ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యలో నాణ్యతను పెంచడం ప్రధాన లక్ష్యమని సీఎం జగన్ వెల్లడించారు. ముఖ్యమంత్రి సచివాలయం కార్యాలయంలో ఈ మేరకు ఎంవోయూ పై సీఎం జగన్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.... ప్రభుత్వ విద్యా రంగంలో మరో విప్లమాత్మక అడుగు ముందు పడిందని వెల్లడించారు. ప్రభుత్వ విద్యార్థులకు అందుబాటులోకి ఐబీ సిలబస్ ను ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా ప్రభుత్వ బడిలో చదువుకునే పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఈ సిలబస్ ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఐబీ సిలబస్ ప్రవేశంపై విధి విధానాలు, మార్గదర్శక ప్రణాళికలు తయారు చేయాలని ఇప్పటికే సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.


ఐబీ సిలబస్ ను ప్రవేశపెట్టే నిర్ణయానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత అవి సంస్థతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంవోయూ పై సంతకాలు చేయనున్నారు. ఇందుకోసం సింగపూర్, వాషింగ్టన్ డీసీ, జెనీవా, యుకే  నుంచి ఐబీ సంస్థ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని మాట్లాడారు.


ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ ఐబీ సంస్థ ప్రతినిధులతో మాట్లాడుతూ... " మా పిల్లలను ప్రపంచంలో అత్యుత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం. ఇందుకోసం మీ సహకారాన్ని కోరుతున్నా. ఇక్కడ విద్యార్థులు సంపాదించే సర్టిఫికెట్ ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేలా ఉండాలన్నదే నా ఉద్దేశం. ఐబీ సిలబస్ అన్నది సవాల్ తో కూడుకున్న పని. అందులోనూ ప్రభుత్వ స్కూల్ లలో ప్రవేశపెట్టడం అన్నది మరింత సవాల్ తో కూడుకున్న పని. కానీ సంకల్పం ఉంటే సాధ్యం కానిది అంటూ ఏమీ లేదు. పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. అవన్నీ మీకు తెలిసే ఉంటాయి. పాఠశాల విద్యను అత్యంత నాణ్యంగా తీర్చిదిద్దాం. స్కూళ్లను బాగు చేయడం దగ్గర నుంచి డిజిటలైజేషన్ వరకు అనేక చర్యలు తీసుకున్నాం. ఇందులో భాగంగా పిల్లాడిని స్కూలుకు పంపే తల్లికి కూడా ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ప్రతిరోజు ఒక పిరియడ్ టోఫెల్ పరీక్షకు శిక్షణ ఇస్తున్నాం. అన్ని స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధిస్తున్నాం. దీంట్లో భాగంగానే ఐబీని కూడా తీసుకువచ్చాం. ఇది ఒక రోజుతో సాధ్యం అయ్యేది కాదు. ఒకటో క్లాస్తో మొదలుపెడితే దీని ఫలితాలు పదేళ్ల తర్వాత కనిపిస్తాయి. ఇలా చూసుకుంటే పూర్తిస్థాయిలో రావడానికి పదేళ్లు పడుతుంది. దిగువ స్థాయిలో ఉన్న పేదల వారి జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడమే మా ప్రభుత్వ ఉద్దేశం. ఐబీ భాగస్వామ్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న" అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. 


రాష్ట్రంలో విద్యా రంగం కోసం వేల కోట్లలో ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్ వ్యాకరించారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి కావాల్సిన చదువును అందించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఐబీ డైరెక్టర్ జనరల్ ఒల్లి పెక్కా హీనోనెన్, ఐబీ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ మాట్ కాస్టెల్లో తదితరులు పాల్గొన్నారు.