IAS officers And TDP Leaders: ఆంధ్రప్రదేశ్ రాజకీయ , పరిపాలనా వర్గాల్లో ఐఏఎస్ అధికారులు, అధికార కూటమి నేతల మధ్య రాజుకున్న వివాదం ఇప్పుడు ముదురుతోంది. టీడీపీ నేత, సీడాక్ ఛైర్మన్ దీపక్ రెడ్డి ఐఏఎస్ అధికారులపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు బ్యూరోక్రసీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఐఏఎస్ అధికారులు రహస్యంగా సమావేశమై, ప్రభుత్వం తమకు అండగా నిలబడకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఏపీలో ఐఏఎస్ అధికారుల సైలెంట్ రివోల్ట్ ?
ఆంధ్రప్రదేశ్ పాలనా వ్యవస్థలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. ఇటీవల టీడీపీ నేత దీపక్ రెడ్డి ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి వ్యవస్థకు పట్టిన దరిద్రం, గ్రహణం అని వ్యాఖ్యానించడమే కాకుండా, ఒక అధికారి తన కుమార్తె పెళ్లికి రూ. 1000 కోట్లు కట్నం ఇస్తానని అన్నారంటూ చేసిన ఆరోపణలు ఐఏఎస్ వర్గాలను తీవ్ర అసహనానికి గురి చేశాయి. ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వం నుండి కనీస ఖండన లేకపోవడం, తమ పక్షాన ఎవరూ నిలబడకపోవడంతో ఐఏఎస్ అధికారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
సీనియర్ ఐఏఎస్‌ల రహస్య సమావేశం ?
కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఒక రహస్య సమావేశాన్ని నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. మీడియా డిస్కషన్లలో తమను దొంగలుగా చిత్రీకరిస్తున్నా ప్రభుత్వం మౌనం వహించడంపై వారు చర్చించారు. రాజకీయ నాయకులు చేసే పనులకు ఐఏఎస్ అధికారులు బలిపశువులు అవుతున్నారు.. కానీ విమర్శలు వచ్చినప్పుడు మాత్రం ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు అనే అభిప్రాయం ఐఏఎస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి వారు ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పనితీరులో మార్పు ? ఇకపై ఏ ఫైల్ వచ్చినా దానిని గుడ్డిగా సంతకం చేయకూడదని, ముఖ్యంగా వివాదాస్పదమైన లేదా ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించిన ఫైల్స్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఐఏఎస్ అధికారులు తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. ఏదైనా ఫైల్‌పై అనుమానం ఉంటే లేదా అది నిబంధనలకు విరుద్ధంగా అనిపిస్తే.. నేరుగా ఆమోదించకుండా విల్ చెక్ అని రాసి పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనివల్ల ఆ ఫైల్ ప్రక్రియ నిలిచిపోవడమే కాకుండా, భవిష్యత్తులో ఏదైనా విచారణ జరిగితే తమకు రక్షణగా ఉంటుందని వారు భావిస్తున్నారు. ఏ స్థాయి నాయకులు లేదా మంత్రులు ఒత్తిడి తెచ్చినా సరే, చట్టబద్ధత లేని ఫైళ్లపై సంతకాలు పెట్టే ప్రసక్తే లేదని ఐఏఎస్ అధికారులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనుల వల్ల ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఇప్పుడు కూడా అదే పునరావృతం కాకూడదని వారు కృతనిశ్చయంతో ఉన్నారు.
ఈ పెన్ డౌన్ తరహా నిరసన వల్ల రాష్ట్ర పాలనలో వేగం తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం మరియు బ్యూరోక్రసీ మధ్య ఏర్పడిన ఈ అగాధం సత్వరమే పూడకపోతే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్', ప్రజా పాలన కు విఘాతం కలిగే ప్రమాదం ఉంది. మరి ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగుతారో లేదో వేచి చూడాలి.