CPI Narayana: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చే సీట్లు తమకు వెంట్రుకతో సమానమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కలిసి వస్తేనే కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తామన్నారు. లేదంటే తమకు బలం ఉన్న 20 స్థానాలు, సీపీఎంకు బలం ఉన్న కొన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. జాతీయ స్థాయిలో పొత్తులు వేరు, రాష్ట్ర స్థాయిలో పొత్తులు వేరు అన్నారు.


కేసీఆర్ కుటుంబం బీజేపీకి వత్తాసు పలుకుతోందని సీపీఐ జాతీయ నేత నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం ఒకప్పుడు బీజేపీపై ఆరోపణలు చేసిందని, ఇప్పుడేమో ఆ పార్టీకి వత్తాసు పలుకుతోందని విమర్శించారు. లిక్కర్‌ కేసులో కవిత అరెస్టు చేస్తారనే  కేసీఆర్ బీజేపీకి మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు. 


ఎంఐఎం కూడా దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలంగా ఉందన్నారు. అందుకనే వారిపై ఐటీ దాడులు జరగవన్నారు. ఎంఐఎంపై ఐటీ, ఈడీ దాడులు చేస్తే కోట్లాది రూపాయలు బయటపడతాయని ఆరోపించారు. బీజేపీకి ఎంఐఎం ఊడిగం చేస్తుందని అందుకే ఇప్పటి వరకు ఆ పార్టీ నేతలపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు జరగలేదన్నారు. అలాగే ఏపీలో సైతం సీఎం జగన్ ​మోహన్ ​రెడ్డి తన కేసుల నుంచి తప్పించుకోవడానికే బీజేపీకి మద్దతిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకే దేశవ్యాప్తంగా రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయన్నారు. 


ఎంఐఎం మీద గట్టిగా పోరాటం చేసిన వ్యక్తి  కిరణ్ ​కుమార్‌ ​రెడ్డి అని చెప్పారు. ఇప్పుడు ఆయన కూడా బీజేపీ తీర్థం తీసుకున్నారన్నారు. ఎంఐఎం, బీఆర్‌ఎస్ పౌల్ గేమ్ ఆడుతున్నాయని, జాతీయ స్థాయిలో తిరిగి బీజేపీని గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా పోరాడుతున్నాయని అన్నారు. జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీసేందుకు కుట్రలు చేస్తోందని, అలాంటి వాటిని తాము అంగీకరించేది లేదన్నారు. బీజేపీకి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వారి పరిస్థితి ధృతరాష్ట్ర కౌగిలిగా మారుతుందన్నారు. ఎన్డీఏకి వత్తాసు పలుకుతున్న పార్టీలు ఈవిషయాన్ని గుర్తించాలన్నారు. తాము మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.


బీజేపీకి అనుకూలంగా కేసీఆర్ రాజీ పడ్డాడు కాబట్టే కవిత లిక్కర్ స్కాం కేసుల నుంచి తప్పించుకుందన్నారు. జగన్ మోహన్ రెడ్డి సైతం బీజేపీతో రహస్య పొత్తులో ఉన్నాడని అందుకే ఇంత కాలం బెయిల్‌పై ఉన్నాడని అన్నారు. దేశ చరిత్రలో సుధీర్ఘ కాలం పాటు బెయిల్‌పై ఉన్నాడని, ఇప్పటి వరకు అలాంటి వారెవరూ బెయిల్‌పై లేరని అన్నారు. విదేశాలకు పోవాలంటే కోర్టులకు వెళ్లి అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి జగన్‌ది అన్నారు. 


ఇండియా కూటమిని చూసి బీజేపీ భయపడుతుందని నారాయణ ధ్వజమెత్తారు. ఇండియా కూటమి సమావేశం జరగ్గానే వెంటనే ప్రత్యేక నోటిఫికేషన్ ఇచ్చి పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తోందని ఆక్షేపించారు. రామ్‌​నాథ్‌ కోవింద్ నేతృత్వంలో వేసిన కమిటీని తాము బహిష్కరిస్తున్నామని చెప్పారు. ఈ కమిటీని అందరం కలిసికట్టుగా నిర్వీర్యం చేయాలని ఇతర పార్టీలను కోరారు. దేశం మొత్తం ఒకే పార్టీ ఉండాలని మోదీ చూస్తున్నారని అన్నారు. జమిలీ ఎన్నికలు అంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. 


ఇస్రోకు రాజకీయ రంగు పూస్తారా?
అంతరిక్ష రంగంలో భారత ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న ఇస్రోను ప్రతి ఒక్కరూ అభినందించాలని సీపీఐ నేత నారాయణ అన్నారు. అయితే ఇస్రో విజయాలకు కూడా మతం రంగు పులమాలని ప్రధాని మోదీ చూస్తున్నారని మండిపడ్డారు. ఇస్రో కృషిని రాజకీయాలకు వాడుకునేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు.