తండ్రి స్థానంలో ఎలాగైనా పాగా వేయాలన్న తపనో తెలియదు.. తండ్రి తరువాత వారసత్వం తనకే దక్కాలన్న ఆత్రుతో తెలియదు. మొత్తం మీద తనయుని తాపత్రయం మాత్రం చర్చకు దారితీస్తోంది. తండ్రి అరోగ్య పరిస్థితుల వల్ల తానే రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెప్పుకుంటున్న మంత్రి కుమారుడికి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. తాజాగా అమలాపురం అల్లర్ల కేసులకు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపించిన కొందరు మీరు అసలు ఏ హోదాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరుగుతున్నారని ప్రశ్నించడంతో మళ్లీ చర్చల్లోకి ఎక్కారు ఇంతకీ ఎవరా తనయుడు.
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సొంత నియోజకవర్గం అమలాపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నియోజకవర్గంలో కార్యక్రమం టార్గెట్ పూర్తికాలేదు. అయితే ఇప్పటికే అమలాపురం అర్బన్, రూరల్, ఉప్పలగుప్తం మండలాల్లోని పలు ప్రాంతాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చాలా వరకు పూర్తి అయినా ఇంకా అల్లవరం మండలంలో చాలా గ్రామాలు పెండింగ్‌లో ఉండిపోయాయి. దీంతో వేగంగా టార్గెట్ పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తుండగా మంత్రి తనయుడు శ్రీకాంత్ ఆ బాధ్యతలో నిమగ్నమయ్యారు. నియోజకవర్గంలో అన్నీ తానై నడిపిస్తున్నారు. ఈనేపథ్యంలో పలు చోట్ల చేదుఅనుభవాన్ని ఆయన చవిచూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
వెంటాడుతోన్న అమలాపురం అల్లర్ల కేసు
అల్లవరం మండలంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీలోనే రెండు వర్గాల మధ్య రగడ నెలకొంది. ఇదే ప్రాంతానికి చెందిన చొల్లంగి రమణ అనే కార్యకర్త అమలాపురం అల్లర్ల ఘటనలో అమాయకులమైన వారిపై కేసులు పెట్టారని ప్రశ్నించాడు. అంతేకాకుండా అసలు మీరు ఏ హోదాతో ఇక్కడికి వచ్చారని ప్రశ్నించడం పెద్ద దుమారమే రేపింది. దీంతో అక్కడున్న మరికొంత మంది దీనిని తప్పుపట్టడం ఇలా మొత్తం పెద్ద దుమారమే లేచినంతపనైంది. ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగి రసాభాసగా మారి తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఏమైనా ఉంటే మంత్రి విశ్వరూప్‌ను అడగాలని ఓ వర్గం అంటే అలా అయితే ఈయన ఎందుకొచ్చాడని మరో వర్గం ఇలా మాటలయుద్ధమే నడిచింది. పరిస్థితిని గ్రహించిన మంత్రి తనయుడు సర్ధిచెప్పి అక్కడి నుంచి వెనుతిరగాల్సి వచ్చింది.
అసంతృప్తితోనే ఎంపీ దూరంగా..
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్ పాల్గొన్నప్పుడు అమలాపురం ఎంపీ చింతా అనురాధకు తగిన ప్రాధాన్యతనిచ్చి ఆమెతో కలిసే అడుగులు వేసేవారు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రి తనయుడు శ్రీకాంత్ అన్నీ తానై పక్కనున్న వారికి కనీసం మాట్లాడే అవకాశం లేకుండా చేసుకుపోతున్నారని దీంతో విసుగెత్తిన ఎంపీ కార్యక్రమానికే దూరం అయిపోయారని పార్టీలోనే చెప్పుకుంటున్నారు. కోడూరుపాడు అనే ప్రాంతంలో పాల్గొన్న ఎంపీ మంత్రి తనయుడు శ్రీకాంత్ వ్యవహారశైలి నచ్చకే అక్కడి నుంచి అర్ధంతరంగా వెనుతిరిగారని పలువురు చెబుతున్నారు. ఇటీవలే విజయవాడలో జరిగిన ఎస్పీ నాయకుల సమాశంలో ఎంపీ మాట్లాడిన మాట వివరం తెలుసుకోకుండా మంత్రి విశ్వరూప్ కూడా ఎంపీ ఆమె అలా మాట్లాడడం ఆమె విజ్ఞతకే వదలేస్తున్నానని అనడం కూడా పెద్ద దుమారమే రేపింది. ఇంతకీ ఎంపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండానే మాట్లాడినట్లుగా భావించి మంత్రి అలా మాట్లాడడంతో ఎంపీ వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట.
ఐ.ప్యాక్ టీం ఎంటర్‌తో సద్దుమనిగిన వ్యవహారం..
ఇటీవల నియోజకవర్గంలోని తుమ్మలపల్లి గ్రామ కమిటీ అధ్యక్షున్ని ఆకస్మికంగా మార్చిన మంత్రి తనయుని తీరుపై ఆగ్రామంలోని పలువురు నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రికి ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో ఐ.ప్యాక్ ప్రతినిధి ప్రభాకరన్ సీన్‌లోకి ఎంటర్ అయ్యే పరిస్థితి వచ్చింది. అవరమైతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని వారు పట్టుపట్టి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడంతో చివరకుఈ విషయం మంత్రి విశ్వరూప్ దృష్టికి వెళ్లి ఆయన పాత కమిటీనే కొనసాగిస్తాం.. అది తనకు తెలియకుండా జరిగిందని నచ్చచెప్పడంతో వివాదం సద్దుమనిగింది. ఏది ఏమైనా మంత్రి తనయుని తాపత్రయం మాత్రం అటు తండ్రికి కొత్తచిక్కులు తీసుకొస్తుండగా పార్టీకు మంచి కంటే నష్టమే జరుగుతోందని పలు గుసగుసలు వినిపిస్తున్నాయి.