గుంటూరు: ఆంధ్ర ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు తలవంచి క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రజలపై చేసిన కామెంట్లపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిగ్గు పడుతున్నాను అని అని ప్రకటించి ఆంధ్ర లో అడుగు పెట్టాలని సూచించారు. ఎన్నటికీ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఏపీలోకి స్వాగతించరని చెప్పారు. ఆంధ్ర ప్రయోజనాలను దెబ్బతీసిన వ్యక్తి కేసీఆర్ అంటూ మండిపడ్డారు. 


రాష్ట్రంలో రాజకీయాలు చేసుకునే హక్కు ఎవరికైనా ఉంటుందని,  కానీ రాష్ట్ర ప్రజలను అవమానించిన కేసీఆర్ ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. లేకపోతే ఏపీలో బీఆర్ఎస్ రాకను అడ్డుకుని తీరుతామని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు క్షమాపణ చెప్పకుండా ఆంధ్రలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీకి విఆర్ఎస్ ఇప్పిస్తాం అని ఎద్దేవా చేశారు. తమ పార్టీ నేతలు ఎవరు బిఆర్ఎస్ కి వెళ్లే పరిస్థితి లేదన్నారు. అయితే గతంలో మా పార్టీ నుంచి వెళ్లిపోయిన కొంత మంది బిఆర్ఎస్ పార్టీలో చేరారని, అది తమ పార్టీ కి సంబంధం లేదన్నారు. 


బీజేపీ ప్రజా పోరు యాత్ర
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బీజేపీ ప్రజా పోరు యాత్ర ఉంటుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ తెలిపారు. 2024 లో భారతీయ జనతా పార్టీ అనే రైలు అతివేగంగా అత్యంత అద్భుతంగా ప్రయాణిస్తుందన్నారు. ప్రస్తుతం దేశంలో అత్యంత వేగవంతమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ధీటుగా బిజెపి పరుగులు పెట్టబోతోందన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధి గురించి జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించాం. ఈనెల 24న జరిగే కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధిపై చర్చ ఉంటుందని తెలిపారు. 


ఇటీవల విశాఖలో మాట్లాడిన జీఎల్... ఆంధ్రులను కుక్కలు అని తిట్టిన కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని ఏపీలో పోటీ చేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను ఏపీ ప్రజలు ఆదరించరన్నారు. లేని బలాన్ని ఉన్నట్టు కేసీఆర్ చూపిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తెలంగాణలో కూడా ఓడిపోతారన్నారు. పోలవరం వద్దని కోర్టులో పిటీషన్ వేసిన కేసీఆర్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ తాము కడతామని ఎలా చెబుతారన్నారు. ముందు కోర్టుకు క్షమాపణ చెప్పి ఆ  పిటీషన్ వెనక్కి తీసుకోవాలన్నారు. కేసీఆర్ ఏపీకి చేసిన ద్రోహాన్ని ఆంధ్రులు మరిచిపోరన్నారు. ఏపీ పాలకులకు బీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతారేమో కానీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు.


"ర్యాలీలు, రోడ్ షోలు చేసేటప్పుడు పార్టీలు స్వీయ నియంత్రణ పాటించాలి. అంతేగాని ప్రభుత్వాలు నిషేధాలు విధించడం ప్రజాస్వామ్య విధానం కాదు. బీఆర్ఎస్ పార్టీ ఒక దుర్మార్గపు పార్టీ. ఆంధ్ర రాష్ట్ర ప్రజల అవసరాలు తుంగలోకి తొక్కారు. ఆంధ్రలో ప్రాజెక్ట్ లకు కేసీఆర్ అడ్డుపడ్డారు. ఆంధ్ర వారిని తరిమి తరిమి కొడతాను అన్న కేసీఆర్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రలోకి వచ్చారు. ఆంధ్ర పాలకులు అవసరమా అని అడిగారు. ఇప్పుడు ఆంధ్ర నుంచి నాయకులు బీఆర్ఎస్ కి తీసుకున్నారు. ఏపీలో అడుగుపెట్టే ముందు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. విభజన సమస్యల పరిష్కారానికి 29 సమావేశాలు పెట్టినా పరిష్కరించలేదు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు అవుతుంది.