Bandi Sanjay Political Career Impact: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ ఫైర్‌బ్రాండ్ నాయకుడు బండి సంజయ్ రాజకీయ ప్రస్థానంలో ఇప్పుడు ఒక ఊహించని సంక్షోభం ఎదురైంది. కింది స్థాయి నుంచి కౌన్సిలర్‌గా, ఎంపీగా, ఆపై కేంద్ర మంత్రిగా ఎదిగిన ఒక బలమైన బీసీ నేతకు తన కుమారుడి వ్యవహారశైలి ఇప్పుడు రాజకీయంగా పెద్ద తలనెప్పుగా మారింది. రాజకీయాల్లో స్వయంకృషితో ఎదిగిన నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో బండి సంజయ్ కుమార్ ఒకరు. మున్సిపల్ కౌన్సిలర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీకి ఊపిరిపోసి, నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగిన ఆయన.. ఇప్పుడు కుమారుడు బండి భగీరథ్ చుట్టూ అల్లుకున్న వివాదంతో ఆత్మరక్షణలో పడ్డారు. తన కుమారుడిపై నమోదైన పోక్సో కేసు ఇప్పుడు ఆయన రాజకీయ జీవితానికి ఒక పెద్ద రిమార్కుగా మారే ప్రమాదం కనిపిస్తోంది.
రాజకీయ వారసత్వం - వ్యక్తిగత నడవడిక
సాధారణంగా రాజకీయ నాయకుల పిల్లలు తండ్రి అధికారాన్ని చూసుకుని విర్రవీగుతున్నారనే విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి. గతంలోనూ భగీరథ్ ఒక కాలేజీ విద్యార్థిపై దాడి చేసిన వీడియో వైరల్ అయినప్పుడు బండి సంజయ్ ఇబ్బంది పడ్డారు. తాజాగా ఒక మైనర్ బాలిక విషయంలో పోక్సో కేసు నమోదు కావడం, అది కూడా ఆయన కేంద్ర హోంశాఖలో కీలక బాధ్యతల్లో ఉన్న సమయంలో జరగడం విపక్షాలకు బలమైన ఆయుధంగా మారింది. తండ్రి ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తూ ఎదిగితే, కుమారుడు ఆ పేరును చిక్కుల్లోకి నెట్టడం కార్యకర్తలను కూడా కలవరపెడుతోంది.
ఈ కేసును బండి సంజయ్ పూర్తిగా రాజకీయ కుట్ర గా అభివర్ణిస్తున్నారు. తాను ఒక బీసీ నేతగా ఎదగడాన్ని సహించలేక, తనను నేరుగా ఢీకొనే ధైర్యం లేకనే తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇప్పటికే భగీరథ్ తరపున కరీంనగర్‌లో హనీట్రాప్, బ్లాక్‌మెయిల్ ఆరోపణలతో కౌంటర్ కేసు కూడా ఫైల్ అయింది. అయితే, చట్టం ముందు ఆరోపణలు నిరూపితమయ్యే వరకు ఈ నీలినీడలు ఆయనను వెంటాడుతూనే ఉంటాయి. రాజకీయాల్లో కొన్ని సంఘటనలు తాత్కాలికంగా అనిపించినా, కీలక సమయాల్లో అవి మళ్లీ మళ్లీ తెరపైకి వస్తుంటాయి. ముఖ్యంగా బండి సంజయ్ వంటి నాయకుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగానో లేదా అంతకంటే పెద్ద పదవులకో రేసులో ఉన్నప్పుడు, ప్రత్యర్థులు ఈ కేసును ఉదాహరణగా చూపిస్తూ కుటుంబాన్ని క్రమశిక్షణలో పెట్టుకోలేని వారు రాష్ట్రాన్ని ఏం పాలిస్తారు అనే విమర్శలు చేసే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక చట్టపరమైన చిక్కు మాత్రమే కాదు, ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన పరీక్ష.
నిర్ణయాత్మక తరుణంలో సెట్ విచారణ
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. ఒక సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయనే దానిపైనే బండి సంజయ్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం, బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ రాజీనామాకు డిమాండ్ చేయడం చూస్తుంటే.. ఈ సెగ త్వరగా చల్లారేలా కనిపించడం లేదు. బండి సంజయ్ కింది స్థాయి నుంచి కష్టపడి నిర్మించుకున్న రాజకీయ సామ్రాజ్యం ఇప్పుడు ఒక సున్నితమైన మలుపులో ఉంది. కుమారుడిని సమర్థించుకోవడం తండ్రిగా ఆయన బాధ్యత కావచ్చు, కానీ ప్రజా ప్రతినిధిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఆయన.. చట్టం పట్ల తన నిబద్ధతను ఎలా నిరూపించుకుంటారన్నదే ముఖ్యం. కొన్నాళ్లకు ప్రజలు ఈ విషయాన్ని మర్చిపోయినా, రాజకీయ చదరంగంలో ప్రత్యర్థులు మాత్రం దీనిని ఒక శాశ్వత అస్త్రంగా వాడుకుంటూనే ఉంటారు.
