BRS Politics  :  భారత రాష్ట్ర సమితిలో ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేని విధంగా సీనియర్ రాజకీయ నేతలపై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటివి బయటకు వస్తే పార్టీకి ఇబ్బందికరం అవుతుందని వీలైనంత వరకూ హైకమాండ్ ప్రచారం జరగకుండా సైలెంట్ గా ఉంటోంది. దీంతో ఏ చర్యలు తీసుకోవడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. అయితే ఇలాంటి ఆరోపణల వెనుక హైకమాండ్ ప్రోత్సాహం కూడా ఉందని..  అది కూడా రాజకీయమేనన్న చర్చ  రాజకీయవర్గాల్లో ఉంది. అసలు ఎన్నికల సీజన్‌లో బీఆర్ఎస్ నేతలపై పెరిగిపోతున్న ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు రాజకీయమా ? యాధృచ్చికమా ?


కార్పొరేటర్ ను వేధిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే ఎవరు ?


హైదరాబాద్ నగరంలో యువ మహిళా కార్పొరేటర్ ను ఓ సీనియర్ ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు గురి చేసిన అంశం సంచలనంగా మారింది. ఇది బీఆర్ఎస్ పార్టీ నంచి మీడియాకు అందిన లీక్. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో.. కార్పొరేటర్ ఎవరో ఎవరికీ తెలియదు. కానీ ఇలా ఓ సీనియర్ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయని మీడియాకు తెలిపాయి బీఆర్ఎస్ వర్గాలు. తమ పార్టీకి ఇబ్బంది అవుతుందని తెలిసి కూడా ఇలా ఎందుకు చేశాయన్నదాంట్లోనే అసలు రాజకీయం ఉందని భావిస్తున్నారు. ఆ సీనియర్ నేతకు ఈ సారి టిక్కెట్ నిరాకరించడానికి ఇదో చాన్స్ అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 


రాజకీయ వ్యవహారం పదే పదే వివాదం !


ఇక తాటికొండ రాజయ్య గురించి చెప్పాల్సిన పని లేదు.  సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తర్వాత ఆమెతో రాజీ చేసుకున్నారు . కానీ రాజయ్య మాట తప్పారని మళ్లీ ఆరోపణలు చేస్తున్నారు. ఆయన తీరు మొదటి నుంచి వివాదాస్పదమే. డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఇలాంటి వ్యవహారాలకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయనపై ఆరోపణలతో.. నియోజవర్గం మొత్తం ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. అయితే హైకమాండ్ మాత్రం ఇంకా అధికారికంగా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. వీలైనంత మౌనం పాటిస్తోంది. 


దుర్గం  చిన్నయ్య పై శేజల్ ఆరోపణల సీరియల్ కంటిన్యూ !


ఇక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై శేజల్ అనే మహిళ చేస్తున్న ఆరోపణలు రోజూ హైలెట్ అవుతూనే ఉన్నాయి. చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని ఆమె ఢిల్లీ స్థాయిలో పోరాడుతున్నారు. కానీ ఆమె బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారని దుర్గం చిన్నయ్య అంటున్నారు కానీ.. మహిళ ఆరోపణలకే ఎక్కువ ప్రచారం లభిస్తోంది. అయితే ఈ అంశంలోనూ పెద్దగా  హైకమాండ్ స్పందించడం లేదు. 


గతంలోనూ కొందరిపై ఆరోపణలు !


గతంలోనూ ఇలాంటి ఆరోపణలు మరికొందరిపై వచ్చాయి. మంత్రి వర్గన్ని పునర్ వ్యవస్థీకరిస్తారని ప్రచారం జరిగిన సమయంలో ఓ మంత్రిపై ఇలాంటి ఆరోపణలు గుప్పుమన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలకు సన్నిహితమని భావించే మీడియా చానళ్లలోనే కథనాలు వచ్చాయి. అయితే తర్వాత మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరగలేదు. ఆ ఆరోపణలు అంతటితో ఆగిపోయాయి. ఇలాంటివి ప్రత్యేకమైన సందర్భాల్లో వచ్చినప్పుడు .. దీని వెనుక రాజకీయం ఉందా అన్న సందేహం ఎక్కువ మందికి వస్తోంది. టిక్కెట్లు నిరాకరించడానికి లేదా పదవుల నుంచి తప్పించడానికి  ఈ లైంగిక వేధింపుల ఆరోపణల్ని  హైలెట్ చేస్తున్నారా అన్న చర్చలు జరుగుతున్నాయి. ఏదైనా రాజకీయమే. ఇలాంటి ఆరోపణలు వచ్చిన ఎంత మందికి టిక్కెట్లు నిరాకరిస్తారన్నదాన్ని బట్టి వీటి వెనుక రాజకీయం ఉందా లేదా అన్నదానిపై క్లారిటీ వస్తుంది. కానీ ఎప్పటికీ కన్ఫర్మ్ కాదు. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial