BRS : నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌లో అతి భారీ వర్షం కురిసింది. ఎంత అంటే.. ఎప్పుడూ నీళ్లు చూడని రోడ్లు కూడా నదుల్లా పారాయి. పదుల సంఖ్యలో జనం కొట్టుకుపోయారు. హైదరాబాద్‌లోని సగం ఇళ్లు నీట మునిగాయి. అంత వరద వందేళ్లలో రాలేదని అప్పటి ప్రభుత్వం చెప్పింది. నాలాలు కబ్జాకు గురయ్యాయని.. చెరువుల్ని కబ్జా చేశారని అన్నింటినీ క్లియర్ చేసి..మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా చూస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో కూల్చివేతల్ని వ్యతిరేకిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పు చేస్తోందని అంటోంది. హైడ్రా బాధితులకు అండగా ఉంటామని చెబుతోంది. అంటే కబ్జాలు చేసిన వాళ్లకు బీఆర్ఎస్ అండగా ఉంటుందా ?. ఇదే సపోర్టు ఉంటే.. మరతంగా కబ్జాలు పెరగవా ?. దీని వల్ల ఇతర ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉంటుందా ?
హైడ్రా కూల్చివేతలు పూర్తిగా చెరువులు, ప్రభుత్వ భూముల్లోనే!
హైడ్రా ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క చోట కూడా ప్రైవేటు ల్యాండ్స్ లో కూల్చివేతలు చేపట్టలేదు. ప్లాన్ ప్రకారం కట్టలేదనో మరో కారణమో చూపి కూలగొట్టలేదు. అంటే ప్రైవేటు ఆస్తుల జోలికి వెళ్లలేదు. ఎక్కడ కూలగొట్టిన చెరువులు, ప్రభుత్వ భూముల్లో కబ్జా చేసిన కట్టిన వాటినే కూలగొట్టారు. అక్కడ కబ్జా చేసి అమ్ముకున్న వాళ్లు పరారయ్యారు.కొనుకున్న వాళ్లు నష్టపోయారు. ఈ విషయంలో ప్రభుత్వం వారికి ఏమైనా న్యాయం చేస్తుందో లేదో స్పష్టత లేదు. ఈ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు కానీ.. కూల్చి వేతల్ని ప్రశ్నిస్తే కబ్జాల్ని సమర్థించినట్లే అవుతుంది. దీని వల్ల బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ లో కూడా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
హైడ్రా ఇప్పటికీ నివాసం ఉన్న ప్రాంతాలను కూలగొట్టడం లేదని.. వారికి సమయం ఇస్తామని చెబుతోంది. కొత్తగా నిర్మాణంలో ఉన్నవాటిని మాత్రం వదిలి పెట్టేది లేదని చెబుతోంది. గత పదేళ్ల కాలంలో చెరువులు, ప్రభుత్వ భూములు విపరీతంగా కబ్జా అయ్యాయి. ఇటీవల కిష్టారెడ్డిపేటలో కూల్చివేసిన ఇళ్లు ఉన్నది ప్రభుత్వ భూమే. అలా వదిలేస్తే కబ్జా దారులకు వదిలేసినట్లవుతుంది. ఆ ధైర్యంతో వారు మరిన్ని కబ్జాలు చేస్తారు. ఈ విషయంలో కిష్టారెడ్డి పేట లేకపోతే ఆ చుట్టపక్కల ప్రభుత్వానికి మద్దతే ఉంది. అవి ప్రభుత్వ భూములని తెలిసి కూడా చాలా మంది కొనుగోలు చేశారని ... మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తే తమ జోలికి రారన్నది వారి ధైర్యమని అనుకున్నారు. కానీ ప్రభుత్వం మారడంతో మొత్తం సీన్ మారిపోయింది.
హైదరాబాద్ మునగకుండా ఉండాలంటే హైడ్రా కావాల్సిందే !
హైడ్రా ఎక్కడా ప్రైవేటు ఆస్తుల జోలికిరావడం లేదు కాబట్టి మెజార్టీ ప్రజలు సమర్థిస్తున్నారు. కృష్ణానది ఒడ్డున ఉన్న విజయవాడకు కృష్ణా నుంచి కాకుండా.. బుడమేరు నుంచి వచ్చిన ముప్పు వల్ల సగం విజయవాడ ప్రజలు నష్టపోయారు. అలాంటి పరిస్థితి హైదరాబాద్‌కు ..న్యాయంగా ప్రైవేటు స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వారికి రాకండా ఉండాలంటే ఖచ్చితంగా చెరువుల్ని.. నాలాల్ని.. కాపాడుకోవాలని అంటున్నారు. దీని వల్ల ప్రభుత్వానికి మద్దతు లభిస్తోంది. మూసి విషయంలో నిరుపేదలకు ప్రత్యామ్నాయం చూపించేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది కాబట్టి.. అక్కడా వ్యతిరేకత రాదని.. వచ్చినా సపోర్టే ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు.