YSRCP Tensions :   జగన్మోహన్ రెడ్డి ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్లే అన్నట్లుగా ఉండే వైఎస్ఆర్‌సీపీలో ఇప్పుడు  పరిస్థితి మారిపోయింది. నేరుగా సీఎం జగన్‌పై ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యేలు తెర ముందుకు వస్తున్నారు. సీక్రెట్‌గా కూడా అంతే ఘోరంగా మాట్లాడుకుంటున్నారని వీడియోలు బయటకు వస్తున్నాయి.ఇంకా ఎంత మంది ఎమ్మెల్యేలు సీఎం జగన్ పనితీరుపై భిన్నంగా మాట్లాడుతున్నారో ఇంటలిజెన్స్‌కే తెలుసు. అయితే ఏం జరిగినా ఆంతా సీక్రెట్‌గా ఉండాల్సినవి బయటకు వస్తున్నాయి. ఈ కారణంగానే వైఎస్ఆర్‌సీపీలో అలజడి కనిపిస్తోంది. దీనంతటికి కారణం ఇంటిలిజెన్స్ అత్యుత్సాహమే అన్న అసంతృప్తి వైఎస్ఆర్‌సీపీలో కనిపిస్తోంది. 


కోటంరెడ్డి లాంటి విధేయుడే తట్టుకోలేకపోతున్నారా ?


కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్న వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆయన వైఎస్ఆర్‌సీపీకి విధేయుడైన నేత. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆకర్ష్ లో భాగంగా ఆయనకూ పిలుపు వెళ్లింది. పైగా ఆయనపై బెట్టింగ్ కేసులు..ఇతర కేసులు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ఆ కేసుల్ని ఎదుర్కొని.. రెండు , మూడు సార్లు కంటతడి పెట్టుకున్నారు కానీ టీడీపీలో చేరాలని అనుకోలేదు. కానీ ఇప్పుడు తన పార్టీ అధికారంలోకి వచ్చాక.. నాలుగేళ్లు కాక ముందే.. ప్రతిపక్ష పార్టీలోకి వెళ్తానని అంటున్నారు. అంటే... తన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..  పార్టీపై .. సీఎం జగన్‌పై ఎంతో అభిమానంతో ఉన్న ఆయన... అధికారంలోకి వచ్చాక ఎందుకు మారిపోయారు. అప్పట్లో అధికారంలో ఉండి పిలిచిన పార్టీలోకి వెళ్లని ఆయన.. ఇప్పుడు అడిగి మరీ ఆ పార్టీలోకి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? 


వైఎస్ఆర్‌సీపీలో అంతర్గతంగా ఏం జరుగుతోంది ?


కోటంరెడ్డి బయటపడ్డారు.. కానీ బయటపడని వాళ్లు చాలా మంది ఉన్నారని ఆ పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంటుంది. స్వయంగా కోటంరెడ్డి కూడా తనకు ముఫ్ఫై మందికిపైగా ఎమ్మెల్యేలు .. ఇద్దరు ఎంపీలు ఫోన్ చేశారని.. తమపై కూడా నిఘాపెట్టారన్న అనుమానం ఉందని వారు బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు. అప్పటికే ఆనం రామనారాయణరెడ్డి బయటపడ్డారు. తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందన్నారు. ఇతర జిల్లాల్లోనూా ఇలాంటి వారు ఉన్నారని.. స్థానికంగా ప్రచారం జరుగుతూ ఉంటుంది.  అయితే.. రాజకీయాల్లో ఇలాంటి ప్రచారాలు సహజమే. బయటపడినప్పుడే సంచలనం అవుతుంది. సాధారణంగా.. టిక్కెట్లు రావు అనుకున్నప్పుడు ఎన్నికల ముందు బయటపడతారు. అప్పుడు చేసే విమర్శలకు పెద్దగా విలువ ఉండదు. కానీ ఇప్పుడు వైసీపీలో ఏడాది తర్వాత ఎన్నికలు ఉన్నా..  వీర విధేయ ఎమ్మెల్యేలే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది వైఎస్ఆర్‌సీపీ ఊహించని  పరిణామం. 


పార్టీ హైకమాండ్‌కు ఎమ్మెల్యేల మధ్య ఇంటలిజెన్సే చిచ్చు పెడుతోందా ?


 ఓ ప్రైవేటు సంభాషణలో సీఎం జగన్ గురించి ఇలా మాట్లాడవంట కదా.. అని ఇంటలిజెన్స్ చీఫ్ నేరుగా ఎమ్మెల్యేకు ఆడియో టేప్ పంపడం ఎవరూ ఊహించని విషయం. నిజంగా అలాంటి విషయం తెలిసి ఉంటే.. ఇంటలిజెన్స్ అధికారులు ప్రభుత్వ పెద్దలకు తెలియచేస్తే..  వారు పార్టీ  పరంగా తమ ఎమ్మెల్యేను చక్కదిద్దుకుంటారు. అదిరాజకీయంగా జరగాల్సిన పద్దతి. కానీ ఇక్కడ ఇంటలిజెన్స్ చీఫ్ నేరుగా ఎమ్మెల్యేకు ఫోన్ చేసి బెదిరించడంతో.. సీన్ మారిపోయింది. అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఇలా జరగడం అంటే.. ఆయన తన పార్టీ..తనపై నమ్మకం కోల్పోయింది కాబట్టి ఇక ఆ పార్టీలో ఉండటం ఎందుకన్న ఆలోచనకు వస్తారు. కోటంరెడ్డి విషయంలో అదే జరిగింది. అది వైసీపీలో కల్లోలానికి కారణం అవుతోంది. అంటే ఇక్కడ చిచ్చు పెట్టింది ఇంటలిజెన్స్ అధికారులే అనుకోవాలి. వారు అత్యుత్సాహంతోనే పరిస్థితి ఇక్కడి వరకూ వచ్చిందన్న  ఆందోళన వైఎస్ఆర్‌సీపీలో కనిపిస్తోంది. 


ఏ పార్టీ అధికారంలో ఉన్న పొలిటికల్ ఇంటలిజెన్స్ తాను చేయాల్సిన పని తాను చేస్తుంది. అది సమాచారం సేకరించడం వరకే. కానీ ఆ సమాచారాన్ని తీసుకుని తానే పార్టీని చక్కదిద్దాలనకుుంటే మాత్రం కల్లోలం ప్రారంభమవుతుంది. అలాంటి అవకాశం అధికార పార్టీ పెద్దలు అధికారులకు ఇవ్వకూడదు. అధికారులు తీసుకోకూడదు. తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీలో నూ అదే జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.