Congress On Sanatana Remarks: సనాతన ధర్మాన్ని రూపుమాపాలంటూ డీఎంకే నేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తాను తన మాటలకు కట్టుబడి ఉన్నానని ఎలాంటి కేసులకైనా భయపడేది లేదంటూ మాట్లాడారు. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ కేసీ వేణుగోపాల్ స్పందించారు. తమ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుందని అన్నారు. కానీ ప్రతి రాజకీయ పార్టీకి దాని అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు. మేము ప్రతి ఒక్కరి భావాలను గౌరవిస్తామని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీది ' సర్వ ధర్మ సంభవ' సిద్ధాంతమని, మా అభిప్రాయం స్పష్టంగా ఉందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ నేడు (సెప్టెంబర్ 4న) దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్పష్టంచేశారు.
ఉదయనిధి స్టాలిన్ తన వ్యాఖ్యలతో భారతదేశ సంస్కృతిని, చరిత్రను అవమానిస్తున్నారంటూ బీజేపీ నేతలు అమిత్‌షా, జేడీ నడ్డా తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్ష కూటమి I.N.D.I.Aపై విమర్శలు గుప్పించారు. ఉదయనిధి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు సైలెంట్ ఉంటోందంటూ బీజేపీ నేత రవి శంకర్ ప్రసాద్ కూడా ఈరోజు ఉదయం ప్రశ్నించారు. ' రాహుల్ గాంధీ జీ, మీ మిత్రపక్షాలు సనాతన ధర్మాన్ని బహిరంగంగా అవమానిస్తుంటే మీరు మౌనంగా ఎందుకు ఉన్నారు? మీరు గుడికి ఎందుకు వెళ్తారు? అదంతా నటననా?' అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పై విధంగా స్పందించారు.
శనివారం చెన్నైలో తమిళనాడు రచయితలు, కళాకారుల సంఘం 'సనాతన నిర్మూలన' పేరిట నిర్వహించిన కార్యక్రమానికి డీఎంకే నేత ఉదయనిధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మం మలేరియా, డెంగీ , కరోనా లాంటిదని దానిని పూర్తిగా నిర్మూలించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్నింటిని మనం వ్యతిరేకిస్తే సరిపోదని, పూర్తిగా రూపుమాపాలని సంచలనంగా మాట్లాడారు. సనాతన ధర్మం సమాతనత్వానికి, సామాజిక న్యాయానికి వ్యతిరేకం అని, ప్రజలను కులాల పేరిట విభజించిందని పేర్కొన్నారు. మహిళలపై వివక్షను ప్రోత్సహించిందని అన్నారు. దాన్ని నిర్మూలించాల్సిందే అంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. ఆయన మాటలను బీజేపీ తోపాటు విశ్వ హిందూ పరిషత్, పలు హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పందిస్తూ సనాతన ధర్మాన్ని పాటించేవారు జనాభాలో 80 శాతం ఉన్నారని, వారిని సామూహికంగా చంపేయాలని ఆయన అభిప్రాయపడుతున్నారంటూ విమర్శించారు. ప్రతిపక్ష కూటమిలో డీఎంకే ముఖ్య పార్టీ అని, కాంగ్రెస్‌తో ఎంతో కాలంగా మైత్రి ఉందని, కూటమి సమావేశాల్లో దీనిపైనే అంగీకారం కుదిరిందా అంటూ ప్రశ్నించారు. అయితే ఉదయనిధి మాత్రం తాను తన మాటలకు కట్టుబడి ఉన్నానని, అయితే తాను సనాతన ధఱ్మాన్ని పాటించేవారిని చంపాలనుకోవడం లేదని అన్నారు. సనాతన ధర్మం వల్ల బాధితులైన అణగారిన వర్గాల వారి తరఫున మాత్రమే మాట్లాడానని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై ఎలాంటి సవాళ్లైనా ఎదుర్కోవడానికి తాను సిద్ధమే అని అమిత్ మాలవీయ ట్వీట్‌పై ఉదయనిధి స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో స్పష్టంచేశారు.