Telangana Politics |తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బీ టీమ్ అన్న పదం ఎక్కువగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకీ B టీమ్ అని కాంగ్రెస్.. లేదు లేదు కాంగ్రెస్ కే బీఆర్ఎస్ బీ టీమ్ అని బీజేపీ ఆరోపిస్తోంది. అసలు ఇలాంటి ఆరోపణలు చేయడం వెనుక ఆయా పార్టీలు చెబుతున్న లెక్కలేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..! 


ఫస్ట్ బీఆర్ఎస్  అనేది బీజేపీకి బీ టీమ్ అని కాంగ్రెస్ చెబుతున్న కారణాల్లో నెం.1 కర్ణాటక ఎన్నికలు
బీజేపీపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. కర్ణాటక ఎన్నికల్లో మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కర్ణాటకలో తెలుగు ఓటర్ల ప్రభావం గట్టిగానే ఉన్నప్పటికీ.. కేసీఆర్ మాత్రం అటు వైపు చూడలేదు. ఎందుకంటే దానివల్ల బీజేపీకి మైనస్ అవుతుంది అందుకే కేసీఆర్ మాట్లాడలేదు అన్నది కాంగ్రెస్ వాదన.


రెండో కారణం.. దిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పేరును కూడా ఈడీ ప్రస్తావించింది. పలుమార్లు ఈడీ విచారణకు హాజరైంది. దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఇంకా కొంత మంది పెద్దలు ఈ కేసులో అరెస్టైనప్పటికీ... కవితను మాత్రం ఈడీ అరెస్ట్ చేయలేదు. కారణం..బీజేపీకి బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉంది అందుకే ఈడీ కేసు నుంచి కవిత బయటపడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.


మూడో కారణం.. దిల్లీ స్థాయిలో కేసీఆర్ కు బీజేపీ పెద్దలకు మంచి అవగాహన ఉంది. అందుకే కేసీఆర్ అవినితీ చేశారని ఆరోపిస్తున్నారు తప్ప అధికారంలో వాళ్ల చేతిలో ఉన్నా యాక్షన్ తీసుకోవట్లేదు. అలాగే, ఇటీవల బండి సంజయ్ ఓ కామెంట్ చేశారు. తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ పథకాలు తీసేయము. ధరణి కూడా రద్దు చేయం కానీ సమస్యలు పరిష్కరిస్తామని. కేసీఆర్ తెచ్చిన ధరణిని కాంగ్రెస్ రద్దు చేస్తామంటే.. బీజేపీ మాత్రం రద్దు చేయనంటోంది. దీనికి అర్థమేంటి అని నేరుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. 


2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకుంది. అలాంటింది.. 6నెలల తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాత్రం 4 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఒక్క ఎంపీ అంటే సాధారణంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు అనమాట. అంటే.. 6 నెలల్లోనే 28 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో బీజేపీ అంత ప్రభావం చూపించిందా..? లేదా కేసీఆర్ ముందస్తుకు బీజేపీ ఒకే చెప్పింది కాబట్టి.. ఎంపీ స్థానాలు కేసీఆర్ కావాలనే అప్పజెప్పారా..? అనే అనుమానాల్ని కాంగ్రెస్ నేతలు లెవనెత్తతున్నారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ లా వ్యవహరిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సో.. ఈ లెక్కలన్నీవేస్తూ..  దిల్లీలో దోస్తి..గల్లీలో కుస్తీ అన్నట్లుగా బీఆర్ఎస్ చేస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.



ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ బీ టీమ్ అనడానికి బీజేపీ చెబుతున్న కారణాలు ఏంటంటే..! ప్రధాని మోదీని గద్దె దించడమే ఇద్దరి లక్ష్యం. అందుకే ఇద్దరు ఒకటయ్యారు. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తే... ప్రతిపక్షాల ఓట్లు చీలుతే...బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుందని కేసీఆర్ పోటీకి దిగలేదని చెబుతున్నారు. అంతేకాదు..కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆర్థిక సాయం కూడా చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. బీజీపీ, కాంగ్రెస్ లకు సమదూరం వహిస్తానన్న కేసీఆర్.. క్రమంగా కాంగ్రెస్ ఉన్న విపక్ష కూటమిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని వాదన వినిపిస్తోంది. అందుకే.. రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశంపై కూడా కేసీఆర్ ఘాటుగా స్పందించారు. విపక్షాల కూటమికి ఛైర్మన్ గా తనను నియమిస్తే.. ఎలక్షన్ ప్రచారానికి మెుత్తం ఖర్చు తానే భరిస్తానని కేసీఆర్ అన్నారనే ప్రచారం జరుగుతోందని నేషనల్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ కూడా అప్పట్లో అన్నారు. ఇలా... మోదీపై యుద్ధానికి కేసీఆర్... బీజేపీకీ బీ టీమ్ ఎలా అవుతారు..? కచ్చితంగా కాంగ్రెస్ కే బీ టీమ్ అవుతారు అని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. 
ఓవరాల్ గా... బీఆర్ఎస్ బీ టీమ్ అనడానికి కాంగ్రెస్, బీజేపీ చెబుతున్న కారణాలు ఇవి. ఇవి చూసిన తరువాత మీకేం అనిపిస్తోంది..?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial