ఇన్ని మాటలు మాట్లాడుతున్న వంశీ.. ఆ తర్వాత ఈ మాటలన్నీ ముఖ్యమంత్రే మాట్లాడించారని చెప్పగలరని విమర్శించారు. సీఎం జగన్ మెప్పు పొందడం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆయన కుటుంబ సభ్యులపై అడ్డగోలుగా మాట్లాడటం, తెలుగుదేశం కార్యాలయంపై దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు.


తాము ఒక్కటే చెబుతున్నాం, ప్రాణాలకు తెగించాం అన్నారు బుద్ధా వెంకన్న. తెగించాం అని మొన్న మాజీ మంత్రి కొడాలి నాని అంటున్నారు. మీరు తెగించిందేంటి, ప్రతిపక్షంలో ఉండి కూడా నాయకుడికి అండగా నిలబడి పోరాటం చేస్తున్నది టీడీపీ నేతలు అన్నారు. అధికారంలో ఉండి, సీఎం పక్కన నిల్చుని ప్రతిపక్ష నేతలపై అవాక్కులు చెవాక్కులు పేలడాన్ని తెగించడం అనరంటూ ఎద్దేశా చేశారు. ముందు ఒక వ్యాన్, వెనకాల ఒక వ్యాన్ పెట్టుకుని ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం రాజకీయమా అని ప్రశ్నించారు. గతంలో పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరగగా, ఇప్పుడు గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని సైకో పాలనగా అభివర్ణించారు. 


కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ టీడీపీలో ఉన్నప్పుడు ఇలాంటి పనులు ఎందుకు చేయలేదంటే.. తమ అధినేత చంద్రబాబు ఇలాంటివి ప్రోత్సహించే వ్యక్తి కాదన్నారు. కానీ వైసీపీలో సైకో పాలన నడుస్తోందని, దాడులు చేయడం, సంఘ విద్రోహ పనులు చేస్తే పదవులు వస్తాయని ఈ నేతలు మరింతగా దిగజారుతున్నారని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ఒకటి చెబుతున్నాను. వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని, ఏడాదిలో ఎన్నికలు వస్తాయన్నారు. సార్ తప్పైంది, గతంలో సీఎం జగన్ మాట్లాడమంటే మాట్లాడామని, తమను క్షమించి సీట్లు ఇవ్వండి అని ఈ నేతలు చంద్రబాబును సీట్లు అడుగుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వంశీ భయపడి వైసీపీలోకి వెళ్లారని, తాను మాత్రం గతంలో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చెప్పారు. మేం కేవలం వంశీ గురించి మాట్లాడుతున్నాం, కానీ వాళ్ల కుటుంబసభ్యుల పేర్లు కూడా ప్రస్తావించడం లేదన్నారు. జగన్ మెప్పు కోసం ఎవరైతే వారికి అన్నం పెట్టారో ఆ చేతినే కరుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేసిన వైసీపీ నేతల్ని రక్షించి, బాధితులైన టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయిని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేయాలని పోలీసులకు సూచించారు.


.