Rahul Gandhi vs Vijay National Leadership: భారత జాతీయ రాజకీయం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టం. 2029 సార్వత్రిక ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ, ప్రధానమంత్రి రేసు చుట్టూ ఇప్పుడే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ స్పష్టమైన ప్రధాని ముఖచిత్రం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, కాంగ్రెస్‌కు ఏకపక్షంగా సొంత బలం దక్కక, ప్రాంతీయ మిత్రపక్షాల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ప్రధానమంత్రి అభ్యర్థిత్వం అతిపెద్ద చిక్కుముడిగా మారుతుంది. గత చరిత్రను గమనిస్తే, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి బలమైన ప్రాంతీయ పార్టీలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఏకగ్రీవంగా అంగీకరించడంలో ఎప్పుడూ సంకోచిస్తూనే ఉన్నాయి.

Continues below advertisement

మిత్రపక్షాలకు ఆమోదయోగ్యమైన నాయకుడు విజయ్? 

ఇలాంటి పరిస్థితుల్లోనే మిత్రపక్షాలకు అందరికీ ఆమోదయోగ్యమైన ఒక సర్వసమ్మత నాయకుడి అన్వేషణ ప్రారంభమవుతుంది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో 1996లో హెచ్.డి. దేవేగౌడ, ఐ.కె. గుజ్రాల్‌ వంటి నాయకులు అనూహ్యంగా ప్రధాని పీఠాన్ని అధిరోహించిన సందర్భాలు ఉన్నాయి. సరిగ్గా ఈ సమీకరణాల్లోనే, తమిళనాడు ముఖ్యమంత్రి , తమిళగ వెట్రి కజగం అధినేత  జోసెఫ్ విజయ్ పేరు జాతీయ స్థాయిలో చర్చకు వస్తోంది.  సంకీర్ణ రాజకీయాల్లో విపక్ష ప్రాంతీయ పార్టీలు తమ కంటే బలమైన జాతీయ నేతను ప్రధానిగా అంగీకరించడానికి ఇష్టపడవు.  అక్కడ వివాదరహితుడు, అందరికీ సర్దుబాటు అయ్యే కొత్త ముఖానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి.   ఇటీవల వెలువడిన  సర్వేలో ప్రధాని రేసులో నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ తదుపరి స్థానంలో   అనూహ్యంగా విజయ్ మూడో స్థానంలో నిలిచారు. ఇది టీవీకే శ్రేణుల్లోనే కాకుండా జాతీయంగా  చర్చనీయాంశమైంది.

Continues below advertisement

టీవీకే  విజయ్ ఫర్ PM  ప్రచారం

తమిళనాడులోని టీవీకే మంత్రులు, సీనియర్ నేతలు  విజయ్ కేవలం తమిళనాడుకే పరిమితం కాదని, ఉత్తరాది ప్రజలు కూడా ఆయన వైపే చూస్తున్నారని వ్యాఖ్యానించడం కాంగ్రెస్-టీవీకే కూటమిలో  విబేధాలకు దారితీసింది.  విజయ్‌కి ఏ జాతీయ పార్టీతోనూ దీర్ఘకాల శత్రుత్వం లేదు. దక్షిణాదికి చెందిన ప్రజాదరణ పొందిన నాయకుడు కావడం, సిద్ధాంతపరమైన తీవ్రమైన మరకలు లేకపోవడం వల్ల ప్రాంతీయ పార్టీల అధినేతలకు రాహుల్ కంటే విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా మద్దతు ఇవ్వడం సులువుగా మారవచ్చు. 

కాంగ్రెస్ తీవ్ర వ్యతిరేకత

విజయ్‌ని ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందిస్తోంది. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ  అధ్యక్షుడు మాణికం ఠాగూర్ దీనిని టీవీకే నేతల  ఫ్యాన్ క్లబ్ మానసిక స్థితి గా అభివర్ణించడమే కాక, 2029లో రాహుల్‌ను ప్రధానిగా అంగీకరించకపోతే తమిళనాడు కేబినెట్ నుంచి కాంగ్రెస్ మంత్రులు తప్పుకుంటారని హెచ్చరించే స్థాయికి విభేదాలు వెళ్లాయి. అయినప్పటికీ, ఎన్నికల అనంతర సమీకరణాల్లో సీట్ల సంఖ్యే కీలక పాత్ర పోషిస్తుంది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాలు ఎప్పుడూ ఒకే  లైన్‌లో సాగవు. కేంద్రంలో అధికార పీఠాన్ని దక్కించుకోవడంలో కాంగ్రెస్ సంఖ్యాబలం తగ్గి, రాహుల్ గాంధీ పేరుపై మిత్రపక్షాల మధ్య అంగీకారం కుదరకపోతే.. ప్రత్యామ్నాయంగా దక్షిణాది నుంచి విజయ్ లాంటి పాపులర్ మాస్ లీడర్  ఎదిగే అవకాశాలను ఏమాత్రం కొట్టిపారేయలేం.