Janasena Plan :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన నిర్ణయాత్మక శక్తిగా మారింది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇంకా ఫీల్డ్ లోకి రాలేదు. మొత్తం పార్టీలో నెంబర్ టుగా ఉన్న  నాదెండ్ల మనోహర్ చూసుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన ప్రాధాన్యాన్ని పవన్ కల్యాణ్ క్రమంగా తగ్గిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఏమిటన్నది జనసేనలోనే విస్తృత చర్చ జరుగుతోంది. 


చంద్రబాబుతో చర్చలకు పవన్ వెంట లేని నాదెండ్ల! 


జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల హఠాత్తుగా చంద్రబాబు ఇంటికి వెళ్లారు. చర్చలు జరిపారు. ఆయన ఒక్కరే వెళ్లారు. మీడియాతో కూడా మాట్లాడలేదు. పవన్ కల్యాణ్ ఇలా ఒక్కరే వెళ్లడం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పవన్ రాజకీయ సమావేశాలు ఎలాంటివైనా పక్కన నాదెండ్ల మనోహర్ ఉండాల్సిందే. అందుకే నాదెండ్ల మనోహర్ ఏడి అన్న అనుమానం జనసేన వర్గాలకే కాదు ఇతర రాజకీయ పక్షాలకూ వచ్చింది.  జనసేనలో పవన్ కల్యాణ్ తర్వాత నాదెండ్ల మనోహరే. అన్ని రాజకీయ వ్యవహారాలను ఆయనే చక్క బెడుతున్నారు. బీజేపీతో పొత్తు విషయంలోనూ ఆయనే ఎక్కువగా సమన్వయం చేసుుకుంటున్నారు. నాదెండ్ల మనోహర్ తండ్రి భాస్కర్ రావు అధికారికంగానే బీజేపీలో చేరారు.  పవన్ కల్యాణ్ సినిమాల్లో బిజీగా ఉంటే నాదెండ్లే మొత్తం పార్టీని నడిపిస్తున్నారు. విస్తృతంగా పర్యటిస్తున్నారు.


ఢిల్లీలో పవన్ తో కలిసే నాదెండ్ల చర్చలు !


అయితే బీజేపీ హైకమాండ్‌తో జరిపిన చర్చలకు నాదెండ్ల కూడా వెళ్లారు. ఆ తర్వాతే  నాదెండ్లకు రాజకీయంగా  ప్రాధాన్యం ఇటీవల పవన్ కల్యాణ్ తగ్గిస్తున్నట్లుగా తెలుస్తోంది. కీలక రాజకీయ సమావేశాల్లో నాదెండ్ల పెద్దగా కనిపించడం లేదు.  ఇటీవల హఠాత్తుగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. సోదరుడు నాగబాబుకు ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. అంటే ఇప్పుడు జనసేనలో నెంబర్ టు ఆయనే అనుకోవచ్చు. నాగబాబు పదవి చేపట్టగానే ముందుగా జనసేన క్యాడర్ మొత్తాన్ని తన గ్రిప్‌లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలు తిరగడానికన్నా ముందే టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లలోనూ నాదెండ్ల కనిపించడం లేదు. ఆయన వేరేగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నాదెండ్ల ప్రాధాన్యతను  వీలైనంతగా తగ్గించడానికే పవన్ కల్యాణ్ నాగబాబుకు బాధ్యతలిచ్చారన్న అభిప్రాయం ఎక్కువగా  వినిపిస్తోంది. 
 
జనసేనలో గందరగోళం!


పవన్ కల్యాణ్ ఓ వైపు రాజకీయాలపై సమయం కేటాయించడం తక్కువగా ఉంది. గతంలో వారాంతాల్లో అయినా ఏపీలో పర్యటించేవారు. ఓ సమావేశంలో మాట్లాడేవారు. గత రెండు, మూడు నెలలుగా అదీ లేదు. ఎప్పుడో ఓ సారి బీజేపీ పెద్దలతో భేటీ.. లేకపోతే చంద్రబాబుతో భేటీ అంటూ వార్తల్లోకి వస్తున్నారు. వారాహీ వాహనం రెడీ చేసుకుని కావాల్సినంత ప్రచారం చేసుకున్నారు. కానీ ఇంత వరకూ రోడ్డెక్కలేదు. దీంతో పవన్ ..జనసేన పయనంపై ఆ పార్టీ క్యాడర్‌లో గందరగోళం ఏర్పడుతోంది. వీలైనంత త్వరగా పవన్ కల్యాణ్ ఫీల్డ్ లోకి రావాలని జనసైనికులు కోరుకుంటున్నారు. అయితే కీలక నిర్ణయాలు తీసుకునే .. రంగంలోకి దిగాలని పవన్ కల్యాణ్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.