తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. అధికార పార్టీలో మొదటి జాబితా సిద్ధమైపోయిందని కూడా టాక్ నడుస్తోంది. ఎక్కువ మంది సిట్టింగ్‌లకే ఛాన్స్ ఇస్తారని కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఆశావాహులు మాత్రం పట్టు వీడటం లేదు. ఆఖరి నిమిషం వరకు తమకే టికెట్ ఇవ్వాలని అధినాయకత్వం వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు.
మనసులో మాట
మరికొందరు నేతలు బహిరంగంగానే తామే పోటీలో ఉంటామని చెప్పుకుంటున్నారు. అలాంటి నేతల్లో హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఒకరు. గతంలో ఇబ్రహిం పట్టణం నుంచి పోటీ చేసిన ఈయన ఇప్పుడు నియోజకవర్గం మారాలని చూస్తున్నారు. ఇప్పుడ ఆయన ఫోకస్ అంతా నాగార్జున సాగర్ నియోజకవర్గంపై పెట్టినట్టు కనిపిస్తోంది.
నాగార్జు సాగర్‌పై గురి
ఫోకస్ పెట్టడమే కాదు అక్కడి నుంచే పోటీ చేస్తానని కూడా చంద్రశేఖర్ రెడ్డి చెప్పేశారు. అధినాయకత్వం తనకు టికెట్ ఇవ్వాలని రిక్వస్ట్ కూడా పెట్టుకున్నారట. పేరుతో ఇది పెద్ద నియోజకవర్గమైనా అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయని అంటున్నారు. వాటన్నింటినీ ఫుల్ ఫిల్ చేయాలంటే తనకు అవకాశం ఇవ్వాలని అధినాయకత్వాన్ని కోరుతున్నారు. స్థానికంగా ఉండే ప్రజలు కూడా నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అభ్యర్థిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు చంద్రశేఖర్ రెడ్డి.
నల్గొండ జిల్లా పెద్దవూరులో పలు కార్యక్రమాలు చేపట్టేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మనసులో మాటను చెప్పారు. ఇవాళ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మంత్రి జగదీశ్ రెడ్డి హాజరుకాబోతున్నట్టు పేర్కొన్నారు.
అల్లు అర్జున్ ప్రచారం
తాను నాగార్జున సాగర్‌లో పోటీ చేస్తే అల్లు అర్జున్ కచ్చితంగా వచ్చి ప్రచారం చేస్తారని చెప్పుకుంటున్నారు చంద్రశేఖర్ రెడ్డి. మరి ఇప్పుడు బీఆర్‌ఎస్ అధినాయకత్వం చంద్రశేఖర్ రెడ్డి అభ్యర్థనను ఓకే చెబుతుందా లేకుంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకే మరో ఛాన్స్ ఇస్తుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్ష్.
నాగార్జు సాగర్ నియోజకవర్గం నుంచి గతసారి నోముల నర్సింహయ్య విజయం సాధించారు. ఆయన అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పుడు కేసీఆర్ నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌ను పోటీలో నిలిపారు. గెలిపించుకున్నారు. ఆయనపై మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. 2018, 2020లో కూడా ఆయనకు ఓటమి తప్పలేదు. ప్రస్తుతం ఆయన్ని కూడా మార్చాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. వయోభారం కారణంగా ఆయన్నితప్పించి అక్కడ జానారెడ్డి కుమారుడికి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గం ఒకటి. 2007లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా దీన్ని కొత్తంగా ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి. కొత్త నియోజకవర్గం ఏర్పాటు అయినప్పటి నుంచి రెండుసార్లు(2009, 2014) జానారెడ్డి విజయం సాధించారు. తర్వాత అంటే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డి ఓటమి పాలయ్యారు. 2020లో జరిగిన ఉపఎన్నికల్లో కూడా ఓడిపోయారు.