New PCC Chief For Telangana Congress: తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టినప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, గ్రూపు రాజకీయాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాలనపై, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ.. పార్టీ వ్యవహారాలను చక్కదిద్దే బలమైన నాథుడు కరువవడంతో గాంధీభవన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. భిన్న ధృవాలుగా ఉండే సీనియర్ నేతలను, విభిన్న వర్గాలను ఒక తాటిపైకి తెచ్చే బలమైన సమన్వయకర్త  లేకపోవడం వల్లే పార్టీలో ఈ అంతర్గత సంక్షోభం ముదురుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Continues below advertisement

యాదాద్రిబోర్డు నియామకంపై అసంతృప్తి 

ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కాంగ్రెస్ అధిష్టానానికి తీవ్ర తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ బోర్డు నియామక ప్రక్రియ పార్టీలో పెద్ద దుమారమే రేపింది. ఈ బోర్డు నియామకంలో తమకు సరైన ప్రాధాన్యత దక్కలేదని, జూనియర్లకు పదవులు కట్టబెట్టారని పార్టీ కోసం ఎప్పటి నుంచో నమ్ముకుని ఉన్న సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో తమకు తెలియకుండానే నియామకాలు జరగడంపై వారు బహిరంగంగానే తమ  అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. ఈ వివాదం సద్దుమణగక ముందే, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి వ్యవహారం పార్టీని మరింత రక్షణలో పడేసింది. ఒక కీలకమైన బీసీ నేతను ఉద్దేశించి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి. సామాజిక సమీకరణాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన తెలంగాణ వంటి రాష్ట్రంలో, బలమైన బీసీ వర్గానికి చెందిన నేతపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ సాంప్రదాయానికి విరుద్ధమని సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. ఈ వ్యవహారం పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా, అంతర్గత కుల సమీకరణాల ఘర్షణకు దారితీస్తోంది.

Continues below advertisement

గాంధీభవన్ లో తుంగతుర్తి పంచాయతీ రచ్చ 

మరోవైపు, తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక పంచాయతీ ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యాలయమైన గాంధీభవన్‌కే చేరింది. స్థానిక నేతల మధ్య ఉన్న విభేదాలు, ఆధిపత్య పోరు కారణంగా గాంధీభవన్ వేదికగా ఇరువర్గాలు గందరగోళానికి దిగడం, వాగ్వాదానికి దారితీయడం మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనికి తోడు సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఖరి, ఆయన అనుసరిస్తున్న సొంత లైన్ పార్టీకి నిరంతరం సవాల్‌గా మారుతూనే ఉంది. నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు పాత కాంగ్రెస్ శ్రేణుల మధ్య సరైన సమన్వయం కుదరకపోవడంతో క్యాడర్ తీవ్ర అయోమయానికి లోనవుతోంది.

చక్కదిద్దలేకపోతున్న రాష్ట్ర నాయకత్వం 

ఈ మొత్తం సంక్షోభానికి ప్రస్తుత పీసీసీ  నాయకత్వ శైలి, మేనేజ్‌మెంట్ లోపమే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలో వస్తున్నా సమస్యలను ప్రాథమిక దశలోనే పరిష్కరించడంలో, నేతల మధ్య రాజీ కుదర్చడంలో పీసీసీ చీఫ్ సామర్థ్యం సరిపోవడం లేదంటూ సీనియర్లు భావిస్తున్నారు. సమస్యల తీవ్రతపై నివేదికలు సిద్ధం చేసి, రాష్ట్ర స్థాయిలోనే సెటిల్ చేయాల్సింది పోయి.. ప్రతి చిన్న విషయానికి ఢిల్లీ వైపు చూడటంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్ పనితీరుపై అసంతృప్తిగా ఉన్న పలువురు సీనియర్ నేతలు నేరుగా ఏఐసీసీ  హైకమాండ్‌కు లిఖితపూర్వక ఫిర్యాదులు పంపినట్లు సమాచారం.

పీసీసీ చీఫ్‌ను మారుస్తారా? 

 తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలను మార్చాలనే ప్రచారం ఢిల్లీ పీఠం నుండి గల్లీ వరకు జోరుగా సాగుతోంది. పాలనలో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి అండగా ఉంటూ, ఇటు పార్టీని క్రమశిక్షణతో నడపగలిగే ఒక సీనియర్, అందరికీ ఆమోదయోగ్యుడైన నేతకు పీసీసీ చీఫ్ పదవి అప్పగించాలని హైకమాండ్  యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉండి కూడా నిరంతరం వివాదాలతో సాగుతున్న తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత రాజకీయం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.