BRS News :  తెలంగాణ భవన్‌లో జరిగిన భారత రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను గట్టిగానే హెచ్చరించారు. దళిత బంధు పథకంలో కమిషన్లు తీసుకుంటున్న వారి లిస్ట్ తన దగ్గర ఉందని తోకలు కత్తిరించేస్తానని హెచ్చరించారు. ఆ ఒక్కటే కాదు.. అనేక అంశాల్లో కేసీఆర్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో అంతర్గత విబేధాలు, క్యాడర్ కు అందుబాటులో ఉండకపోవడం సహా.. పలు అంశాలపై మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యేల విషయంలో కేసీఆర్ కఠినంగా ఉన్నారని అందరికీ టిక్కెట్లు ఉండకపోవచ్చన్న ప్రచారం ఊపందుకుంది. 


సిట్టింగ్‌లలో చాలా మందికి నిరాశ తప్పదా?


గతంలో ఎప్పుడు కార్యవర్గ సమావేశం జరిగినా కేసీఆర్  పార్టీ నేతలందరికీ.. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ఓ భరోసా ఇచ్చేవారు.   సిట్టింగ్‌లు అందరికీ మళ్లీ టిక్కెట్లు ఇస్తామని.. నియోజకవర్గాలకు వెళ్లి పని చేసుకోవాలనిచెప్పేవారు. కానీ ఈ సారి టోన్ కాస్త మారింది.  ఇప్పటి వరకూ కేసీఆర్ .. కేటీఆర్ చేసిన  హెచ్చరికల ప్రకారం చాలా మందికి టిక్కెట్లు డౌట్ అని ప్రచారం ప్రారంభమయింది.  ఐ ప్యాక్ టీం ప్రస్తుతం టీఆర్ఎస్‌కు  పని చేయడం లేదు. కానీ గతంలో పని చేసినప్పుడు సగం మందికిపైగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని వారికి టిక్కెట్లు ఇస్తే గెలవరని సూచించినట్లుగా లీక్ అయింది. దానికి తగ్గట్లుగానే అప్పట్లో కేటీఆర్ కూడా.. ఎవరికీ టిక్కెట్ గ్యారంటీ లేదని.. సర్వేల్లో అనుకూలంగా వచ్చే వారికి మాత్రమే టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. పనితీరును మార్చుకోవాలని సిట్టింగ్‌లకు సూచించారు. దీంతో దాదాపుగా యాభై మంది ఎమ్మెల్యేలకు ఈ సారి టిక్కెట్ ఉండదన్న ప్రచారం ఉద్ధృతంగా సాగింది. అదే సమయంలో అలాంటి ఎమ్మెల్యేల పేర్లు కొన్ని తెరపైకి వచ్చాయి. బీజేపీ వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందని తెలియగానే.. టీఆర్ఎస్ హైకమాండ్ అప్రమత్తమయినట్లుగా కనిపిస్తోంది. సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు ఉంటాయని స్పష్టం చేసింది. అయితే ఇది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడకుండా వ్యూహం అని భావించే వాళ్లూ లేకపోలేదు. 
 
గత ఎన్నికల్లో ముగ్గురికి తప్ప సిట్టింగ్‌లందరికీ సీట్లు !


2018లో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లిన సమయంలో పూర్తి స్థాయిలో కసరత్తు చేసి అసెంబ్లీని రద్దు చేశారు. ఇలా అసెంబ్లీ రద్దుపై గవర్నర్‌కు లేఖ ఇచ్చి.. వెంటనే టీఆర్ఎస్‌ భవన్‌కు వచ్చి అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ఆందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ సహా ముగ్గురికి తప్ప .. అందరికీ టిక్కెట్లు ఖరారు చేశారు. పార్టీలో అసంతృప్తి వస్తుందని తెలిసినా వెనక్కి తగ్గలేదు. చివరికి అందర్నీ బుజ్జగించారు. అవినీతి ఆరోపణలతో  మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తాటికొండ రాజయ్యకు కూడా కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారు. అదే ఫార్ములాని ఈ సారి కూడా పాటిస్తారని.. తమకే సీట్లు వస్తాయని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆశ పడుతున్నారు.  ఈ సారి కూడా టిక్కెట్లపై కసరత్తును సీఎం కేసీఆర్ దాదాపుగా పూర్తి చేశారు. అభ్యర్థుల జాబితా రెడీ అయిందని  బీఆర్ఎస్ సీనియర్లు గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటికే టిక్కెట్లు కన్ఫర్మ్ అయిన సిట్టింగ్‌లకు సమాచారం చేరింది. చాలా మంది తమకే టిక్కెట్లు ఖరారు చేసిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు అంటూ చెప్పుకొస్తున్నారు. 


ఈ సారి పోటీ కోసం ఎదురు చూస్తున్న కీలక నేతలు !


తెలంగాణలో టీఆర్ఎస్‌లో అన్ని నియోజకవర్గాల్లో టిక్కెట్ కోసం గట్టి పోటీ ఉంది. ఒక్కో నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు పోటీగా మరో ముగ్గురు.. నలుగురు సీటు కోసం చూస్తున్నారు.  ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో చాలా మందిపై అసంతృప్తి ఉందని తేలడంతో తమకు అవకాశం వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కొంత మంది నేతలకు హైకమాండ్ నుంచి కూడా భరోసా లభించింది. కానీ ఇప్పుడు కేసీఆర్ చేసిన ప్రకటనతో వారిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.  పార్టీ టిక్కెట్ రాదని తెలిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఫిరాయించడానికి సిద్ధంగా ఉంటారు. రాజకీయాల్లో ఇది సహజం. అందుకే  కేసీఆర్ ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది కాబట్టి సర్వేల పేరుతో వారిని హడల గొట్టడం కన్నా.., ఇప్పటికే అందరికీ టిక్కెట్లు అనే మాట చెబితే సరిపోతుందని ప్రకటించారని అంటున్నారు. ఈ సారి ఎన్నికలకు కేసీఆర్ అత్యత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని.. గెలుపు గుర్రాలకు మాత్రమే సీట్లిస్తారంటున్నారు.