TRS In Tension : తెలంగాణ రాష్ట్ర సమితి నేతల్లో రోజు రోజుకు టెన్షన్ పెరగిపోతోంది. కేసీఆర్ కేసీఆర్ కేంద్రంపై ప్రకటించిన యుద్ధం కారణంగా మధ్యలో తాము టార్గెట్ అవుతున్నామన్న ఆందోళన అగ్రశ్రేణి నేతల్లో ప్రారంభమవుతోంది. వీలైనంత వరకూ బీజేపీపై విమర్శలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేసే నేతలు పెరిగిపోతున్నారు. కానీ వారు దర్యాప్తు సంస్థల రాడార్ నుంచి తప్పించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. గత వారం రోజులుగా టీఆర్ఎస్ నేతలు...ఐటీ, ఈడీ విచారణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తాజాగా మల్లారెడ్డి.. వ్యాపార వ్యవస్థ మొత్తంపై ఐటీ చేసిన ఎటాక్‌తో చాలా మందిలో ఆందోళన ప్రారంభమయింది. నెక్ట్స్ తమ వంతేనా అని.. భయం బయటపకుండా టెన్షన్ పడుతున్నారు.
కేసినో కేసుతో ప్రారంభించి.. ఐటీ దాడుల వరకూ !
చీకోటి ప్రవీణ్ కేసినో కేసు అంతా తలసాని శ్రీనివాస్ యాదవ్ చుట్టూ తిరుగుతోంది. ఆయన సోదరులను ... పీఏను ప్రశ్నించారు. కుమారుడికీ నోటీసులు వచ్చాయన్న ప్రచారం జరిగింది. పాటు తాజాగా మల్లారెడ్డి ఇంటిపై దాడులు చేశారు. మల్లారెడ్డి వ్యాపార వ్యవస్థపై ఏకంగా యాభై బృందాలతో దాడులు చేశారు అధికారులు. మల్లారెడ్డి చేసే వ్యాపారాల్లో ఎన్నో లొసుగులు ఉంటాయని.. వాటిని ఐటీ సులువుగా పట్టుకోగదలని అంటున్నారు. రేపు ఎవరిపై చేస్తారో అర్థం కాని పరిస్థితి ఉంది. చాలా మంది ఐటీ, ఈడీ రాడార్‌లో ఉండాలని జాగ్రత్తగా ఉండాలని సీఎం కసీఆర్ కొంత కాలంగా చెబుతూ వస్తున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. తుడిపేసుకోలేని వ్యవహారాలు ఉంటాయి. ఒక దాని తర్వాత ఒకటి బయటకు వస్తూంటాయి. దీంతో ఆయా నేతలకు టెన్షన్ మాత్రం తప్పడం లేదు.
రేపు టార్గెట్ అయ్యే నేత ఎవరు ?
ఇది బిగినింగ్ స్టేజేనని.. టీఆర్ఎస్ ఆర్థిక మూల స్తంభాలుగా ఉన్న ప్రతి ఒక్కరిపై దాడులు జరుగుతాయని భావిస్తున్నారు. గతంలో రియల్ ఎస్టేట్ సంస్థలపై దాడులు చేసినప్పుడు చాలా వరకూ సమాచారం సేకరించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో భాగంగా చేసిన సోదాల్లోనూ మరిన్ని వివరాలు సేకరించారు. గత ఎన్నిమిదేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆర్ధికంగా స్థిరపడ్డారు. వారందరిపై ఐటీ, ఈడీలు దృష్టి పెట్టడం ఖాయమని చెబుతున్నారు. ఎంత పారదర్శకంగా వ్యవహారాలు నడిపినా..ఏదో ఓ లొసుగు బయటపడితే దొరికిపోతామని ఎక్కువ మంది ఆందోళన చెందుతున్నారు. గ్రానైట్ మైనింగ్ కేసే దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. గ్రానైట్ మైనింగ్ లో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం వ్యాపారం ఎవరూ చేయలేరని.. కొన్ని కొన్ని చోట్ల ప్రభుత్వం చూసీ చూడకుండా పోతుందని. ..దాన్నే నేరగా ఇప్పుడు ఈడీ, ఐటీ చూపిస్తున్నాయని నేతలంటున్నారు. అందుకే సోదాలంటేనే వణికిపోతున్నారు.
ధైర్యంగా ఎదుర్కోవాలని.. తిరగబడాలని సూచిస్తున్న కేటీఆర్, కేసీఆర్ !
ఈ దాడులను ధైర్యంగా ఎదుర్కోండి అని కేసీఆర్ చెబుతున్నారు .. తిరగబడాలని కూడా సలహా ఇచ్చారు. కానీ.. పార్టీ నేతల్లో మాత్రం ధైర్యం సన్నగిల్లే ప్రమాదం కనిపిస్తోంది. ఏ చిన్నది దొరికినా వదిలి పెట్టరని..కేసీఆర్ తో శత్రుత్వం వల్ల బీజేపీ తమను టార్గెట్ చే్స్తుందని నమ్ముతున్నారు. ఈ అంశంపై పార్టీ నేతలకు భరోసా ఇచ్చేందుకు కేసీఆర్ లేదా క్యాడర్ అత్యవసరంగా అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం కావాలని అనుకున్నారు. కానీ ఎలాంటి మీటింగ్ జరగలేదు. ప్రస్తుత పరిస్థితులపై కేసీఆర్ స్వయంగా తదుపరి ఏం చేద్దామన్న అంశంపై చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. కేంద్ర దర్యాప్తు సంస్థలను కట్టడి చేసే మార్గం.. తెలంగాణ సర్కార్ ముందు లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
సిట్ పేరుతో ఇస్తున్న నోటీసులు మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయా ?
కేంద్రానికి దర్యాప్తు సంస్థలు ఉంటే... రాష్ట్రానికి లేవా.. ఎంత దూరమైనా చూసుకుందామని .. పార్టీ నేతలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. అయితే రాష్ట్ర దర్యాప్తు సంస్థల అధికారం పరిమితం. కానీ కేంద్రానిది అలా కాదు. ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర కేసులో సిట్ దూకుడు కూడా బీజేపీకి ఆగ్రహం తెప్పిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. బీఎల్ సంతోష్‌కు నోటీసులు ఇవ్వడమే కాకుండా.. అరెస్ట్ చేస్తామన్నట్లుగా సంకేతాలివ్వడం బీజేపీ పెద్దల్లో తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతోందని చెబుతున్నారు. దర్యాప్తు సంస్థలతో పోరాటం చేయడానికి సిద్ధమైతే.. తామూ సిద్ధమని బీజేపీ అనుకుంటోందని తాజా పరిణామాలతో వెల్లడవుతోందంటున్నారు. ముందు ముందు టీఆర్ఎస్ నేతలపై మరింత ఎక్కువగా దర్యాప్తు సంస్థలు విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే టీఆర్ఎస్‌లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.