GHMC Town Planning Building Violations:  హైదరాబాద్ మహానగరంలో గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్ నుంచి మొదలుకొని పాతబస్తీ, మల్కాజిగిరి, ఉప్పల్ వరకు ఏ గల్లీలో చూసినా ఒకే దృశ్యం కనిపిస్తుంది. కేవలం 60 నుండి 100 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న చిన్న ప్లాట్లలో ఏకంగా 5 నుండి 7 అంతస్తులు లేపేస్తున్నారు. ప్లానింగ్ పర్మిషన్లు  ఒకలా ఉంటే, నిర్మాణంలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా 6 అంతస్తుల మ్యాచ్‌బాక్స్ తరహా భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. సెట్‌బాక్స్  లేకపోవడం, ఫైర్ సేఫ్టీ సున్నా కావడం, అసలు పార్కింగే లేకుండా రోడ్లనే ఆక్రమించడం హైదరాబాద్‌ నగర ప్లానింగ్‌ను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఈ భవనాలు కొనుగోలుదారులకు చౌకగా లభిస్తున్నప్పటికీ, నగర భద్రతకు బాంబుల్లా మారాయి.

Continues below advertisement

ఇలాంటి ఇళ్లను కూల్చడం కూడా అసాధ్యమే

ప్రజల్లో ఒక పెద్ద సందేహం నెలకొంది చెరువులు, నాలాలు, చెరువు బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న  హైడ్రా మరి వీధివీధినా వెలిసిన ఈ చిన్న ప్లాట్ల బహుళ అంతస్తుల భవనాలపై కూడా కూల్చివేతల ఆయుధాన్ని ప్రయోగిస్తుందా? విశ్లేషకుల అంచనా ప్రకారం, వీటన్నింటినీ నేలమట్టం చేయడం ప్రభుత్వం ,  హైడ్రా వల్ల అసాధ్యం. నగరంలో ఇలాంటి భవనాలు లక్షల్లో ఉన్నాయి. వాటిని పూర్తిగా కూల్చేస్తే లక్షలాది మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడటమే కాకుండా, నగరంలో ఊహించని శాంతిభద్రతల సమస్యలు, ఆర్థిక సంక్షోభం ఏర్పడతాయి.  నదులు, చెరువులను రక్షించడం ఒకెత్తయితే.. నగర గల్లీల్లో ఏ నిబంధనా లేకుండా వెలుస్తున్న అక్రమ కట్టడాలను నియంత్రించడం మరొకెత్తు. వీటిని కూల్చడం సాధ్యం కాదు కాబట్టి  స్ట్రక్చరల్ ఆడిట్,  భారీ జరిమానాలు  మాత్రమే ప్రభుత్వానికి ఏకైక మార్గం.   ఈ సమస్యను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందున్న వ్యూహాలు 

Continues below advertisement

  భూకంపాలు లేదా చిన్నపాటి ప్రమాదాలు జరిగినా ఈ భవనాలు కుప్పకూలే ప్రమాదం ఉంది. ప్రభుత్వం వీటిని కూల్చలేకపోయినా, ఇంజనీరింగ్ నిపుణులతో భవనం ఎంతవరకు సురక్షితమో తేల్చేందుకు స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఆడిట్  నిర్బంధం చేయవచ్చు.  ప్రమాదకరంగా ఉన్న వాటికి నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించవచ్చు.  నిబంధనలు దాటి కట్టిన అంతస్తులకు వాణిజ్య కేటగిరీ కింద విద్యుత్, తాగునీటి చార్జీలు విధించడం లేదా అదనపు ఆస్తి పన్ను విధించడం ద్వారా బిల్డర్లకు షాక్ ఇవ్వవచ్చు.   అనుమతులు లేని అంతస్తుల విక్రయాలను సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో నమోదు కాకుండా నిలిపివేయడం. బిల్డర్లు నిబంధనలకు విరుద్ధంగా కడితే వాటిని అమ్మే అవకాశం లేకుండా  బ్లాక్ లిస్ట్ చేయవచ్చు.   గతంలో అమలు చేసినట్లు భారీ పినలైజేషన్‌తో కొత్త BPS రూల్స్ తీసుకువచ్చి, అక్రమ నిర్మాణాల నుంచి భారీగా జరిమానాలు వసూలు చేయడం. ఎన్ఓసీ   రాని భవనాలకు విద్యుత్ సప్లై రద్దు చేయడం ద్వారా కట్టడి చేయడం ద్వారా కొంత వరకూ నియంత్రించవచ్చు. 

 సమూల మార్పు రావాలంటే అధికారులపై వేటు పడాల్సిందే! 

100 గజాల ప్లాట్‌లో 6 అంతస్తులు లేస్తుంటే స్థానిక జిహెచ్‌ఎంసి , టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారనేదే ఇక్కడ అసలైన ప్రశ్న. క్షేత్రస్థాయి అధికారుల మామూళ్ల వల్లే ఇవి విచ్చలవిడిగా వెలిశాయన్నది బహిరంగ రహస్యం. కొత్తగా కడుతున్న నిర్మాణాలను ప్రారంభ దశలోనే నిలిపివేయడం, అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టడం ద్వారా మాత్రమే ప్రభుత్వం భవిష్యత్తు అక్రమాలకు అడ్డుకట్ట వేయగలదు. ఇప్పటికే పూర్తయిన 6 అంతస్తుల ఇళ్లను కూల్చివేయడం హైడ్రాకు గానీ, ప్రభుత్వానికి గానీ ఆచరణ సాధ్యం కాదు. కానీ, భారీ ఫైన్లు, సర్వీసుల కోత, స్ట్రక్చరల్ ఆడిట్‌ల ద్వారా వాటిని అదుపు చేస్తూ.. ఇకపై కొత్తగా 100 గజాల్లో ఇటువంటి రాక్షస నిర్మాణాలు జరగకుండా జీహెచ్‌ఎంసీ చట్టాలను కఠినతరం చేయడమే తెలంగాణ ప్రభుత్వం ముందున్న ఏకైక పరిష్కారం.