Gajwel KCR :తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేయడం లేదనే ప్రచారం విస్తృతంగా జరుగుతోది. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే దిశగా అడుగులేస్తోన్న సిఎం కెసిఆర్ పార్లమెంట్‌కు పోటీ చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపిగా బరిలోకి దిగుతారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ గత రెండు సార్లు గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అంతకు ముందు ఆయన సిద్ధిపేట నుంచి పోటీ చేసేవారు. ఇప్పుడా స్థానం నుంచి హరీష్ రావు పోటీ చేస్తున్నారు. గజ్వేల్ నుంచి గెలిచిన రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు.
ఈ సారి ఆయన నియోజకవర్గం మారబోతున్నట్లుగా కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ కూడా ఈ అంశంపై క్లారిటీగా ఉన్నారని అంటున్నారు. కేసీఆర్ రెండు సార్లు గజ్వేల్‌లో పోటీ చేస్తే రెండు సార్లూ గట్టి పోటీ ఇచ్చిన నేత వంటేరు ప్రతాప్ రెడ్డి, ఓ సారి టీడీపీ తరపున.. మరోసారి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. రెండు సార్లూ ఆయన గెలిచేస్తారన్నంతగా పోటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సారి కేసీఆర్‌కు బదలుగా టీఆర్ఎస్ తరపున వంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేస్తారని ఈ మేరకు నియోజకవర్గంలో పని చేసుకోవాలని కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది.
గజ్వేల్‌లో మంచి పట్టు ఉన్న ప్రతాపరెడ్డి ( Vanteru Pratap Reddy ) ఇటీవలి కాలంలో నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నారు. అయితే ఈ ప్రచారం నిజమో.. వ్యూహమో కానీ దీని వల్ల టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ సారి కేసీఆర్ నియోజకవర్గం మారడం ఖాయమని అనుకుంటున్నారు. కేసీఆర్ ఎంచుకునే నియోజకవర్గాల్లో నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం మెదక్ నుంచి టిఆర్‌ఎస్ ఎంపిగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి ఈసారి లోక్‌సభకు కాకుండా దుబ్బాక నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని చెబుతున్నారు.
జాతీయ రాజకీయాలకు వెళ్ళినా కేసీఆర్ ఖచ్చితంగా ఎమ్మెల్యేగా బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలకు వస్తాయి. కేసీఆర్ పోటీ చేయకపోవడం అనే సమస్య ఉండదు. గజ్వేల్ కాకపోతే మరి ఏ నియోజకవర్గం అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విషయంలో టీఆర్ఎస్ అధినేత ఆలోచనలు ఎలా ఉన్నాయో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.