తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల కీలక నివేదిక బయటకు వచ్చింది. ఈ నివేదిక జైలు అధికారులు, ప్రభుత్వ అధికారులు చెబుతున్న దానికి వైద్యుల నివేదిక భిన్నంగా ఉంది. 


చంద్రబాబు ఛాతీ, చేతులు, మెడ,గడ్డం, వీపు, తదితర శరీర భాగాల్లో దద్దుర్లు, స్కిన్ ఎలర్జీ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈనెల 12 వ తేదీన సాయంత్రం 4:30 గంటలకు జీజీహెచ్ సూపరిండెంట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి 5:30 గంటల వరకు చంద్రబాబును పరీక్షించి, సూర్యనారాయణ, సునీతదేవిలతో కూడిన వైద్యుల బృందం జైలు అధికారులకు నివేదిక అందజేసింది. చంద్రబాబుకు చల్లని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు, వివిధ రకాల మందులను వైద్యులు సిఫార్సు చేశారు. 


రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యుల నివేదిక ప్రకారం చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు ఆయన వ్యక్తిగత వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వైద్యుల నివేదికను బయటపెట్టకుండా ఇప్పటివరకు అంతా బాగుందంటూ జైలు అధికారులు చెబుతున్నారని కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా చంద్రబాబును పరీక్షించిన వైద్యుల నివేదిక ఉందని ఆయన వ్యక్తిగత వైద్యులు తేల్చి చెబుతున్నారు.  తీవ్రమైన ఎండల కారణంగా కొద్ది రోజులుగా డీహైడ్రేషన్తో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని వారు అభిప్రాయపడ్డారు.


చంద్రబాబుకి హైపర్ ట్రాఫిక్ కార్డియో మయోపతి సమస్య ఉందని, ఈ సమస్య కారణంగా డీహైడ్రేషన్ తో గుండెపైన ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలను ప్రభుత్వం, అధికారులు చిన్నవి చేసి చూపిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బయటపడిన డాక్టర్ల నివేదికతో చంద్రబాబు ఆరోగ్యం పై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఆందోళన మరింత పెరిగింది. మరోవైపు చంద్రబాబు ఆరోగ్యం పై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


అనారోగ్య కారణాలతో టిడిపి అధినేత చంద్రబాబును అంతమొందించే కుట్ర జరుగుతోందని నారా లోకేష్ ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చంద్రబాబును రిమాండ్ లోనే ఉంచాలని కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. చంద్రబాబు జీవితం ప్రమాదంలో ఉందని, భద్రతలేని జైలులో ఆరోగ్యం క్షేనించేలా చేసి ప్రాణహాని తలపెడుతున్నారని ఆరోపించారు. ఏ తప్పు చేయని చంద్రబాబు పట్ల ఈ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యం పై జైలు అధికారుల తీరు సందేహంగా ఉందని, ఆయనకు ఏ హాని జరిగినా జగన్ సర్కారు, జైలు అధికారులదే బాధ్యత అని లోకేష్ స్పష్టం చేశారు.


జైలులో దోమలు ఎక్కువ ఉన్నాయన్న అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చన్నీళ్లు ఇస్తున్నారన్న లెక్క చేయలేదన్నారు. సరిగా తిరగని ఫ్యాన్ పెట్టారని, వీటన్నిటి వల్ల చంద్రబాబు ఆరోగ్యం క్షీణించి  బరువు తగ్గిపోయారని చెప్పారు. దీంతో అలర్జీ వచ్చి డిహైడ్రేషన్ కు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యం క్షీణిస్తున్న జైలు అధికారులు ఎవరు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.