Lokesh Yatra : తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ యువగళం పేరుతో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పాదయాత్ర కోసం లోకేష్ ఆరు నెలలుగా కసరత్తు చేస్తున్నారు. ఇందు కోసంటీడీపీ మొత్తం యాక్టివ్ అయింది. రూట్ మ్యాప్ సహా.. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అడ్డంకులు రావొచ్చు.. వాటిని ఎలా ఎదుర్కోవాలన్నదానిపై ముందస్తుగా కసరత్తు పూర్తి చేశారు. బ యటకు తెలియకయపోయినా యువ నేతలతో కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందస్తు సన్నాహాలు కూడా పూర్తి చేసుకున్నారు. ఇరవై ఏడో తేదీన యాత్ర ప్రారంభం కానుంది. అయితే టీడీపీ మాత్రం.. లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికి వైఎస్ఆర్‌సీపీ అటు అధికారపక్షంతో పాటు ఇటు రాజకీయంగానూ ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తోంది. దీనికి పలు కారణాలను చూపిస్తోంది.
లోకేష్ పాదయాత్రకు అనుమతిపై తేల్చని పోలీసులు !
లోకేష్ పాదయాత్ర చేయబోతున్నారని..ఆయనకు రాజకీయ ప్రత్యర్థులు, ఇతర సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని .. భద్రత కల్పించాలని రెండు వారాల కిందటే ఏపీ పోలీసులకు టీడీపీ నుంచి లేఖ వెళ్లింది. కానీ పోలీసులు స్పందించలేదు. రెండో సారి టీడీపీ రిమమైండర్ పంపిన తర్వాత పోలీసుల నుంచి స్పందన వచ్చింది. పాదయాత్ర కు సంబంధించి డీటైల్స్.. ఎన్ని రోజులు నిర్వహిస్తారు.. ఏ రోజు ఏఎక్కడ పాదయాత్ర చేస్తారు.. ఎంత మంది పాల్గొంటారు అన్న వివరాలు ఇవ్వాలని కోరారు. దీనిపై టీడీపీ మళ్లీ సమాధానం పంపింది. అయితే అనుమతి ఇస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. పాదయాత్రను అడ్డుకోవడానికే ఇలా చేస్తున్నారని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి.
జీవో నెంబర్ 1 లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికేనంటున్న టీడీపీ !
ఇటీవల వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ వన్ లోకేష్ పాదయాత్ర జరగకుండా టార్గెట్ చేసి రిలీజ్ చేసిందేనని.. టీడీపీ వర్గాలంటున్నాయి. తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను వైసీపీ భరించలేకపోతోందని అందుకే కట్టడి చేయాలనుకుంటోందని అంటున్నారు. ఆ జీవో విషయం ప్రస్తుతం హైకోర్టులో ఉంది. ఇప్పటికైతే స్టే ఇచ్చారు. స్టేను ఎత్తి వేయాలని జీవో అమలు చేసేలా అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకెళ్లింది. కానీ సుప్రీంకోర్టు హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది. 23వ తేదీన విచారణ జరగనుంది. ఇప్పటికే అమరావతి రైతుల పాదయాత్ర విషయంలో హైకోర్టు పెట్టిన ఆంక్షల కారణంగా ఆ పాదయాత్రను రైతులు ఆపేయాల్సి వచ్చింది. ఏ చిన్న ఆంక్షలు పెట్టినా పోలీసులు విశ్వరూపం చూపిస్తారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
కుప్పంలో దాడులు చేయాలని వైఎస్ఆర్‌సీపీ నేతల పిలుపులు !
మరో వైపు కుప్పంలో లోకేష్ పాదయాత్ర రోజున ఆయనను అడ్డుకుందామని.. దాడులు చేద్దామని.. వైఎస్ఆర్‌సీపీ తరపున కొంత మంది నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గం శాంతి పురం మండలం ఎంపీపీ కోదండరెడ్డి ఇచ్చిన ఈ పిలుపు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై టీడీపీ నేతలు సోషల్ మీడియాలో పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పర్యటనల్లో ఉద్రిక్తలు సృష్టించి.. పాదయాత్రను నిలిపివేసే కుట్ర చేస్తున్నారని టీడీపీ నేతలంటున్నారు.
లోకేష్ పాదయాత్రకు ఆటంకాలు ఏర్పడితే ప్రభుత్వానికే చెడ్డపేరు !
లోకేష్ పాదయాత్రకు వైసీపీ ద్వారా కానీ.. ప్రభుత్వం ద్వారా కానీ ఆటంకాలు ఏర్పడితే ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ కాలం పాదయాత్ర, ఓదార్పు యాత్రలు చేసే అధికారంలోకి వచ్చారు. ఆయన ఎప్పుడూ అనుమతులు తీసుకోలేదు. అనుమతులు అవసరం లేదని వైసీపీ నేతలు చేసిన ప్రకటనలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాదయాత్ర సజావుగా సాగేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. అయితే.. ఏం జరగనుందనేది మాత్రం ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. లోకేష్ యాత్రను చూసి భయపడుతున్నారని అందుకే ఆటంకాలు సృష్టిస్తున్నారని టీడీపీ నేతలంటున్నారు.