BJP Free Manifesto : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవలి కాలంలో ఉచిత పథకాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. ఉచిత పథకాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం ఏర్పడుతోందని ఆయన పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై రాజకీయ దుమారం కూడా రేగింది.అయితే ఉచిత పథకాల విషయంలో మోదీ గట్టిగానే తన అభిప్రాయానికి కట్టుబడ్డారు. కానీ విచిత్రంగా బీజేపీ మాత్రం ఎన్నికల్లో గెలవడానికి ఆ ఉచిత పథకాలకే ప్రాధాన్యం ఇస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్ణాటక పర్యటనలో ఉన్నప్పుడే బీజేపీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అందులో కళ్లు తిరిగిపోయేటన్ని ఉచిత హామీలు ఉన్నాయి.
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఉచిత హామీలు !
బీజేపీ మేనిఫెస్టోలో మొత్తం 16 ప్రధాన హామీలు..103 ముఖ్యమైన హామీలు ఉన్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని ఘనంగా ప్రకటించింది. ఉగాధి, వినాయకచవితి, దీపావళి పండగ కానుకగా ఉచిత సిలిండర్లు పంపిణీ చేస్తామని మ్యానిఫెస్టోలో తెలిపింది. ఇక ఎన్నికల ప్రకటన విడుదలకు ముందు కన్నడ సీమలో రచ్చరచ్చగా మారిన పాలు, పెరుగు వివాదంలో ఓటర్లను శాంతించే రీతిలో పోషణ పథకం కింద ఉచితంగా పాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. పెరుగును దహీ అనాలని.. నందిని మిల్క్ డెయిరీకి ప్రత్యామ్నాయంగా అమూల్ పాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో పోషణ పథకం కింద ఉచితంగా నందిని పాలు పంపిణీ చేస్తామని కన్నడిగుల ఆగ్రహాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు కాషాయ నేతలు. ఇవి కాకుండా ఉచిత ఆహార పథకంలో భాగంగా నెలనెలా ఐదు కిలోల చిరుధాన్యాలు అందజేస్తామని ప్రకటించింది బీజేపీ. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 10 లక్షల గృహ నిర్మాణాలు చేపడతామని, ఇళ్లులేని పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని వెల్లడించింది. దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీ ఇలాంటి హామీలు ఇవ్వలేదు.
బీజేపీ చెప్పేదానికి, చేసే దానికి పొంతన లేదని విమర్శలు
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతల ఉచిత హామీల వ్యవహారం దుమారం రేపుతోంది. ఎన్నికల ప్రచారసభల్లో బీజేపీ నేతలు ఇబ్బడిముబ్బడిగా ఉచిత హామీలు గుప్పిస్తున్నారని, ఓటమి తప్పదని తెలిసి.. బీజేపీ బడా నేతలే ఉచిత హామీల ప్రకటన చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రాజకీయ పార్టీల ఉచిత పథకాలకు మేం పూర్తి వ్యతిరేకం అని ప్రధాని మోదీ అంటున్నారు. అయితే ఉచితాలపై ప్రధాని ప్రకటనపై అప్పట్లో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పన్నులు చెల్లించేవారి సొమ్మును ఉచిత పథకాలకు ఖర్చు పెట్టడంపై వారంతా ఎంతో ఆవేదన చెందుతున్నారని, తమ ప్రభుత్వం పన్నుల సొమ్మును ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నామని..దీంతో కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు సంతోషంగా ఉన్నారంటూ అప్పట్లో మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి.
మోదీ మాటకు విలువ ఇవ్వనట్లేనా ?
ప్రతిపక్ష ప్రభుత్వాలు పేదలకోసం చేపట్టే సంక్షేమ పథకాలను ఉచితాలని బీజేపీ నేతలు, ప్రధాని మోదీ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ, ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ కూడా అంతకుమించి ఉచిత హామీలిస్తున్నది. మొన్నటికి మొన్న గుజరాత్‌లో విద్యాశాఖ మంత్రి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ప్రతి కుటుంబానికి ఏటా రెండు వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. మధ్యప్రదేశ్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓటేస్తే ఇంటికి ఒక ఆవును ఉచితంగా ఇస్తామని బీజేపీ గతంలో హామీ ఇచ్చింది. ఇప్పుడు కర్ణాటకలో ఉచిత హామీలు గుప్పిస్తున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు.=దక్షిణాదిలో ఆ పార్టీకి ఉన్న ఏకైక రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి బీజేపీ సిద్ధాంతాలను పక్కనపెట్టారని అంటున్నారు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇవి ఉచిత పథకాలు కాదని.. సంక్షేమం అని బీజేపీ నేతలు వాదిస్తున్నారు.