Nandamuri Balakrishna: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ అంటూ బాబాయి, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యాఖ్యానించారు. బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్‌పై సినిమా వాళ్లు స్పందించక పోవడాన్ని పట్టించుకోనని అన్నారు. ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్, రోజా స్పందనపై మౌనంగా ఉండటమే మేలని, బురద మీద రాయి వేస్తే మన మీదే పడుతుందంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
ఎన్నికల కోసమే ఎన్టీఆర్ జపం
తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయని కొందరు ఇప్పుడు తన తండ్రి ఎన్టీఆర్ జపం మొదలుపెట్టారని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. త్వరలో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో ఏపీలో జరిగిన పరిణామాలు, చంద్రబాబు హయాంలో చేసిన అభివృద్ధి ఇక్కడ కలిసి వస్తుందన్నారు. చంద్రబాబు నిజాయితీ గురించి అందరికీ తెలిసిందేనని చెప్పారు. కేవలం రాజకీయ కక్షతోనే ఆయనపై అబద్ధపు కేసులు పెట్టారని అన్నారు. రిమాండ్‌లోకి తీసుకున్నాక సెక్షన్‌లు చెబుతున్నారని విమర్శించారు.
తెలంగాణలో టీడీపీ అజ్ఞాతం వీడింది
బీఆర్‌ఎస్ నేతలపై బాలకృష్ణ పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రతిఒక్కరూ బాబు అరెస్టుని ఖండిస్తున్నారని, కానీ తెలంగాణలో కేవలం మూడు రోజుల నుంచి ఖండిస్తున్నారని అన్నారు. కేవలం ఓట్ల కోసం బీఆర్‌ఎస్ నేతలు ఇక్కడ ఎన్టీఆర్ జపం చేస్తున్నారని విమర్శించారు. ఇంతకాలం తెలంగాణలో టీడీపీ అజ్ఞాతంలో ఉందని, ఇప్పుడు మళ్లీ చైతన్యం వస్తోందన్నారు. రాజకీయ లబ్ధి కోసం కాకుండా తెలుగు వారి గౌరవం కోసం పని చేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణలో టీడీపీకి తాను అండగా ఉంటానని అన్నారు. తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు అని చెప్పారు.
తెలంగాణలో టీడీపీ జెండా రెపరెపలాడుతుంది
కేసులకు అరెస్టులకు భయపడమని బాలకృష్ణ అన్నారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతల అరెస్ట్‌పై ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు. ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉద్రిక్తత సృష్టిస్తున్నారని అనడం సరి కాదని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోరాడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు టైం వచ్చిందని, టీడీపీ జెండా తెలంగాణలో రెపరెపలాడుతుందని అన్నారు. తెలంగాణలో పార్టీ పునర్వైభవానికి ప్రతి క్షణం పోరాడతామని, పొత్తుల గురించి చంద్రబాబు నిర్ణయిస్తారని వెల్లడించారు. తెలంగాణలో టీడీపీ లేదన్న వారికి తామంటే ఏంటో చూపిస్తామన్నారు.
కేంద్రం హస్తం ఉందో లేదో అవగాహన లేదు
ఏపీలో ఒక సైకో పరిపాలన నడుస్తుందని బాలకృష్ణ ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమం గాలికి వదిలి ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టే రాజకీయం ఏపీలో నడుస్తుందన్నారు. 17ఏ లేకుండా చంద్రబాబును ఎలా అరెస్టు చేశారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో అవగాహన లేదన్నారు. అనవసరంగా ఎవరిపైనా తాము నిందలు వేయమన్నారు. కేంద్రం కల్పించుకోవాల్సిన అవసరం ఉన్న సమయంలో వారు మాట్లాడకపోవడం వారి విజ్ఞతకే వదిలేయాలని అన్నారు. బీజేపీ అధ్యక్షురాలిగా తమ అక్క పురందేశ్వరి ఉన్నారని, ఆమెతో టచ్‌లో ఉన్నామని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్‌పై తప్పకుండా కేంద్రాన్ని కలుస్తామని అన్నారు.