గన్నవరంలో ఫిబ్రవరి 20న జరిగిన ఉద్రిక్తతలను బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఖండించారు. రాష్ట్రం మొత్తమ్మీద పులివెందుల సంస్కృతిని తీసుకొచ్చారని విమర్శించారు. ఫ్యాక్షనిజాన్ని సీఎం జగన్ పెంచి పోషిస్తున్నారని అన్నారు. పట్టాభిని మాయం చేసిన విషయంలో డీజీపీ వ్యవహరించిన తీరు సరైనది కాదని అన్నారు.
తాను ఫిబ్రవరి 23న టీడీపీలో చేరుతున్నట్లుగా కన్నా లక్ష్మీ నారాయణ అధికారికంగా ప్రకటించారు. తనతో పాటు చాలా మంది నేతలు టీడీపీలో చేరతారని అన్నారు. చంద్రబాబు నాయుడు సమక్షంలోనే తాను పార్టీలో చేరుతున్నానని, తనతో పాటు తన అనుచరులు కూడా అదే రోజు పార్టీలో చేరతారని తెలిపారు. ఒక వర్గం మీడియా తనపై అసత్య ఆరోపణలు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
అరాచకాలు చేస్తున్న వారిని వదిలిపెట్టి ప్రజా సమస్యలపై పోరాడే వారిపై పోలీసులు అక్రమ కేసులు పెడుతుండడాన్ని కన్నా లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. పోలీసులు ఒక వర్గం వారికి అండగా నిలుస్తున్నారని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో డీజీపీ వెంటనే జోక్యం చేసుకుని రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.