AP BJP : తమిళనాడులో బీజేపీ పుంజుకుంటోంది. నిజానికి తమిళనాడు అంటే కొన్ని ప్రత్యేమైన భావజాలాలు ఉండే రాష్ట్రం. అక్కడ బీజేపీ నిలదొక్కుకోవడం కష్టమన్న అభిప్రాయం ఉండేది. కానీ మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలైను అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఆ పార్టీ రాత మారిపోయింది. ప్రజల్లో క్రేజ్ పెరిగింది. అక్కడ అన్నామలై పార్టీని అభివృద్ధి చేస్తున్నారు. ఇందు కోసం ఆయన డీఎంకే ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో విరుచుకుపడుతున్నారు. డీఎంకే ఫైల్స్ పేరుతో డాక్యుమెంట్లు రిలీజ్ చేస్తున్నారు. మరి ఏపీలో మరో అన్నామలై ఎందుకు ఎదగలేకపోతున్నారు. .? దీనికి ఖచ్చితంగా హైకమాండే కారణం అని చెప్పకతప్పదు.
తమిళనాడులో బీజేపీకి సహకరిస్తున్న హైకమాండ్
అన్నామలై.. మాజీ ఐపీఎస్ అధికారి, సర్వీసులో ఉన్నప్పుడు ఆయన కర్ణాటకలో పని చేశారు. తర్వాత రాజకీయాలపై ఆసక్తితో వెంటనే సర్వీసు వదిలేశారు. ఆయనపై హైకమాండ్ నమ్మకం పెట్టుకుంది. అందుకే అవకాశం ఇచ్చింది. యువకుడిగా చురుగ్గా ఉండే అన్నామలై పార్టీ విధానాలకు అనుగుణంగా అవకాశాలు సృష్టించుకుని ముందుకు దూసుకెళ్లారు. అదే సమయంలో ఆయనకు హైకమాండ్ నుంచి కావాల్సినంత మద్దతు లభించింది. ఆయన ఏమడిగినా చేసి పెట్టింది. డీఎంకే అవినీతిపై పోరాటం అంటూ కొంత మంది జాబితా రిలీజ్ చేసి వారిపై దర్యాప్తు సంస్థలు విరుచుకుపడతాయని ప్రకటించారు. అన్నట్లుగానే దాడులు జరుగుతున్నాయి. దీంతో అన్నామలైకు క్రేజ్ మరింత పెరిగింది. డీఎంకేపై బీజేపీనే పోరాడుతోందన్న అభిప్రాయం ఏర్పడుతోంది.
ఏపీలో హైకమాండ్ నేతలకు సహకరిస్తోందా ?
తమిళనాడులో బీజేపీ శాఖకు సహకరిస్తున్నట్లుగా సహకారం కాదు కదా.. అసలు రివర్స్‌లో వైసీపీకి సహకరిస్తున్నారన్న అసంతృప్తి పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు చేపట్టగానే దూకుడుగా వెళ్తున్నారు. వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వం ఆర్థిక అవకతవకలపై ప్రశ్నిస్తున్నారు. రూ. పది లక్ష కోట్లకుపైగా అప్పులు చేశారని లెక్కలు చెప్పారు. అయితే పురందేశ్వరి చేసిన ఆరోపణలను .. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ఖండించారు. అప్పులు నాలుగేళ్లలో రూ. లక్షా 70 వేల కోట్లే అప్పు తీసుకున్నారని ప్రకటించారు. నేరుగా కాకపోయినా ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాదానంతో వైసీపీకి మేలు చేసినట్లయింది. ఇది చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. పాపం పురందేశ్వరి అని రాజకీయవర్గాలు అనుకున్నాయి.
పరిమితమైన సమాచారం ఇచ్చిన నిర్మలా సీతారామన్
ఏపీ ప్రభుత్వ అప్పులు బహిరంగ రహస్యం. కార్పొరేషన్లు, మద్యం బాండ్లు, ఆస్తులు తనఖా పెట్టి పెద్ద ఎత్తున రుణాలు తెచ్చారు. అయినా వీటి గురించి ఏమీ తెలియనట్లుగా నిర్మలా సీతారామన్ చెప్పడంతో.. పురందేశ్వరికి సపోర్ట్ కాదు కదా మోరల్‌గా దెబ్బతీసినట్లయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ముందుగా ఏపీ విషయంలో బీజేపీ హైకమాండ్ ఓ స్పష్టతకు రావాలని.. ఆ తర్వాతే.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయాలని అంటున్నారు. ఏపీలో అన్ని రకాల అక్రమాలు జరుగుతున్నాయని పోరాటం చేయాలని సూచించడం… మళ్లీ ఆ అక్రమాలపై ప్రశ్నిస్తే.. కేంద్రమే అధికార పద్దతుల్లో బీజేపీ వాదనను ఖండించేలా సమాచారం రిలీజ్ చేయడం అంటే సొంత నేతల్ని కించపర్చడమేనని గుర్తు చేస్తున్నారు.