Jagan warnings to AP government: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలపై తీసుకుంటున్న చర్యల వేగంపై భిన్న రకాల చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వంటి వారు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేయడం, వివేకా హత్య కేసు, రఘురామ కృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ వంటి సున్నితమైన అంశాల్లో జగన్ పాత్రపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేయడంతో సోషల్ మీడియాలో కొత్త వాదనలు మొదలయ్యాయి. ప్రభుత్వం జగన్‌కు భయపడుతోందా అనే సందేహాలను కొందరు లేవనెత్తుతున్నారు.
చట్టబద్ధమైన పాలన అంటున్న టీడీపీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయం అంటే కక్షసాధింపు కాదని, చట్టబద్ధత అని బలంగా నమ్ముతున్నారని టీడీపీ వర్గాలంటున్నాయి. గత వైసీపీ హయాంలో జరిగినట్లుగా అర్థరాత్రి అరెస్టులు, ఆధారాలు లేని అక్రమ కేసులు బనాయించడం వంటి రాజ్యాంగ విరుద్ధ పనులకు తావు ఇవ్వకూడదన్నది ఆయన స్పష్టమైన ఆలోచన అని.. ఏ చర్య తీసుకున్నా అది న్యాయస్థానాల్లో నిలబడాలని, నిందితులు చట్టం నుంచి తప్పించుకునే చిన్న అవకాశం కూడా ఉండకూడదని భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకే అవినీతి ఆరోపణలు ఉన్న చోట సిట్ )ల ద్వారా లోతైన విచారణ చేయిస్తూ, పక్కా ఆధారాల సేకరణకే ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు.
జగనే భయం నీడలో ఉన్నారంటున్న టీడీపీ
కేసుల విచారణలో జరుగుతున్న ఆలస్యాన్ని కొందరు భయంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఇది నిజానికి నిందితుల చుట్టూ చట్టపరమైన ఉచ్చును పటిష్టం చేసే వ్యూహం అని టీడీపీ వర్గాలు సమర్థించుకుంటున్నాయి. అదే సమయంలో జగన్ మోహన్ రెడ్డినే భయం నీడలో ఉన్నారని అంటున్నారు. ఒకప్పుడు రాష్ట్రమంతటా పర్యటించిన ఆయన, ఇప్పుడు వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే ఏపీలో కనిపిస్తూ, మిగిలిన సమయం బెంగళూరు ప్యాలెస్‌కే పరిమితమవుతున్నారని గుర్తు చేస్తున్నారు. గతంలో గర్జించిన వైసీపీ సీనియర్ నేతలు సైతం నేడు బయటకు వచ్చి మాట్లాడటానికి సాహసించడం లేదని.. ఇది వారి భయాన్ని సూచిస్తోందంటున్నారు.
ఏపీ వెంకటేశ్వరరావుది ప్రత్యేక ఏజెండా?
ఏబీ వెంకటేశ్వరరావు వంటి బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వారు అసహనం వ్యక్తం చేయడం వెనుక గతంలో వారు అనుభవించిన వ్యక్తిగత వేధింపుల ఆవేదన ఉండవచ్చునని టీడీపీ నేతలంటున్నారు. కానీ, ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం భావోద్వేగాల మీద కాకుండా, కేవలం సాక్ష్యాధారాల ఆధారంగానే అడుగులు వేయాల్సి ఉంటుంది. విచారణలో ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది నిందితులకు పొలిటికల్ ట్రాప్ గా మారి, వారు బాధితులుగా చెప్పుకునే అవకాశం ఇస్తుంది చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న ఈ చట్టబద్ధమైన విధానం వల్ల విచారణ కాస్త ఆలస్యంగా అనిపించినా, తుది ఫలితం మాత్రం పక్కాగా ఉంటుందని టీడీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం నుండి తప్పించుకోలేరనే భరోసాను ప్రజల్లో కల్పించేందుకు ప్రభుత్వం క్షుణ్ణంగా కసరత్తు చేస్తోంది. ఇది భయం కాదు, వ్యూహాత్మకమైన మౌనంగా టీడీపీ వర్గాలు కవర్ చేసుకుంటున్నాయి.