Karnataka Congress government : సిద్దరామయ్య నేతృత్వంలోని కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడినట్లుగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అంటే తిరుగులేని నేత. కానీ ఆయనపైనే లోకాయుక్త ఆదేశాల మేరకు కేసు నమోదయింది. మైసూరులో జరిగిన భూ స్కామ్‌లో సిద్దరామయ్య సతీమణి ప్రయోజనం పొందారని వచ్చిన ఆరోపణలు చివరికి ఆయనపై కేసు నమోదుకు కారణం అయ్యాయి. గవర్నర్ విచారణకు అనుమతి ఇవ్వడం...దాన్ని హైకోర్టు సమర్థించడంతో లోకాయుక్త ఆయననే మొదటి నిందితునిగా చేర్చి కేసు పెట్టేసింది. ఏ 2 సిద్ధరామయ్య సతీమణి పేరును చేర్చారు. 


సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్లు


ముఖ్యమంత్రిపై నేరుగా లోకాయుక్తలో కేసు నమోదు కావడంతో ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బీజేపీ నేతలు ఆందోళనలు ప్రారంభించారు. అయితే  సిద్ధరామయ్య మాత్రం  తాను రాజీనామా చేసేది లేదని తన ప్రభుత్వంపై బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. లోకాయుక్త కేసుల కారణంగా గతంలో ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నప్పుడు యడ్యూరప్ప కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు సిద్ధరామయ్యకు కూడా తప్పని పరిస్థితి వస్తుందని కర్ణాటకలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 


సంఘ్‌లోకి వచ్చాక మంచి చేస్తున్నారు, నడ్డా వ్యాఖ్యలపై బహిరంగ చర్చ అవసరం లేదు: ఆర్‌ఎస్‌ఎస్‌


కాంగ్రెస్‌లో అప్పుడే నెక్ట్స్ సీఎం రేస్ !


కాంగ్రెస్‌లో ఏ మాత్రం ఐక్యత లేకపోవడంతో ఆ పార్టీకి పెద్ద మైనస్ గా మారింది. సిద్దరామయ్య రాజీనామా చేస్తే తర్వాత ఎవరు అన్నదానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. పార్టీలో ఇప్పటికే రేసు ప్రారంభించారు. పలువురు నేతలు హైకమాండ్ పెద్దల్నికలుసుకుని వారి గుడ్ లుక్స్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ పోటీ పడ్డారు. సిద్ధరామయ్యను సీఎంను చేసి డీకే ను డిప్యూటీని చేశారు. రెండున్నరేళ్ల తర్వాత డీకేను సీఎంను చేయాలన్న ఒప్పందం కుదిరిందన్న ప్రచారం అప్పట్లో జరిగింది. దీని ప్రకారం ఇప్పుడు సిద్ధరామయ్య రాజీనామా చేయాల్సి వస్తే శివకుమార్ సీఎం కావాలి. కానీ కాంగ్రెస్ పార్టీలో అలా ఉండదు. అందుకే.. శివకుమార్ తో పాటు చాలా మంది ఇతర సీనియర్లు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఓ వైపు సిద్ధరామయ్య తాను రాజీనామా చేసే ప్రశ్నే లేదని చెబుతున్నా.. ఎవరి రాజకీయం వారు చేసుకుంటున్నారు. 



Also Read: సీనియర్ సిటిజన్స్‌కు ఇండియన్ రైల్వే కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయాలు మీకు తెలుసా! 45 ఏళ్ల నుంచే మహిళలకు




మరో వైపు తమ ప్రభుత్వాన్ని బీజేపీ టార్గెట్ చేసిందని ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున డబ్బులు ఆఫర్ చేస్తున్నారని కొంత కాలంగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో జేడీఎస్,కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఆపరేషన్ కమల్ ద్వారా బీజేపీ కూల్చేసి తాము అధికారం చేపట్టింది. ఇప్పుడు కూడా అలాటిదే చేస్తున్నారని అంటున్నారు. కానీ.. కాంగ్రెస్ పార్టీకి క్లియర్ మెజార్టీ ఉంది. అయితే.. కాంగ్రెస్ నుంచే ఓ పెద్ద నేత భారీగా ఎమ్మెల్యేలను తీసుకుని వస్తే ఏదైనా జరగవచ్చన్న ప్రచారం ఊపందుకుంటోంది. అందుకే కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. వచ్చే రెండు, మూడు నెలల్లో ఏ దశకు తిరుగుతాయో ఊహించడం కష్టమే.