BJP TDP Friends :    ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చంద్రబాబు నిలబడి రెండు నిమిషాలు మట్లాడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో అనేక రాజకీయ చర్చలకు కారణం అవుతోంది. తెలంగాణలో టీడీపీ మద్దతు బీజేపీకి.,.. ఏపీలో బీజేపీ మద్దతు టీడీపీకి ఉండేలా  ఓ ఫార్ములాను సిద్దం చేసుకున్నారని వైఎస్ఆర్‌సీపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. దీంతో మళ్లీ తెలంగాణలో టీడీపీ - బీజేపీ రాజకీయాలపై చర్చ ప్రారంభమయింది. నిజంగానే ఈ రెండు పార్టీలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయా  అంటే.. టీడీపీ వర్గాలు కూడా అదేమీ లేదంటున్నాయి. 


తెలంగాణలో టీడీపీ ఓటు బ్యాంక్ పై అన్ని పార్టీల గురి ! 


తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు తెలంగాణలో కీలకంగా ఉంటాయని అన్ని రాజకీయ పార్టీలూ భావిస్తూంటాయి. తెలుగుదేశం పార్టీ యాక్టివ్‌గా లేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందో లేదో స్పష్టత లేదు. కానీ కనీసం నలభై నియోజకవర్గాల్లో ప్రభావం చూపించే స్థితిలో ఉంటుందన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. అందుకే ఇటీవల అన్ని రాజకీయ పార్టీలు టీడీపీ సానుభూతిపరులను టార్గెట్‌గా చేసుకుని రాజకీయం చేస్తున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ జయంతి వేడుకలను టీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు.  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఎన్టీఆర్ ను ఆరాధనగా చూస్తున్నారు. పొగుడుతున్నారు. అదే సమయంలో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా టీడీపీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడరు.వీరందరి వ్యూహం టీడీపీ సానుభూతి పరుల ఓట్లు సంపాదించుకోవడమే. 


ఏపీలో తప్ప తెలంగాణపై దృష్టి సారించలేని స్థితిలో చంద్రబాబు !
  
తెలంగాణలో అధికారంలోకి రావడం బీజేపీ లక్ష్యం. అందుకు చంద్రబాబు సహకారం తీసుకోవడానికి బీజేపీ వెనుకాడకపోవచ్చుననే అంచనా ఉంది. చంద్రబాబుకు ఇప్పుడు ఏపీలో పార్టీని అధికారంలోకి తీసుకు రావడం కీలకం. ఇప్పుడు ఆయన తెలంగాణపై దృష్టి సారించలేరు. ఏపీలో పరిస్థితులు మెరుగుపర్చుకోవడానికి ఆయన బీజేపీ మద్దతు కోరే అవకాశం ఉంది. దానికి  ప్రతిఫలంగా తెలంగాణలో మద్దతు ఇస్తామని ఆయన  బీజేపీకి ప్రతిపాదించి ఉండవచ్చని వైఎస్ఆర్‌సీపీనేతలు అంచనా వేస్తున్నారు. అదే చెబుతున్నారు. 


గతంలో పొత్తులతో మంచి ఫలితాలు !


గతంలో టీడీపీ - బీజేపీ కలిసి పొత్తులు పెట్టుకుని పోటీ చేసినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ టీడీపీ - బీజేపీ పొత్తులు పెట్టుకుని పోటీ చేసినప్పుడు బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేల సీట్లను పెంచుకుంది. విభజన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ - టీడీపీ పొత్తు ద్వారా ఐదు ఎమ్మెల్యేల సీట్లనూ గెల్చుకుంది. కానీ ముందస్తు ఎన్నికల్లో పొత్తు లేకపోవడంతో ఒక్క స్థానానికే పరిమితైంది. ఇప్పుడు టీడీపీ తెలంగాణలో దాదాపుగా ఉనికి కోల్పోయింది.కానీ మిగిలి ఉన్న ఓటు బ్యాంక్  మాత్రం క్రియాశీలకంగా మారింది. ఇప్పుడు అదే ఆ పార్టీ  మద్దతు కోసం బీజేపీ ప్రయత్నించడానికి కారణమనే అంచనాలు ఉన్నాయి. 


టీడీపీ మద్దతు వల్ల బీజేపీకి మైనస్ కూడా !


తెలంగాణలో బీజేపీకి టీడీపీ మద్దతు వల్ల ప్లస్‌తో పాటుమైనస్ కూడా ఉంటుంది. చంద్రబాబు బీజేపీ రూపంలో మళ్లీ తెలంగాణలోకి వస్తున్నారని టీఆర్ఎస్ అధినేత ప్రచారం చేసే అవకాశం ఉంది. ఆ సెంటిమంట్  వర్కవుట్ అయితే బీజేపీకి చంద్రబాబు.. టీడీపీ వల్ల కలిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ. అయితే ఆయన తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోకపోతే అది ప్లస్ అయ్యే అవకాశం ఉంది. 
  
సజ్జల రామకృష్ణారెడ్డికి స్పష్టమై నసమాచారం ఉండి చెప్పారో.. లేకపోతే రాజకీయ అనుభంతో ఊహించి చెప్పారో కానీ..  ఏపీలో టీడీపీకి..  తెలంగాణ బీజేపీకి ఉభయ తారక మద్దతుతో రెండు పార్టీలు లాభం పొందాలనుకుంటే మాత్రం రాజకీయాలను మార్చేసే ఆలోచనే అని అనుకోవచ్చు. ఇదే నిజమైతే ముందు ముందు  కొన్ని కీలక  పరిణామాలు చోటు చేసుకునే చాన్స్ కనిపిస్తోంది.