Chandrababu Security : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఎన్‌ఎస్‌జీ భద్రత ఉంటుంది. తిరుపతిలో ఆయనపై నక్సలైట్లు దాడి చేసిన తర్వాత .. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకు ఎన్‌ఎస్‌జీ భద్రతను కల్పించింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా.. ప్రతిపక్ష నేతగా ఉన్నా ఆ సెక్యూరిటీ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన సెక్యూరిటీని మరింత  పెంచారు. ఒక్క షిఫ్ట్‌కు పన్నెండు మంది కమెండోలు ఆయనకు రక్షణగా ఉంటారు. రెండు షిఫ్టుల్లో ఇరవై నాలుగు మంది కమెంటోలు అత్యాధునిక ఆయుధాలతో రక్షణ కల్పిస్తారు. అయితే ఇంత హఠాత్తుగా చంద్రబాబుకు ఎందుకు రక్షణ పెంచారు ? అసలు తెర వెనుక ఏం జరుగుతోంది ? 


చంద్రబాబు ఇల్లు, టీడీపీ ఆఫీసును పరిశీలించిన ఎన్‌ఎస్‌జీ చీఫ్  


చంద్రబాబుకు ముప్పు ఉందని ఆయనకు రక్షణ కల్పిస్తున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ భావించింది.  ఏపీలో ఆయన భద్రతకు సంబంధించి అనేక సందేహాలు వెల్లువెత్తూండటంతో పాటు టీడీపీ కార్యాలయంపై దాడి… ఇంట్లోకి కొంత మంది వైసీపీ నేతలు చొచ్చుకొచ్చే ప్రయత్నం చేయడం వంటివి జరగడంతో ఎన్‌ఎస్‌జీ అప్రమత్తమయింది. అ ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీనీ రివ్యూ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ప్రత్యేక బృందం ఏపీలోని టీడీపీ కార్యాలయంలో.. అలాగే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పరిశీలన జరిపారు. భద్రతాపరమైన సమీక్ష చేశారు. అలా చేసిన తర్వాతి రోజే చంద్రబాబుకు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.  


రాష్ట్ర పోలీసుల భద్రత సందేహాస్పదంగా మారిందా ? 


రాష్ట్ర ప్రభుత్వం తరపున లభిస్తున్న భద్రత పేలవంగా ఉంటోందన్నఆరోపణల ుఉన్నాయి.  నిజానికి పర్యటనల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పోలీసు విభాగమే భద్రతా పరమైన ఏర్పాట్లు చేయాలి. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వారికి చేయాల్సిన భద్రతా ఏర్పాట్లు వేరేగా ఉంటాయి. అయితే అలాంటి ప్రోటోకాల్‌ను పోలీసులు పట్టించుకోవడం లేదు సరి కదా.. వైఎస్ఆర్సీపీ నేతలు.. కార్యకర్తలు చంద్రబాబుపైకి దూసుకు వస్తున్నా చలనం లేకుండా ఉంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  ఏపీలో రాజకీయంలో వ్యక్తిగత శత్రుత్వ స్థాయి పెరిగిపోవడం..  దాడులు కూడా జరుగుతున్న కారణంగా  ఎన్‌ఎస్‌జీ అప్రమత్తయిందని చెబుతున్నారు.   ఇప్పటి వరకూ డీఎస్పీ ర్యాంక్ అధికారి పర్యవేక్షణలో ఆయన భద్రత ఉండేది. ఇనుంచి డీఐజీ స్థాయి అధికారి భద్రతను పర్యవేక్షించనున్నారు. 


టీడీపీ ఫిర్యాదులతోనే భద్రత పెంచిందా ?
 
చంద్రబాబు భద్రతపై టీడీపీ నేతలు చాలా కాలంగా కేంద్రానికి ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు.  సాధారణంగా కేంద్రం.. ఫిర్యాదులు..విజ్ఞప్తుల మేరకే ఈ స్థాయి భద్రతా ఏర్పాట్లు చేయదు. ఆయనకు ముప్పు ఉందని స్పష్టమైన సమాచారం వస్తేనే చేస్తుంది. అలాంటి ఖచ్చితమైన సమాచారం ఉంటే.. ఈ స్థాయిలో భద్రతను పెంచుతారని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు భద్రత విషయంలో ఏపీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు వేసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. అదో ప్రజాస్వామ్య నిరసన అన్నట్లుగా ప్రకటనలు చేశారు. దీంతో పోలీసులు కూడా అచేతనం అయ్యారని.. ఎన్‌ఎస్‌జీ గుర్తించినట్లుగా తెలుస్తోంది.


చంద్రబాబుకు ముప్పుపై కేంద్ర ఇంటలిజెన్స్ నుంచి పక్కా సమాచారం ఉందా !?


ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉంటున్నాయి. ఎక్కడికి వెళ్లినా దాడులు, ధర్నాలు ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ఇంటలిజెన్స్‌కు చంద్రబాబు భద్రత.. ఆయనకు ఉన్న ముప్పుపై స్పష్టమైన సమాచారం వచ్చి ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే రెండింతలు భద్రత పెంచారని అంటున్నారు. అయితే ఎలాంటి సమాచారం వచ్చింది.. ఎలాంటి ముప్పు చంద్రబాబుకు ఉందన్నది ఎప్పటికీ బయటకు రాలేదు. సీక్రెట్ గానే ఉంచుతారు. అయితే ఏ వైపు నుంచి ముప్పు ఉందో.. దాన్ని కనిపెట్టుకుని ఉంటారు. అందుకే భద్రత పెంచారని .. సెక్యూరిటీ రంగ నిపుణులు చెబుతున్నారు.